ఈటల జోరు.. కారులో కంగారు! హుజూరాబాద్ ఎవరిది? 

ఏ కారణంగా వచ్చినా ఉప ఎన్నికలలో గెలవడం అధికార పార్టీకి అంత కష్టం కాదు. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న రోజుల్లో, తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కూడా గెలవలేక పోయారు. ఒక సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో  మొత్తం 17 మంది తెరాస ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, అదులో  కేవలం ఏడుగురు మాత్రమే తిరిగి ఎన్నికయ్యారు. అలాగే, ఐదారు నెలల క్రితం జరిగిన దుబ్బాక ఉపఎన్నికలోనూ, అధికార తెరాస పార్టీ ఓడి పోయింది. ఆ ఊపులోనే, ఆ వెంటనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. ఇంచుమించుగా 50 సీట్లు గెలుచుకుంది. సరే, ఆ తర్వాత కమల దళం జోష్ తగ్గింది అనుకోండి, అది వేరే విషయం.

 ఇంతవరకు రాష్ట్రంలో జరిగిన  ఉప ఎన్నికల విషయానికి వస్తే, గడచిన ఏడు సంవత్సరాలలో  దుబ్బాక  మినహా అన్ని ఉప ఎన్నికలలోనూ తెరాస అభ్యర్ధులే  గెలుస్తూ వచ్చారు. చివరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార రెడ్డి రాజీనామా చేసిన నల్గొండ జిల్లా హుజూర్ నగర్, సీటును ఉపఎన్నికల్లో  తెరాస కైవసం చేసుకుంది. ఆకక్ది నుంచి పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్ధి,  ఉత్తమ్ కుమార్  సతీమణి పద్మావతి ఓడిపోయారు. ఇక ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయం అయితే చెప్పనే అక్కరలేదు. జానారెడ్డి అంతటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఫస్ట్ టైమ్’ పోటీచేసిన తెరాస అభ్యర్ధి నోముల భగత్’ చేతిలో ఓటమి చవిచూశారు. 

ఇంతవరకు, దుబ్బాకలో తగిలిన చిన్న ఎదురుదెబ్బను పక్కన పెడితే, ఉప ఎన్నికల్లో ఆడుతుపాడుతూ వరస విజయాలు సాధిచిన తెరాస,  హుజురాబాద్’లో చెమటోర్చక తప్పేలా లేదన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన అనంతరం ఈటల చేరితే కాంగ్రెస్ పార్టీలో చేరతారు కాదంటే సొంత పార్టీ పెడతారని తెరాస నాయకత్వం భావించింది. అదైనా, ఇదైనా, ఏదైనా ఉపఎన్నికల్లో ఈటలను ఓడించడం ఈజీ అవుతుందని, తెరాస నాయకులు లెక్కలు కట్టారు. కానీ,ఈటల బీజేపీలో చేరడంతో, కథ కొంచెంగా అడ్డం తిరిగిందని తెరాస కొంచెంగా చికాకు పడుతోందని, ఆపార్టీ నాయకుల సంజాయిషీ టైపు  ప్రకటనలు సూచిస్తున్నాయి.  అలాగని, నియోజక వర్గంలో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ బలం ఉందని కాదు, నిజానికి, హుజూరాబాద్’ లో బీజేపీకి ఉనికే లేదు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి కౌశిక్ రెడ్డికి 60 వేల పైచిలుకు ఓట్లు వస్తే బీజేపీ అభ్యర్ధి రఘు పుప్పంకు నిండా రెండువేల ఓట్లు కూడా రాలేదు. ఈ ఎన్నికల్లో ఈటల వరసగా ఆరవసారి 50 వేలకు పైగా మార్జిన్’తో విజయం సాధించారు. 

 ఈటల బీజేపీలో చేరటం అధికార తెరాసకు ఎందుకు ఇబ్బందిగా  మారిందో వేరే చెప్పనక్కరలేదు , బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. అవసరం అయితే ఉపయోగించేందుకు, ఐటీ,ఈడీ వంటి మంత్రదండాలు కేంద్రం చేతిలో ఉన్నాయి. నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి, కేంద్రాన్ని దీటుగా ఎదుర్కుంటున్న  బెంగాల్ సీఎం మమతా బెనర్జీనే కేంద్రం ఎత్తులకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలో తమ పరిస్థితి కూడా  కేంద్ర బిగించిన ఉచ్చులో చిక్కున్న ‘ట్విట్టర్’ పిట్ట పరిస్థితిలానే ఉందని మమత పేర్కొన్నారు. ఇక తెరాస విషయం అయితే చెప్పనే అక్కరలేదు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద వ్యసాయ బిల్లుల విషయంలో తెరాస పార్టీ ప్రభుత్వం  యూ’టర్న్ తీసుకున్నాయి. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేక్గగా విపక్షాలతో కలిసి ఆందోళన చేసిన తెరాస, చివరకు ‘కేంద్రం బిల్లులు భేష్’ అంటూ అసెంబ్లీలో ఆ బిల్లులకు ఆమోదం తెలిపింది. వ్యవసాయ  బిల్లుల విషయంలో తెరాస తీసుకున్న ‘యు టర్న్’ కేంద్రంతో కయ్యానికి తెరాస సిద్దంగా లేదన్న విషయం మరోమారు స్పష్టమైంది. 

అందుకే ఈటల బీజేపే అభ్యర్ధిగా బరిలో దిగడం, తెరాస నాయకత్వానికి కొంచెం చాలా ఇబ్బందికరంగా మారింది. తిడదా మంటే అత్త కొడుకు, కోడడమంటే అక్క మొగుడు’ అనంట్లుగా బీజేపీని గట్టిగా టార్గెట్ చేయలేక, తికమక పడుతున్నారు. అదలా ఉంటే బీజీపీలో చేరిన తర్వాత తొలిసారిగా హుజురాబాద్ నియోజక వర్గానికి వచ్చిన ఈటల రాజేందర్’కు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. అదొకటి అలా ఉంటే, ఈటల ఈ సందర్భంగా తెరాస నాయకులపై చాలా ఘాటైన విమర్శలు చేశారు. ఒక విధంగా కేసీఆర్, ప్రత్యర్ధుల మీద ప్రయోగించే భాషను ఈటల అరువు తీసుకున్నారు. ఆయన భాషనే ఈయన  ప్రయోగించారు. ‘కేసీఆర్ అహంకారానికి హుజురాబాద్ ప్రజలు గోరి కడతారు, రాజరిక పాలనకు బొంద పెడతారు’ వంటి పరుష పదజాలాన్ని ప్రయోగించారు.  అయినా ఈటలకు సమాధానం చెప్పిన తెరాస నాయకులు, మంత్రి కొప్పుల ఈశ్వర్ అవ్వన్నీ  వదిలేసి, ముఖ్యమంత్రి కేసీఆర్, ఈటలకు సముచిత స్థానం ఇచ్చి మంత్రిని చేస్తే,ఆయన వెళ్లి మతతత్వ బీజేపీలో చేరారని  బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు, నిజానికి, హుజురాబాద్’లో బీజేపీకి ఉనికే లేదు, అయినా బీజేపీని టార్గెట్ చేస్తున్నారంటే, ఎక్కడో ఏదో భయం వారిని వెంటడుతూనే ఉందని అనుకోవలసి వస్తుందని, పరిశీలకులు సైతం భావిస్తున్నారు.