భూమా అఖిలప్రియ అరెస్ట్ 

ఎపిలో వైఎస్ ఆర్ అరాచకపాలనను ప్రశ్నిస్తే నేరుగా కటకటాలకు పంపే స్కీం అమలవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అసెంబ్లీలో లేదా వెలుపల లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ  అధి కార వైసీపీ ప్రజా స్వామ్య విలువలకు  ప్రాధాన్యత నివ్వడం లేదు.       ప్రజల జీవితాల్లో   వెలుగులు నింపాలన్న ఉద్దేశ్యంలో టిడిపి నేత భూమా అఖిల ప్రియ జగన్ ప్రభుత్వం దగ్గరకు  వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగానే వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.  ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేడు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సభ వద్దకు వెళ్లిన అఖిలప్రియ సాగునీటి విడుదలకు సంబంధించి జగన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమె వెంట టీడీపీ శ్రేణులు కూడా భారీగా తరలివెళ్లాయిదీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో సభా ప్రాంగణం వద్ద కలకలం రేగింది. వినతిపత్రం ఇవ్వడానికి వస్తే అరెస్ట్ చేయడం ఏంటని పోలీసులను టీడీపీ నేతలు ప్రశ్నించారు. అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తే సీఎం కార్యాలయం స్పందించలేదని, అందుకనే నేరుగా సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించానని అఖిలప్రియ తెలిపారు.
Publish Date: Mar 28, 2024 2:29PM

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ

బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరి లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ గట్టిగా తగిలింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్పీ అభ్యర్థిగా సిర్పూర్ నియోజకర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఆ తరువాత బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరారు. అలా చేరడానికి ముందు లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకుంటున్నట్లు ఏకపక్షంగా ప్రకటించారు. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి పోత్తును గుర్తించలేదు. ఏ పార్టీతోనూ బీఎస్పీకి పొత్తు లేదని విస్పష్టంగా ప్రకటించారు. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసి కారెక్కేశారు. ఇలా కారెక్కారో లేదో అలా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయనను నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి టికెట్ ఇచ్చేశారు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పోటీ చేసిన సిర్పూర్ నియోజకవర్గ పరిధిలో బహుజనులు ప్రవీణ్ కుమార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను బహుజన ద్రోహిగా అభివర్ణిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో  సిర్పూరు నియోజ‌కవ‌ర్గంలో బీఆర్ఎస్ కార్యక‌ర్తల స‌మావేశంలో పాల్గొనేందుకు ప్రవీణ్ కుమార్ హాజరు కానున్న తరుణంలో ఆయనకు వ్యతిరేకంగా కొమురం భీం జిల్లా కౌటలలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి.  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీని వీడి బీఆర్ఎస్ లో చేరడంనూ  బహుజనుల వ్యతిరేత ఆయన పోటీ చేస్తున్న నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గంలో ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. 
Publish Date: Mar 28, 2024 12:57PM

వైసీపీ సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ కు స్మగ్లర్లతో సంబంధాలు...హవ్వా 

స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థ సేవకుల స్తూపాలను ఏర్పాటు చేయడం వాటిని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించడం సర్వసాధారణం. అయితే అడవి దొంగగా, గంధపు చెక్కల స్మగ్లర్​గా పేరుగాంచిన వీరప్పన్ స్మారక స్థూపాన్ని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆవిష్కరించడం ఇటీవల  చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త మరువకముందే తాజాగా వైసీపీ ఎంపీ ఒకరు స్మగ్లర్లతో సంబంధాలు అనే వార్త ఎపి ప్రజలను కలవరపెడుతోంది .వైసీపీ ఎంపీ మార్గాని భరత్ పై రాజమండ్రి సిటీ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మార్గాని భరత్ కు స్మగ్లింగ్ బ్యాచ్ లతో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులకు రూ. 2 కోట్ల విలువైన బంగారంతో పట్టుబడ్డ నరేశ్ కుమార్ జైన్ తో భరత్ కు సంబంధాలు ఉన్నాయని చెప్పారు. నరేశ్ జైన్ తో మార్గాని భరత్ కలిసి ఉన్న ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ తో భరత్ కు సంబంధాలు ఉన్నాయని అన్నారు. మార్వాడీలను, ఒడిశా బ్రాహ్మణులను గుద్ది చంపుతానని వైసీపీ నేత ఒకరు ఫోన్ లో బెదిరించారని.. దీనిపై జిల్లా ఎస్సీకి ఫిర్యాదు చేశానని చెప్పారు.   ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ఇప్పుడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. భరత్ తో వాసు పోటీ పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఆదిరెడ్డి భవానీ గెలుపొందారు. ఈసారి ఆమె భర్త ఆదిరెడ్డి వాసు బరిలోకి దిగారు.  గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ స్మారక స్థూపాన్ని  వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌  ఆవిష్కరించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ హల్‌చల్‌ చేస్తున్నాయి.  గత నెల చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కాకర్లవంకలో వీరప్పన్ స్మారక స్థూపాన్ని స్థానికులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే కాకర్లవంకలో పర్యటించిన ఎమ్మెల్సీ భరత్‌ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి స్థానికులు ఏర్పాటు చేసుకున్న వీరప్పన్‌ స్మారక స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో  ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. స్మగ్లర్లతో వైసీపీ నేత మార్గాని భరత్ కు సంబంధాలు ఉండటం ఎన్నికల ముంగిట్లో ఉన్న ఎపి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.   
Publish Date: Mar 28, 2024 12:08PM

