నాగార్జున సాగర్ ఎగ్టిట్ పోల్.. గెలుపు ఆ పార్టీదే? 

తెలంగాణలో ప్రధాన పార్టీలకు సవాల్ గా నిలిచిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ నమోదైంది.  కరోనా భయపెడుతున్నా సాగర్ ఓటర్లు ఉత్సాహంగా ఓటింగులో పాల్గొన్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు కనిపించాయి. నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటర్లు ఉండగా.. రికార్డ్ స్థాయిలో 85 శాతానికి పైగానే ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నిక‌ల్లో 41 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. అంచనా కంటే మించి ఓటింగ్ నమోదు కావడంతో ఫలితంపై పార్టీల్లో టెన్షన్ కనిపిస్తోంది. పోలింగ్ ఎక్కువ నమోదు కావడం తమకే లాభిస్తుందని అధికార పార్టీ భావిస్తుండగా.. ప్రజా వ్యతిరేకత వల్లే ఓటింగ్ పెరిగిందని, తమకే కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. 

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. త్రిపురారం, గుర్రంపోడు,తిర్మలగిరి సాగర్, పెద్దవూర, అనుమల,నిడమనూర్ తో పాటు మాడ్గుల మండలంలోని పది గ్రామాల్లో సాగర్ పరిధిలోకి వస్తాయి. అన్ని మండలాల్లోనూ ఓటింగ్ భారీగానే నమోదైంది. గుర్రంపొడు మండలంలో 34 వేల 622 మంది ఓటర్లు, పెద్దవూర మండలంలో 44 వేల 658,  తిరుమలగిరి మండలంలో 31 వేల 431 మంది ఓటర్లు,అనుముల మండలంలో  33 వేల 753, నిడమనూరు మండలంలో 34 వేల 214 ఓట్లు వున్నాయి. మాడుగులపల్లి మండలంలో  7 వేల 225 ఓట్లు ఉండగా.. త్రిపురారం మండలంలో 33 వేల 842 మంది ఓటర్లున్నారు. అయితే అన్ని మండలాల్లోనూ 85 శాతంగా పోలింగ్ జరిగింది. 

నాగార్జున సాగర్ నియోజకవర్గం ఎవరూ గెలుస్తారన్న దానిపై పల్స్ టుడే ఎగ్జిట్ పోల్ నిర్వహించింది. గతంలో మూడు సార్లు ప్రీపోల్ సర్వే నిర్వహించిన పల్స్ టుడే.. ఎగ్టిట్ పోల్ కూడా నిర్వహించింది. ఎగ్జిట్ పోల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు లీడ్ కనిపిస్తోంది. 48 - 51 శాతం ఓట్లు టీఆర్ఎస్ కు వస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థి జానా రెడ్డి 38-42  శాతం ఓట్లు సాధిస్తారని సర్వేలో తేలింది. సాగర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీకి మాత్రం డిపాజిట్ వచ్చే అవకాశం కన్పించడం లేదు. రవినాయక్ కు కేవలం 10 -12 శాతం ఓట్లే లభిస్తాయని సర్వేలో వెల్లడైంది. కేసీఆర్ సర్కార్ పనితీరుపై ఓటర్లను ప్రశ్నించగా.. ఆయనకు పాస్ మార్కులే వచ్చాయి.కేసీఆర్ పాలన బాగుందని 29 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడగా.. ఫర్వాలేదని 38 శాతం మంది చెప్పారు. కేసీఆర్ పాలన సరిగా లేదని15 మంది ఓటర్లు చెప్పగా...అస్సలు బాగా లేదని 18 శాతం మంది ప్రజలు స్పష్టం చేశారు. 

మండలాల వారీగా చూస్తే మొత్తం ఏడు మండలాల్లో  మూడు మండలాల్లో టీఆర్ఎస్ కు మంచి లీడ్ వస్తుండగా  ఒక మండలాల్లో కాంగ్రెస్ కు ఆధిక్యత వస్తుందని పల్స్ టుడే అంచనా వేసింది. మూడు మండలాల్లో మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. పల్స్ టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం గుర్రంపోడు, తిరుమల గిరి సాగర్, మాడ్గుల మండలాల్లో కారుకు లీడ్ రానుండగా... హాలియా అనుమల మండలంలో కాంగ్రెస్ కు మంచి మెజార్టీ రానుంది. పెద్దవూర,  నిడమనూర్ , త్రిపురారం మండలాల్లో రెండు పార్టీల మధ్య టప్ ఫైట్ నడిచింది. పెద్దవూర మండలంలోని 11 గ్రామాల్లో టీఆర్ఎస్, 10 గ్రామాల్లో కాంగ్రెస్ కు అనుకూలత కన్పించింది. త్రిపురారం మండలంలో 11 గ్రామాల్లో టీఆర్ఎస్, ఐదు గ్రామాల్లో కాంగ్రెస్ కు లీడ్ కనిపించగా.. 8 గ్రామాల్లో హోరాహోరీ ఉంది. నిడమనూర్ మండలం 11 గ్రామాల్లో టీఆర్ఎస్, 4గ్రామాల్లో కాంగ్రెస్ కు లీడ్ వస్తుండగా.. ఆరు గ్రామాల్లో టఫ్ ఫైట్ ఉంది. ఇక హాలియా మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు పోలింగ్ సానుకూలంగా ఉండగా.. నాగార్జున సాగర్ పట్టణంలో మాత్రం కారుకు ఏకపక్షంగా సాగిందని పల్స్ టుడే సర్వేలో తేలింది.  

సామాజిల వర్గాల వారీగా చూస్తే యాదవ సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపగా.. రెడ్డి సామాజిక వర్గ ఓట్లలో మెజార్టీ జానారెడ్డికి పడ్డాయని సర్వే అంచనా వేసింది. గిరిజనుల ఓట్లను ఈసారి టీఆర్ఎస్ భారీగానే సాధించవచ్చని తెలుస్తోంది. అయితే లంబాడీల ఓట్లలో బీజేపీ అభ్యర్థికి కూడా కొంత ఓటు పడింది. ఇవన్ని జానారెడ్డికి మైనస్ అయిందని చెబుతున్నారు. దళితుల ఓట్లు చెరిసగం పడే అవకాశం ఉంది. మైనార్టీ ఓట్లలో ఎక్కువగా అధికార పార్టీకి పడ్డాయని పల్స్ టుడే అంచనా. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓటేసిన ఓటర్లు మాత్రం అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు కన్పించింది.

మొత్తంగా నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు.. జానారెడ్డి కంటే దాదాపు 8-11 శాతం ఓట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పల్స్ టుడే అంచనా వేసింది. టీఆర్ఎస్ పోల్ మేనేజ్ మెంట్ ముందు కాంగ్రెస్ ఢీలా పడిందని తెలుస్తోంది. కేసీఆర్ సభ తర్వాత టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడంతో కాంగ్రెస్ కు కొంత ఇబ్బంది కల్గిందని చెబుతున్నారు.నెల్లికల్ లిఫ్ట్ కూడా టీఆర్ఎస్ కు భారీగానే ఓట్లు కురిపించిందని పల్స్ టుడే నిర్వాహకులు కంబాలపల్లి కృష్ణ వివరించారు.