చిదంబర బడ్జెట్: వరాలు, వడ్డింపులు లేవు

 

నేడో రేపో మధ్యంతర ఎన్నికల గంటలు మొగుతాయనే రాజకీయనాయకుల ప్రకటనల నేపద్యంలో ఈ రోజు ఆర్ధిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పేద,మధ్యతరగతిని బుట్టలో వేసుకొనే అంశాలు తప్పనిసరిగా ఉంటాయనుకొన్న అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఒక సాదాసీదా బడ్జెట్ సమర్పించడం జరిగింది. ఈ బడ్జెట్లో పేదలకు, మద్య తరగతి వర్గాలకు ప్రత్యేక వడ్డింపులు కానీ,వరాలు కానీ లేవు.

 

కానీ, రూ.2-5 లక్షల వార్షిక ఆదాయం గలవారికి 10% పన్ను వడ్డింపు ఉంటుంది. అయితే, రూ.5లక్షల లోపు ఆదాయం గలవారికి రూ.2000 టాక్స్ క్రెడిట్ ప్రకటించారు. రూ.5-10లక్షల వార్షికాదాయం గలవారికి రూ.20% పన్నుకట్టవలసి ఉంటుంది.

 

బడ్జెట్ లో మన రాష్ట్రానికి ఒక భారీ ఓడరేవును ప్రకటించడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గ మరో విశేషం పూర్తిగా మహిళల ఆద్వర్యంలో నడిచే ఒక జాతీయ బ్యాంకు ఏర్పాటు చేయడం. అదేవిధంగా మహిళల రక్షణకు రూ.1000 కోట్లు కేటాయించడం కూడా పేర్కొనవలసిన అంశం. ఈ మొత్తాన్ని ఏవిధంగా సద్వినియోగం చేయాలో తెలుపమంటూ చిదంబరం కోరారు.

 

ఇక, ఈ బడ్జెట్లో సిగరెట్లు, సెల్ ఫోన్లు, సెట్ టాప్ బాక్సుల ధరలు కొద్దిగా పెంచారు. రూ.2000 ధర దాటిన సెల్ ఫోన్ ఖరీదు కొద్దిగా పెరగబోతున్నాయి. క్రమంగా దేశ వ్యాప్తంగా టీవీ ప్రసారాలు డీటీహెచ్ కు మారుతున్న ఈతరుణంలో సెట్ టాప్ బాక్సులపై 10% సుంకం విదించడం సామాన్యులకు, మధ్యతరగతివారికి కొంచెం ఇబ్బంది పెట్టినట్లయింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అంతకంటే వేరే గత్యంతరం కూడా ఏమి లేదు గనుక ప్రజలు భరించక తప్పదు.

 

దేశంలో ఏవర్గానికి ప్రత్యేక తాయిలాలు పంచకుండా ప్రవేశపెట్టిన ఈ సామాన్యమయిన బడ్జెట్ బహుశః రాహుల్ గాంధీ ఆలోచనలకు అద్దం పడుతోందని అనుకోవచ్చును. ఇటీవల రాజస్తాన్ లో జరిగిన కాంగ్రెస్ మేధోమధనంలో రాహుల్ గాంధీ తన ప్రసంగంలో వాస్తవిక పరిస్థులకు అనుగుణంగా మనం ఆలోచనలు, ప్రణాలికలు మారాల్సిఉందని చెప్పారు. మరి ఆయన ఆశయాలను ప్రతిబింబించే విదంగా చిదంబరం ఈ బడ్జెట్ ను రూపొందించి ఉండవచ్చును.