జగన్ నిర్వాకం.. త్రిశంకు స్వర్గంలో హైదరాబాద్ లోని ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌  పదేళ్లపాటు   ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. అయితే ఆ గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగిసిపోతుంది. అంటే ఆ తేదీ నాటికి హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవనాలన్నిటినీ ఖాళీ చేసి ఏపీకి తరలించేయాలి. అయితే ఏపీకి రాజధానే లేని పరిస్థితి. కార్యాలయాలను ఎక్కడికి తరలించాలో అర్ధంకాని అయోమయ స్థితి. అయితే  ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసిపోతుండటంతో  ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ తెలంగాణకు అప్పగించేసి అక్కడి ఫర్నీచర్, సిబ్బందిని ఏపీకి తరలించేసి తీరాలి.  అలా చేయలేకపోతే.. ఆ భవనాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది.  ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ జూన్ రెండు వరకూ మాత్రమే. ఆ తరువాత హైదరాబాద్ మహానగరం పూర్తిగా తెలంగాణకు చెందుతుంది.   ఐదేళ్ల పదవీ కాలంలో అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులంటూ హడావుడి చేసిన జగన్ సర్కార్ మూడు రాజధానులలో ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా పేర్చిన పాపాన పోలేదు. దీంతో  హైదరాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడకు తరలించినా వాటిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంలో స్పష్టత లేని స్థితి. దీంతో హైదరాబాద్ ను మరో ఏడాది పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని  జగన్ సర్కార్ అభ్యర్థించింది. అయితే ఆ అభ్యర్థనను సహజంగానే తెలంగాణ సర్కార్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.  అయితే, రెండు ప్రభుత్వ కార్యాలయాలు మరియు లేక్ వ్యూ అతిథి గృహాన్ని ఉపయోగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.   ఆదర్శ్ నగర్‌లోని హెర్మిటేజ్ భవనం, లక్డీకాపూల్‌లోని సీఐడీ భవనం, లేక్ వ్యూ అతిథి గృహాలను అద్దె చెల్లించైనా సరే వినియోగించుకునేందుకు జగన్ సర్కార్ రెడీగా ఉన్నట్లు తెలుస్తున్నది.   ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను పదేళ్లపాటు పంచుకునే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నప్పటికీ.. సొంత రాజధాని నిర్మాణం వేగవంతంగా జరగాలంటే ప్రభుత్వ కార్యాలయాలు ఏపీలోనే ఉండాలన్న ఉద్దేశంతో విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు   2017లో నే చాలా వరకూ ప్రభుత్వ కార్యాలయాలను అమరావతికి తరలించారు. ఆ తరువాత 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ మాత్రం అమరావతిని నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చేయడమే కాకుండా హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెలు చెల్లిస్తాం అక్కడే కొనసాగించుకునేందు అనుమతించండి మహప్రభో అని వేడుకుంటున్నారు.  
Publish Date: Mar 28, 2024 11:41AM

పాపం స్పీకర్ తమ్మినేని.. నిద్రపడితే ఒట్టు!

