మద్యం కుంభకోణం సొమ్ముతో ముంబైలో బంగారం కొనుగోలు

జగన్  హయాంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.   ఈ కేసులో ఏ49గా ఉన్న ముంబైకి చెందిన అనిల్ చోఖ్రాను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని సిట్ విచారించింది. ఈ విచారణలో  మద్యం కుంభకోణం ముడుపుల సొమ్మును ఎలా దారి మళ్లించారో అనిల్ చోఖ్రా పూసగుచ్చినట్లు వివరించినట్లు తెలిసింది.  ఏపీ మద్యం కుంభకోణంలో ఏ1 రాజ్ కేసిరెడ్డికి చెందిన బినామీ డిస్టిలరీల నుంచి వచ్చిన రూ.78 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బంగారం, నగదు రూపంలోకి మార్చినట్లు చోఖ్రా అంగీకరించారని సమాచారం.

ఊరూపేరూ లేని వ్యక్తుల ఆధార్, పాన్ కార్డులు సేకరించి ముంబైలో 30కి పైగా షెల్ కంపెనీలను సృష్టించి.. ఆ కంపెనీలలోకి ఆదాన్, లీలా, ఎస్‌పీవై ఆగ్రోస్ వంటి డిస్టిలరీల నుంచి వచ్చిన డబ్బును  మళ్లించారు. ఆ తర్వాత ముంబైలోని చాముండ బులియన్స్ యజమాని , ఇతర గోల్డ్ డీలర్ల సిండికేట్ ద్వారా ఆ సొమ్ముతో బంగారం కొనుగోలు చేశారు. చివరిగా.. దుబాయ్‌లో ఉన్న చేతన్ కుమార్ తండ్రికి సంబంధించిన ఆర్థిక నెట్‌వర్క్‌ను ఉపయోగించి మొత్తం నల్లధనాన్ని వైట్‌గా మార్చినట్లు  సిట్ విచారణలో చోఖ్రా వివరించినట్టు తెలిసింది. చోఖ్రా విచారణలో    ఆదాన్‌ డిస్టిలరీస్‌, లీలా డిస్టిలరీస్‌, ఎస్‌పీవై ఆగ్రోస్‌ నుంచి ముంబైకి చెందిన అనిల్‌ చోఖ్రా సృష్టించిన సెల్‌ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి రూ.78 కోట్లు బదిలీ అయినట్లు సిట్ ఆధారసహితంగా కనుగోంది.

చోఖ్రాను ముంబైలో అదుపులోకి తీసుకుని.. విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి.. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే.  కాగా సిట్ అధికారులు ముంబైకి చెందిన చాముండ బులియన్స్ యజమాని చేతన్ కుమార్ కు మంగళవారం (డిసెంబర్ 2) విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. అయితే అతడు ఆరోగ్యం బాలేదంటూ, తన తమ్ముడు రోణక్ కుమార్ ను పంపించాడు. మంగళవారం (డిసెంబర్ 2)   సిట్‌ కార్యాలయానికి వచ్చిన రోణక్‌ను అధికారులు చోఖ్రాతో కలిపి సాయంత్రం వరకు విచారించారు. అయితే రోణక్ తనకేమీ తెలియదంటూ ప్రశ్నలకు సమాధానం దాటవేయడంతో.. చేతన్ కుమార్ ను బుధవారం (డిసెంబర్ 3) విచారణకు రావాలంటూ ఆదేశించి, అంత వరకూ విజయవాడలోనే ఉండాల్సిందిగా రోణక్ కు ఆదేశించారు.  ఆ సమయంలో అన్న చేతన్ కుమార్ తో మాట్లాడతానంటూ సిట్ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన రోణక్ కుమార్ పారిపోవడానికి చేసిన ప్రయత్నాన్ని సిట్ భగ్నం చేసింది. గన్నవరం విమానాశ్రయంలో అతడిని అరెస్టు చేసింది.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu