ప్రతి 20 రోజులకూ ఓ సారి విదేశీ ప్రయాణం.. ఐబొమ్మ రవి విచారణలో వెలుగులోకి కీలక అంశాలు

ఐ బొమ్మ నిర్వాహకుడు రవి సినీ ప్రముఖులను గజగజ వణికించాడు.... పోలీసుల చేతికి చిక్కకుండా చుక్కలు చూపిస్తూ పోలీసులకే సవాళ్లు విసిరాడు. ఎంతటి కరుడుగట్టిన నేరస్తుడైన సరే ఏదో ఓ రోజు పోలీసుల చేతికి చిట్కాల్సిందే... అలాంటిది పోలీసులకే సవాలు విసిరిన వాడిని వదిలేస్తారా... లేదు కదా... తగ్గేదేలే అనే టైపులో పోలీసులు కూడా విశ్వప్రయత్నం చేసి ఎట్టకేలకు ఐ బొమ్మ రవిని అరెస్టు చేయడమే కాకుండా కస్టడీలోకి తీసుకొని కూడా విచారణ చేస్తున్నారు.

ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ వ్యవహారంలో అరెస్టైన రవి కస్టడీ మూడో రోజుకు చేరుకున్న నేపథ్యంలో విచారణ తీవ్రత పెరిగింది.ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సీపీ సజ్జనార్  సైబర్ క్రైమ్ కార్యాలయానికి చేరుకుని రవిని స్వయంగా విచారించారు. ప్రశ్నించారు. అనంతరం పోలీసులు రవిని బషీర్ బాగ్ లోని సీపీ ఛాంబర్‌కు తీసుకెళ్లి మరీ విచారించారు. ఈ సందర్భంగా  హైదరాబాద్ అడిషనల్ సీపీ (క్రైమ్స్) శ్రీనివాస్   విచారణకు రవి సహకరించడం లేదనీ,  పొంతనలేని సమాధానాలు ఇస్తున్నాడని చెప్పారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌కు సంబంధించిన కీలక సాంకేతిక సమాచారం రాబడుతున్నట్లు వెల్లడించారు.   

సర్వర్ ఐపీలు నెదర్లాండ్స్, ఫ్రాన్స్ దేశాల్లో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందనీ, ఎథికల్ హాకర్ల సహాయంతో వీటిని  గుర్తించే  ప్రక్రియ సాగుతోందన్నారు. త్వరలో అంతర్జాతీయ ఏజెన్సీలతో కలిసి సర్వర్ డేటా ఎక్స్‌ట్రాక్షన్ చేపట్టనున్నట్లు చెప్పారు. విచారణలో రవి ఆర్థిక వ్యవహారాలు కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

ప్రతి 20 రోజులకు ఒకసారి రవి విదేశీ ప్రయాణాలు చేసినట్లు రికార్డులు లభ్యమయ్యాయన్నారు.  
పైరసీ ద్వారా వచ్చిన డబ్బులను   క్రిప్టో ద్వారా స్వీకరించి వెంటనే ఖర్చు చేయడం రవి అలవాటని గుర్తించారు. రవి పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్లు, విదేశీ ఖర్చులపై   దర్యాప్తు జరుగుతోంది. ఐబొమ్మ రవికి సహాయం చేసిన వ్యక్తులపై కూడా పోలీసులు దృష్టి సారించారు.

రవి స్నేహితుడు నిఖిల్ వెబ్‌సైట్‌లో ఉపయోగించిన పోస్టర్లు, ప్రమోషనల్ మెటీరియల్ డిజైన్ చేసినట్లు గుర్తించారు.అదే విధంగా నిఖిల్, రవి వాళ్ల  చెల్లెలి ఖాతాకు పలుసార్లు డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్లు లావాదేవీల్లో బయటపడింది. ఈ ట్రాన్సాక్షన్ల నేపథ్యం ఏంటన్నదానిపైకూడా విచారణ జరుగుతోంది. అంతర్జాతీయ సర్వర్లు, విదేశీ లావాదేవీలు, క్రిప్టో ఫ్లోలు సహా అన్ని అంశాలపై సంయుక్తంగా సాగుతున్న  ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. ఐబొమ్మ వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను త్వరలోనే బట్టబయలు చేస్తామని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu