బండితో విభేదాలు లేవంటూ ఈటల క్లారిటీ

తెలంగాణ బీజేపీలో వర్గ విభేదాలు భగ్గు మంటున్నాయనీ, ఈటలకు పార్టీలో ఉక్కపోత పరిస్థితులు ఉన్నాయనీ జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడిందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అందుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ కార్యవర్గ సభ్యుడు, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తాజా ప్రకటననే ఉదాహరణగా చూపుతున్నారు.

తనకూ బండి సంజయ్ కు విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఈటల రాజేందర్ ఖండించారు. తాను బీజేపీ సీఎం అభ్యర్థిని ఎంత మాత్రం కాదని క్లారిటీ ఇచ్చారు. క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తగా పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. బీజేపీలో ఎవరూ తమంత తాముగా పదవులను నిర్ణయించుకోలేరనీ ఈటల అన్నారు. నేతల సామర్థ్యాన్ని బట్టి వారికి పదవుల విషయంలో పార్టీయే నిర్ణయం తీసుకుంటుందని ఈటల చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ దుష్టపాలనకు చరమగీతం పాడటమే తన లక్ష్యమన్నారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు పార్టీ తనకు అప్పగించిన ఏ బాధ్యతనైనా చిత్తశుద్ధితో, శక్తివంచ లేకుండా నిర్వర్తిస్తానన్నారు. టీఆర్ఎస్ లో కేసీఆర్ నియంతృత్వ పోకడలను వ్యతిరేకించే వారంతా తనతో టచ్ లో ఉన్నారని చెప్పిన ఈటల సమయం వచ్చినప్పుడు వారంతా బీజేపీ గూటికి చేరడం తథ్యమని చెప్పారు.

గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీకి సిద్ధమన్న తన సవాల్ కు కట్టుబడి ఉన్నానని ఈటల పునరుద్ఘాటించారు. వచ్చే ఎన్నికలలో కేసీఆర్ నియంతృత్వ పాలనకు స్వస్తి చెప్పేందుకు తెలంగాణ ప్రజానీకం సిద్ధంగా ఉందన్నారు. అందుకు మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ విజయమే నాంది అవుతుందని చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో రాష్ట్రంలో తెరాసపై ఉన్న వ్యతిరేకత ప్రస్ఫుటమైందనీ, అదే ఫలితం మునుగోడు ఉప ఎన్నికలోనూ పునరావృతమౌతుందని అన్నారు.