వరదనీటిలో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్లు.!

posted on: Jul 9, 2026 10:13AM

మహారాష్ట్ర రాయగఢ్‌ జిల్లాలో   భారీ వర్షాలు,  వరదలు  బీభత్సం సృష్టిస్తున్నాయి.  జనజీవనం పూర్తిగా స్తంభించిపోవడమే కాకుండా, ఇప్పుడు ప్రజల ప్రాణాలకు సరికొత్త ముప్పు వచ్చి పడింది. పణ్వేల్ తాలూకా పరిధిలోని  హెచ్‌పీసీఎల్ పాతాళగంగా ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ వరద నీటిలో మునిగిపోవడంతో అక్కడ ఉన్న సుమారు మూడు వేల గ్యాస్ సిలిండర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ సిలిండర్లలో పూర్తిగా గ్యాస్ నింపిన వాటితో పాటు, ఖాళీ సిలిండర్లు కూడా ఉన్నాయి. ప్లాంట్ నుంచి కొట్టుకొచ్చిన ఈ వేలాది సిలిండర్లు ఇప్పుడు పాతాళగంగా నదిలోకి, దాని పరిసర ప్రాంతాల్లోకి భారీగా వచ్చి చేరుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. 

నదిలో కానీ, లేదా నదీ తీర ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా ఎల్పీజీ సిలిండర్లు కొట్టుకొచ్చి కనిపిస్తే, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. వరద ఉధృతికి కొట్టుకొచ్చిన ఆ సిలిండర్లు  లీక్ అయ్యే ప్రమాదం   ఉందని అధికారులు చెబుతున్నారు. ఉత్సాహంతోనో లేక ఉచితంగా దొరికాయనో వాటిని ఇళ్లకు తీసుకెళ్లడం, వాటి రెగ్యులేటర్లను తెరిచేందుకు ప్రయత్నించడం లాంటివి చేస్తే పేలుళ్లు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

వరద ప్రవాహంలో  కొట్టుకుపోయిన మూడు వేల సిలిండర్లను   సురక్షితంగా స్వాధీనం చేసుకునేందుకు విపత్తు నిర్వహణ బృందాలు, హెచ్‌పీసీఎల్ ప్రతినిధులు నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. నది పరిసర గ్రామాల ప్రజలు ఎవరైనా ఈ సిలిండర్లను గుర్తిస్తే, వాటికి దూరంగా ఉంటూ వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. వర్షాలు, వరదల ముప్పుతో పాటు ఇప్పుడు  గ్యాస్ సిలిండర్ల ముప్పు కూడా తోడవడంతో రాయగఢ్ జిల్లా యంత్రాంగం  అప్రమత్తమైంది. వ్యవహరిస్తోంది.

maharashtra floods, raigad rain news, 3000 lpg cylinders washed away, patalganga river

google-ad-img
    Related Sigment News
    • Loading...