ఈటలకు హ్యాండిచ్చిన మరో నేత.. హరీష్ దెబ్బకు కమలం విలవిల

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్ది బలాబలాలు చేంజ్ అవుతున్నాయి. రాజీనామా చేసినప్పుడు ఈటల రాజేందర్ కు భారీగా మద్దతు లభించగా.. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ చేయడంతో ఈటల వెంట వెళ్లిన నేతలు కూడా తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. ముఖ్యంగా మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర మంత్రులు నియోజకవర్గంలోని నేతలతో మాట్లాడుతూ ఈటలను ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే చాలా మంది నేతలు ఈటలకు షాకివ్వగా.. తాజాగా మరో కీలక నేత గులాబీ గూటికి చేరారు. 

టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఈటల రాజేందర్ వెంట నడిచిన జమ్మికుంట మునిసిపల్ వైస్ ఛైర్మన్ దేశిని స్వప్న, ఆమె భర్త, ఇల్లందకుంట రామాలయ మాజీ ఛైర్మన్ కోటిలు తిరిగి టీఆర్ఎస్‌లో చేరబోతున్నామని ప్రకటించారు. కారు గుర్తుపై గెల్చిన తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని, ఇక్కడ జరుగుతున్న అభివృద్దిలో భాగస్వామ్యం కావాలన్న ఆలోచనతోనే బీజేపీని వీడి టీఆర్ఎస్ పంచన చేరుతున్నామని స్వప్న, కోటిలు వెల్డడించారు. ఇక నుండి తాము ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు నేతృత్వంలోనే పని చేస్తామని స్పష్టం చేశారు.

దేశిని స్వప్న కోటి ఈటలకు ప్రధాన మద్దతుదారుడిగా ఉన్నారు. జిల్లా టీఆర్ఎస్ నేతలు ఎంతగా ఒత్తిడి తెచ్చినా ఆయన ఈటల వెంటే నడిచారు. అయితే రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ రాయబారంతో ఆయన మనసు మార్చుకున్నారు. ఇటీవల శ్రీనివాస్ గౌడ్ హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన జమ్మికుంట సమీపంలోని కొత్తపల్లిలో ఉన్న దేశిని కోటి ఇంటికి వెళ్లి రహస్యంగా మంతనాలు జరిపారు. కోటి సోదరి, మంత్రి శ్రీనివాస్ సోదరి కుటుంంబాల మధ్య బంధుత్వం ఉంది. తమ కుటుంబాల మధ్య ఉన్న బందుత్వం కారణంగానే మంత్రి తమ ఇంటికి వచ్చారని చెప్పినప్పటికీ.. టీఆర్ఎస్‌లోకి రీ ఎంట్రి ఇవ్వాలని కోటి దంపతుల ముందు మంత్రి ప్రతిపాదన పెట్టారనే చర్చ జరిగింది. తాము ఈటలకు మాట ఇచ్చామని, టీఆర్ఎస్‌లో చేరేది లేదని మంత్రితో వ్యాఖ్యనించారని కూడా చెప్పారు. అయితే ఆ తరువాత బంధువుల ద్వారా ఒత్తిడి చేయడంతో కోటి దంపతులు తిరిగి టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.