ఎర్రబస్సు: షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ
posted on Nov 14, 2014 3:30PM

తారాగణం: దాసరి నారాయణ రావు, మంచు విష్ణు, క్యాథరీన్, రఘుబాబు, నాజర్, బ్రహ్మానందం, కృష్ణుడు.
సాంకేతిక నిపుణులు: సంగీతం: చక్రి, సినిమాటోగ్రఫి: అంజి, కథ: ఎన్. రాఘవన్, మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: దాసరి నారాయణ రావు.
తమిళంలో లింగుస్వామి దర్శకత్వంలో రూపొంది మంచి విజయాన్ని సాధించిన ‘మంజపై’ సినిమా ఆధారంగా దర్శకరత్న దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘ఎర్రబస్సు’ సినిమా శుక్రవారం నాడు విడుదలైంది. ఆయన తాతగా, మంచు విష్ణు మనవడుగా నటించారు. అమెరికా దేశానికి వెళ్ళి సెటిలవుదామని ప్రయత్నాలు చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాజేష్ (విష్ణు) తన ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే దశలో వుంటాడు. రాజి (క్యాథరిన్)తో కూడా అతని ప్రేమ సక్సెస్ అవుతుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకుని అమెరికాలో సెటిల్ అవడమే మిగిలి వుంది. ఆ సమయంలో పాలకొల్లు ప్రకృతి ఒడి నుంచి రాజేష్ తాతయ్య నారాయణస్వామి హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్‌కి వస్తాడు. రాజేష్ దగ్గరే అపార్ట్‌మెంట్లో వుంటాడు. ఈ సందర్భంగా అమాయకుడైన ఆయన చేసే పనులు వాటి వల్ల జరిగిన పరిణామాలు ఆసక్తికరంగా వుంటాయి.
అమాయకుడైన తాతయ్య పాత్రలో దాసరి ప్రశంసనీయమైన నటన ప్రదర్శించారు. విష్ణు, కేథరిన్ నటన బాగుంది. కేథరిన్ మరింత గ్లామరస్‌గా కనిపించింది. మంచి కుటుంబ కథాంశంతో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమాలో దాసరి కేరెక్టర్ ఇలాంటి తాతయ్య మాక్కూడా వుంటే బాగుంటుందనిపించేలా వుంది.