అల్లాపూర్ లో వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవం

కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ వివేకానంద నగర్ లో వినాయక శోభా యాత్రను కన్నులపండువగా నిర్వహించారు. వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. వివేకానంద సేవా సమితి అధ్యక్షులు పులిగోళ్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో  జరిగిన వినాయక శోభా యాత్రలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.  వివేకానంద నగర్ పుర వీధుల గుండా సాగిన యాత్రలో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కాలనీకి చెందిన యువతి, యువకులు తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టారు. 

గణేష్ శోభాయాత్రకు ముందు 10 రోజుల పాటు భక్తులచే ఘనంగా పూజలందుకున్న వినాయకుడి లడ్డూ వేలం పాట నిర్వహించారు. పవిత్ర లడ్డూను సొంతం చేసుకోవటానికి భక్తులు పోటీ పడ్డారు. పోటాపోటీగా సాగిన వేలం పాటలో చివరకు వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు పులిగోళ్ల శ్రీనివాస్ యాదవ్ గణపతి లడ్డూను లక్షా 50 వేల రూపాయలకు దక్కించుకున్నారు. ఇక స్థానిక ఆలయంలో ఇటీవల నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో వెంకటేశ్వర స్వామికి అలంకరించిన లడ్డూని కూడా  వేలం వేశారు. వెంకన్న లడ్డూని పైలా గోపాల్ 71 వేల రూపాయలకు సొంతం చేసుకున్నారు. గత సంవత్సరం గణపతి లడ్డూని కైవసం చేసుకున్న మస్తాన్ రెడ్డిని సేవా సమితి సభ్యులు సత్కరించారు. 

ఇక గణేష్ నిమజ్జత్సవానికి ముందు వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. వందలాది మంది ప్రజలు గణనాథుడిని దర్శించుకుని అన్నదానం స్వీకరించారు. అనంతరం ఉట్ల ఉత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహించారు. చిన్నారులు ఉట్లు కొట్టి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ నాయకులు యాదవరెడ్డి, మస్తాన్ రెడ్డి, బీ శ్రీనివాస్, రవిందర్ ముదిరాజ్, హరికృ-,్ణ, ఏడు కొండలు, చెల్లయ్య, రమేశ్,  కేశవరావు , రామారావు , హైటెక్ ప్రసాద్, దమ్మిడి రాజు, దినేష్ నాయక్, విజయ్ , ఆవుల ఆంజనేయులు పాల్గొన్నారు.