బండి నోటా అదే మాట ..

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు నిజంగా ఉంటాయో లేదో కానీ, గల్లీ నుంచి ఢిల్లీ వరకు అదే చర్చ జరుగుతోంది. చివరకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు  ధర్మాసనం కూడా తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల గురించి, వ్యాఖ్యానించింది. ఇక రాజకీయ పార్టీలు, నాయకులు అయితే, ముందస్తు గురించి మాట్లాడని రోజంటూ ఉండదు. ఇక మీడియా సంగతి అయితే చెప్పనే అక్కర లేదు. సెన్సేషన్ చేసేందుకు, ఏ వార్త చిక్కని రోజు, జాడిలోంచి ఊరగాయ పచ్చడి వచ్చినట్లు, ముందస్తు ఎన్నికల చర్చ తెర మీదకు వస్తుంది. అయితే నిజానికి, ముందస్తు వస్తే ముందుగా చెప్పి అయితే రాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే అదే అవుతుందని, ధైర్యంచేసి ముందడుగు వేస్తే, ఆగమన్నా ఆగదు. అయితే  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతానికి అయితే అంత రిస్క్ తీసుకునే పరిస్థితి అయితే లేదని అంటున్నారు. 

అదలా ఉంటే, తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ఆరునెలల్లో తెలంగాణలో ప్రభుత్వం మారిపోతుందని, బీజేపీ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు. బీజేపే ప్రభుత్వం రాబోతోందనే బండి  విశ్వాసాన్ని కాసేపు పక్కన పెడితే, అయన కూడా ముందస్తు ఎన్నికల తప్పవనే చెపుతున్నట్లుగా వుంది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రం నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని గుండెగాం గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన స్వాగత సభలో బండి సంజయ్  ఈ వ్యాఖ్యలు చేశారు.

నిజానికి  బండి సంజయ్ మాత్రమే కాదు, కొద్దిరోజుల కిందట తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ కూడా ఇంచు మించుగా ఇవే వ్యాఖ్యలు చేశారు. అందరూ ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉందని అనుకుంటున్నారు  కానీ, అంత సమయం లేదు  ఆరేడు నెలల్లోనే ఎన్నికలు జరుగుతాయని అన్నారు.

అలాగే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ముందస్తు తధ్యం  అంటూ ఎప్పటినుంచో కుండ బద్దలు కొడుతున్నారు. బీఎస్పీ అధ్యక్షడు ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ఆరు నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని కడుపుతో ఉన్నమ కనక మానదు అన్నంత గట్టిగా చెపుతున్నారు.  సరే ముందస్తు వస్తుందా  షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా అనే విషయాన్ని పక్కన పెడితే  ఓ వంక బండి సంజయ్ మరో వంక వైఎస్సార్ టీపీ నాయకురాలు వైఎస్ షర్మిల పాద యాత్రలను అడ్డుకునేందుకు అధికార తెరాస  ముఖ్యమంత్రి కేసేఆర్ ప్రభుత్వం చేసినవిఫల ప్రయత్నాలు, తెరాస ఇమేజ్ ని మరింతగా దిగాజరుస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.