అమరావతిలో 12 నేషనల్ బ్యాంకుల రాష్ట్ర కార్యాలయాలకు శంకుస్థాపన.. ఎప్పుడంటే?

నవ్యాంధ్రప్రదేశ్ రాజథాని అమరావతి ఇప్పుడు దేశంలోనే.. ఆ మాటకొస్తే ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. అభివృద్ధిలో ఆకాశమే హద్దు అన్నట్లుగా దూసుకుపోతోంది. జగన్ హయాంలో ఉద్దేశపూర్వకంగా అమరావతి పురోగతిని ఆపేశారు. శ్మశానమంటూ ఎద్దేవా చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను నానా ఇబ్బందులకూ గురి చేశారు. అటువంటి  అమరావతిలో ఇప్పుడు పండుగ వాతావరణం కనిపిస్తోంది.  పెద్ద ఎత్తున నిర్మాణాలు జోరందుకున్నాయి.  అటు కేంద్రం ప్రభుత్వ సంస్థల నిర్మాణానికి కూడా రంగం సిద్ధమైంది.  అంతేనా అమరావతికి పెద్ద ఎత్తున కేంద్ర సంస్థలూ తరలి వస్తున్నాయి. ఈ నెల 28న అమరావతిలో  12 జాతీయ స్థాయి బ్యాంకుల రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరగనుంది.  ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర విత్త మంత్రి నిర్మలాసీతారామన్ హాజరౌతున్నారు. సీఎం చంద్రబాబునాయుడు, ఆర్బీఐ  గవర్నర్, ఆయన బ్యాంకుల ఉన్నతాధికారులు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ బ్యాంకుల కోసం ఉద్దండరాయుని పాలెం వద్ద స్థలాలు కేటాయించారు. ఆ యా స్థలాలను చదును చేయడం కూడా జరిగింది. ఈ బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభా వేదికపై నుంచే 12 బ్యాంకులకు ఒకే సారి శంకుస్థాపన జరుగుతుంది.  

వాస్తవానికి 2014-19  మధ్య కాలంలోనే అమరావతిలో ఈ బ్యాంకుల కోసం స్థలం కేటాయించినప్పటికీ, 2019లో ప్రభుత్వం మారి జగన్ అధికారంలోకి రావడంతో ఇక బ్యాంకుల ఏర్పాటుకు ముందడుగు పడలేదు. బ్యాంకులు ఆ స్థలాలను స్వాధీనం చేసుకోవడానికి పెద్దగా సుముఖత చూపలేదు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపింది.  ఇక్కడ వాటి రాష్ట్ర కార్యాలయాల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  కు 3 ఎకరాలు కేటాయించారు. ఆ స్థలంలో ఎస్బీఐ  14 అంతస్తులు భవనం నిర్మిస్తోంది.  అలాగే కెనరా బ్యాంక్ ,  యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్,   పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనాల నిర్మాణం ఒకే సారి ప్రారంభంకానుంది. ఈ భవనాల్లోనే ఆయా బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు ఏర్పాటౌతాయి.   ఈ బ్యాంకుల ప్రాజెక్టు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu