విపక్ష నేతలతో చర్చలు.. ఈటల రాజేందర్ దారెటు?

రాష్ట్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ కు గురైన మాజీ మంత్రి ఈటల భవిష్యత్ వ్యూహం ఏమిటి? ఆయన ఏమి చేయ బోతున్నారు? ఈటల పై వేటుపడి, పదిరోజుల పైనే అవుతోంది, అయినా ఇంతవరకు ఆయన తమ రాజకీయ భవిష్యత్ ‘వ్యూహం’ ఏమిటో మాత్రం బయట పెట్టలేదు. ఆయన మనసులో ఏముందో, ఏమి చేయాలనుకుంటున్నారో, ఎక్కడా చెప్పలేదు. నిజానికి, ఈవిషయంలో ఆయనకే స్పష్టత లేదేమో అని పిస్తోంది. అందుకే కావచ్చు, కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పదవి వదులుకుంటానని అంటూనే, ఎన్నికలలో పోటీ చేసేందుకు బీ’ ఫారం ఇచ్చింది పార్టీనే అయినా, గెలిపించింది మాత్రం ప్రజలే అని అంటున్నారు. అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంలోనూ ఈటల ఒక నిర్ణయానికి  రాలేక పోతున్నారు అనిపిస్తుంది. 

అందుకే, కావచ్చు ఆయన పార్టీలతో సంబంధం లేకుండా అనేక మంది నాయకులను కలుస్తున్నారు. అయితే, ఎందుకు కలుస్తున్నారు,ఏమి మాట్లాడుతున్నారు అనేది మాత్రం ఎవరికీ అంటూ చిక్కడం లేదు. మొత్తానికి ఈటల ఒక సందిగ్ధావస్థలో ఉన్నారు అన్నది మాత్రం ఆయన మాటలు, చేతలే స్పష్టం చేస్తున్నాయి.   ఒక సందర్భంలో ఆయనే, అన్నట్లుగా ఆయనకు అన్ని పార్టీలలోనూ మిత్రులున్నారు. అయినా, ఇంతకాలం  రాజకీయ కట్టుబాట్ల కారణంగా కొందమంది సీనియర్ రాజకీయ నాయకులను కలవలేక పోయారు.  అలా  కలవాలని ఉన్నా, కలవలేక పోయిన పాత మిత్రులను కలుస్తున్నారు. ఈ కలయికలు, ఎదో ఒక వ్యూహం ఆధారంగా సాగుతున్నాయని మాత్రం చెప్పలేము. అఫ్’ కోర్స్, ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినప్పుడు సహజంగానే రాజకీయాలు చర్చకు వస్తాయి, అందులోనూ ప్రస్తుతం ఆయన ఉన్న పరిస్థితులలో రాజకీయాలు చర్చకు రాకుండా ఉండవు. అయితే, ఈ చర్చల పర్యవసానం ఏమిటి,  ఎలా ఉంటుంది  అన్నది ఎవరికీ తెలియదు. అయితే అయన ఎవరిని కలిసినా, అందుకు అనుగుణంగా కథలు, కదానాలు అయితే వస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులను కలిస్తే, ఆ పార్టీలో చేరిపోతున్నారని, మరో నేతను కలిస్తే ఆయన, ఈయన కలిసి కొత్త పార్టీ పెడుతున్నారని, ఇలా మీడియాలో కధనాలు వస్తున్నాయి. అంటే కానీ, ఆయనగా  ఆయన తమ మనసులో ఏముందో మాత్రం చెప్పడం లేదు. 

