వీర విధేయ గెహ్లాట్ తిరుగు బాటు ?

రాజస్థాన్  ముఖ్యమంత్రి , సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ గెహ్లాట్‌... గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడు. విధేయతకు పర్యాయపదంగా నిలిచే  గెహ్లాట్  సోనియా గాంధీ ఆదేశాలను తూ..చ తప్పకుండా పాటిస్తారు. అందుకే ఆమె ఏరి కోరి పార్టీ అధ్యక్ష పదవికి, అధికార అభ్యర్ధిగా ఆయన్ని ఎంపిక చేశారు. ఆమె  ఆదేశాల మేరకే రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి వదులుకుని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసేందుకు గెహ్లాట్  అంగీకరించారు.

అలాగే, రాహుల్ గాంధీ అన్నా గెహ్లాట్ కు చాలా చాలా గౌరవం. రాహుల్  గీత గీస్తే  గెహ్లాట్‌ ఆ గీత దాటరు గాక దాటరు. అందుకే పార్టీ అధ్యక్ష పదవితో పాటుగా  రాష్ట్ర ముఖ్యంత్రి పదవిలోనూ కొనసాగాలని మనసులో కోరిక ఉన్నా,రాహుల్ గాంధీ, నో.. కుదరదు అనగానే మనసులోని కోరికను మనసులోనే తుడి చేశారు. ఒకరికి ఒకే పదవి అనే సూత్రం పాటించాల్సిందేనని రాహుల్ హుకుం జారీ చేయగానే, గెహ్లాట్‌ మరో మాట లేకుండా, జీ హుజూర్  అని వచ్చేశారు.  ఆదివారం (సెప్టెంబర్ 25) సాయంత్రం వరకూ మీడియాలో ఇదే కథ నడిచింది . కానీ అ తర్వాతనే అసలు కథ మొదలైంది.

 ఢిల్లీలో సోనియా గాంధీ వద్ద,  తిరువనంతపురం (కేరళ) లో రాహుల్ గాంధీ వద్ద తలూపి వచ్చిన, ‘వీర విధేయ’ గెహ్లాట్ తానేమిటో, తన సత్తా ఏమిటో చూపించారు. ముఖ్యమంత్రి కుర్చీ దిగిపోవలసిన సమయం వచ్చే సరికి, ఆయనలోని అపరిచితుడు బయటకు వచ్చారు. గెహ్లాట్ వారసుని ఎన్నిక/ఎంపిక కోసం వచ్చిన కేంద్ర పరిశీలకులకు ఒకసారిగా చుక్కలు చూపించారు. కాంగ్రెస్ సంస్కృతీ, ఆనవాయితీ ప్రకారం, గెహ్లాట్ వారసుని ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వదిలేస్తూ, రాజస్థాన్ సీఎల్పీ ఏక వాక్య తీర్మానం  చేస్తుందని భావించిన కేంద్ర పరిశీలకులు మల్లికార్జున ఖర్గే, అజయ్‌ మాకెన్‌లు అక్కడ జరుగతున్న పరిణామాలు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ఏకవాక్య తీర్మానం కోసం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశానికి గెహ్లాట్ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. అంతే కాదు, అధిష్టానం సచిన్ పైలట్‌ కు అవకాశం ఇస్తే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామని ఎదురు తిరిగారు. పైలట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రిని  చేయడానికి వీల్లేదంటూ గెహ్లాట్  వర్గం ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. సీఎల్పీ భేటీ నిర్వహించి తదుపరి సీఎంను ఎన్నుకోవాలని నిర్ణయించగా.. అంతకుముందే గెహ్లాట్‌ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నివానికి వెళ్లి పదవులకు రాజీనామా లేఖలు అందించారు. దీంతో అధిష్ఠానం సీఎల్పీ భేటీని  రద్దు చేసి.. గెహ్లాట్,  పైలట్‌ సహా సీఎల్పీ భేటీకి పరిశీలకులుగా వెళ్లినవారిని వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించింది. అయితే, ఏది ఏమైనా గెహ్లాట్  అయన వర్గం సచిన్ పైలెట్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే ఆలోచన కూడా అంగీకరించదనే విషయం అయితే  ఈ పరిణామాలతో క్లియర్ కట్ గా స్పష్టమైందని, పరిశీలకులు అంటున్నారు. 

అయితే, ఈ పరిణామం  రాజస్థాన్ కు సంబంధించినదే, అయినా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరుగతున్న వేళ అశోక్ గెహ్లాట్ అనూహ్యంగా ఎగరేసిన తిరుగు బాటు జెండా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి సవాలుగా మారిందని అంటున్నారు. ఈ ప్రభావం ఇతర రాష్ట్రాలలోనూ ఉంటుందని అంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం గెహ్లాట్ వర్గం తిరుగు బాటుకు తలోగ్గితే పార్టీపై అసలే అంతంత మాత్రంగా ఉన్న పట్టు మరింతగా సన్నగిల్లిపోతుంది, అలాగని చర్యలు తీసుకుంటే, మొదటికే మోస మొస్తుంది. మరో వంక పార్టీ అధ్యక్ష పదవికి ఒక తిరుగుబాటు నేతను ఎన్నుకుంటే అది పార్టీ  ప్రతిష్టను మరింత దిగజార్చి వేస్తుందని, పరిశీలకులు భావిస్తున్నారు.  

మరో  సంవత్సర కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో పార్టీలో ఏర్పడిన సంక్షోభం ఎటు దారి తీస్తుందో ఉహించడం కూడా కష్టమే అంటున్నారు. ఒక విధంగా పంజాబ్ అసెంబ్లీ  ఎన్నికలు ముందు ఆ రాష్ట్రంలో ఎదురైన సమస్యలే, ఇప్పుడు రాజస్థాన్ లోనూ తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.  అలాగే, ఈ అన్నిటికీ ప్రధానంగా పార్టీ అధిష్టానమే బాధ్యత వహించవలసి ఉంటుందని అంటున్నారు. అలాగే సంక్షోభ సమయంలో, రంగంలోకి దిగి పరిస్థతిని చక్కదిద్దే సామర్ధ్యమున్న అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్ వంటి ట్రబుల్ షూటర్స్   లేక పోవడం కూడా ఒక్కొక రాష్ట్రం పార్టీ చేజారి పోవడానికి కారణంగా భావిస్తున్నారు.