స్పీకర్ తమ్మినేని ఇప్పుడు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ క్యాడరే చెబుతున్నారు. ఆయన ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న సెంటిమెంట్ ప్రకారం అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన ఎవరూ కూడా ఆ తరువాతి ఎన్నికలలో విజయం సాధించలేరు. అయితే తమ్మినేనికి ఆ సెంటిమెంట్ బెంగే కాకుండా నియోజకవర్గ వైసీపీలో గ్రూపు తగాదాలూ కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. స్పీకర్ గా తమ్మినేని వ్యవహార శైలిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుండటం అటుంచితే.. నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో ఆముదాలవలసలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది.   వైసీపీ సీనియర్ నాయకుడు సువ్వారి  గాంధీ ఇప్పటికే పార్టీ వీడి  ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. వాస్తవానికి గత ఎన్నికలలో సువ్వారి గాంధీ ఆముదాలవలసలో తమ్మినేని విజయం కోసం అంతా తానై పని చేశారు. అందుకు అప్పట్లో జగన్ వచ్చే ఎన్నికలలో అంటే 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ సువ్వారి గాంధీకి ఇస్తానని ఇచ్చిన హామీయే కారణమని చెబుతారు. అయతే జగన్ ఆ హామీ నిలబెట్టుకోకపోవడంతో సువ్వారి గాంధీ వైసీపీకి రాజీనామా చేశారు. అంతే కాదు ఆయన సోదరుడి సతీమణి  కూడా తన నామినేటెడ్ పోస్టుకు రాజీనామా చేశారు. గాంధీ ఆముదాలవలస నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలవనున్నారు. వైసీపీ అధిష్ఠానం అంటే జగన్ తనను మోసం చేశారని గాంధీ ఆరోపిస్తున్నారు. సువ్వారీ గాంధీ పార్టీకి రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతుంటే.. తమ్మినేని సీతారాంకు ఖంగారెందుకు అంటే గాంధీ నియోజకవర్గంలో బలమైన కళింగ సామాజిక వర్గానికి చెుందిన వ్యక్తి. పైగా ఆ సామాజిక వర్గంలో గట్టి పట్టున్న నేత. దీంతోనే తమ్మినేని సీతారాం తన విజయంపై ధీమా కోల్పోయారు. అలాగే వైసీపీలో కూడా ఖంగారు మొదలైంది. దీంతో గాంధీని బుజ్జగించడానికి జగన్ దూతగా వైవీ సుబ్బారెడ్డి శతధా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది.  అదీగాక చాలా కాలంగా సువ్వారి గాంధీ నియోజకవర్గంలో తనదంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తమ్మినేని సీతారాం చేపట్టే అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.. పార్టీలోనే తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుని సమాంతరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ విషయం పార్టీ అధినేత జగన్ కు తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు.   ఇక ఆముదాలవలస నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయనున్న కూన రవికుమార్ తమ్మినేనికి సమీప బంధువు కూడా కావడంతో దానినే సువ్వారి గాంధీ తన ప్రచారానికి అనుకూలంగా మార్చుకుంటున్నారు.  తమ్మినేతి, కూన రవికుమార్ లు డబుల్ గేమ్ ఆడుతున్నారనీ, వారి రాజకీయ నాటకానికి తెరదించేందుకు తనకు ఓటు వేయాలంటూ ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించేశారు.  అంతే కాకుండా స్థానిక వైసీపీ క్యాడర్ లో కూడా తమ్మినేని పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో ఆముదాలవలసలో వైసీపీ క్యాడర్ చాలా వరకూ  తమ్మినేనికి మద్దతుగా ఆయన వెంటే నడుస్తున్నారు.  దీంతో తమ్మినేని నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారన్న సెటైర్లు పార్టీ వర్గాల నుంచే వస్తున్నాయి.  మొత్తం మీద ఆముదాలవలస నుంచి తమ్మినేని ఓటమి ఇప్పటికే ఖరారైపోయిందంటూ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. 
Publish Date: Mar 28, 2024 11:24AM

పార్టీ టికెట్ దక్కలేదని సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య

ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమిళనాడుకు రాష్ట్రానికి చెందిన సిట్టింగ్ ఎంపీ గణేష్ మూర్తి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం పార్టీ ఇవ్వలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈడోర్ నియోజకవర్గ ఎండీఎంకే ఎంపీ గురుమూర్తికి పార్టీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వలేదు. దీంతో  ఆయన మూడు రోజుల కిందట ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ( మార్చి 28) ఉదయం కన్నుమూశారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో మరణించారని ఆస్పత్రివర్గాలు తెలిపాయి.   ఎండీఎంకే పార్టీ అభ్యర్థిగా  గణేశమూర్తి 2019 పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోడ్ నుండి భారీ మెజార్టీతో  విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు.  ఎన్నికలలో పోటీకి అవకాశం లేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యకు పాల్పడటం తమిళనాట మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
Publish Date: Mar 28, 2024 10:59AM