అయితే, అక్కడక్కడా, అప్పుడప్పుడు ఆయన మాట్లాడిన ఒకటి రెండు మాటలు, మర్మ గర్భంగా ఆయన వ్యక్త పరిచిన అభిప్రాయాలను గమనిస్తే, ఆయన తెరాస కొండను ‘ఢీ’ కొనేందుకు సిద్దంగా లేరేమో అని పిస్తుంది. నిజానికి, ముఖ్యమంత్రి, తెరాస అధినేత కీసీఅర్ అంటే ఏమిటో, ఆయన ‘పగ - ప్రేమ’ ఎలా ఉంటుందో అందరికంటే ఈటలకే బాగా తెలుసు. ఆ ఇద్దరి మధ్య ఉన్నది, ఒకటా రెండా 19 ఏళ్ల బంధం. అందుకే, తనపై వేటుపడిన తర్వాత ఈటల ఒక సందర్భంలో గతాన్ని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్’తో ఒకసారి తెగిన బంధం మళ్ళీ ముడి పడదని అన్నారు. అలాగే, గతంలో ఇతర నాయకులను, ఇంతకంటే అన్యాయంగా బయటకు పంపినప్పుడు, కేసీఆర్ చర్యను సమర్ధించి తప్పు చేసామన్న బాధను వ్యక్త పరిచారు. అదే సమయంలో, గతంలో పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా చేసిన వ్యాఖ్యలు విమర్శలకు సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం కూడా ఈటల చేశారు. ఎదో ఒక చానల్’కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో పార్టీని, ప్రభుత్వాన్ని తానెప్పుడు ఉద్దేసపూర్వకంగా విమర్శించలేదని, కొన్ని సందర్భాలలో ప్రజల నుంచి వచ్చిన వత్తిళ్ళు, అభ్యర్ధనలకు బదులుగా, అలాంటి వ్యాఖ్యలు, విమర్శలు చేయవలసి వచ్చిందని అన్నారు. 

మరో వంక ముఖ్యమంత్రి కేసీఆర్’ మంగళ వారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో, ఈటల తప్పు చేశారని, చేసిన తప్పును స్వయంగా  ఒప్పుకున్నారని,  అందుకనే ఆయన మీద చర్యలు తీసుకున్నామని మంత్రులకు వివరించినట్లు వార్త లొచ్చాయి. అయితే ఆయన చేసిన, ఒప్పుకున్న తప్పేమిటి, అనేది చెప్పలేదు. రాజకీయంగా చేసిన వ్యాఖ్యలు తపప్ని ఒప్పుకున్నారా, లేక అసైన్డ్ భూముల వ్యహరంలో నేరాన్ని అంగీకరించారా, అన్నవిషయంలో కేసీఆర్ క్లారిటీ ఇవ్వలేదు. 

అంతే కాదు ఈటల విషయంలో  ఎవరూ ఏమీ మాట్లాడవద్దని గాగ్ ఆర్డర్స్ పాస్ చేశారు. అంటే కేసీఆర్’కు సంబందిచినంత వరకు ఈటల ఎపిసోడ్ ముగిసిన అధ్యాయం.  ఇక ఈటల ఏమి చేస్తారు అన్నది ఆయన ఇష్టం. అయితే, స్వభావరీత్యా మెతక వైఖరి అవలంబించే ఈటల, ఎంత వరకు కేసీఅర్’ను ‘ఢీ’ కొంటారు అనేది ఇప్పుడేచెప్పడం కష్టం. అంతేకాకుండా, అసైన్డ్ భూముల వ్యవహారం, ఒకటే కాకుండా ఈటలకు సంబదించిన ఇంకేదో రహస్యం కూడా కేసీఆర్ గుప్పిట్లో ఉందని, అందుకే ఇద్దరూ ఒక విధంగా దాగుడు మూతలు ఆడుతున్నారని కొందరు లోపలి వ్యక్తుల సమాచారం. 

బర్తరఫ్’కు గురైన తర్వాత అధికార తెరాస పార్టీలో ఎమ్మెల్ల్యేలు, ఎంపీలే కాదు  ఏ స్థాయి నాయకుడు కూడా ఈటలను సమర్ధిస్తూ, ఒక ప్రకటన చేయలేదు. సొంత నియోజక వర్గంలో కొంత మంది పార్టీ అనయకులు, కార్యకర్తలువచ్చి పోయినా, రాష్ట్ర స్థాయిలో ఎటు నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. ఈటల వ్యవహారానికి సంబంధించి స్పందించిన ఒకరిద్దరు మంత్రులు, ఇతర నాయకులు కూడా ఆయన్ని తప్పు పట్టారే గానీ, ఈటలఫై కూసింత సానుభూతి కూడా చూపించలేదు. సో, ఈటల ఎపిసోడ్ శుభం  కార్డ్ ఎలా పడుతుంది అన్నది ఉహించడం కూడా ప్రస్తుతానికి కష్టమే అనిపిస్తోంది.