TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాలం చెల్లిన బాలీవుడ్ పాక్ ఫార్ములా.!

Published on: Fri Aug 28, 2026 10:12AM

హిందీ చిత్రసీమలో దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం వహించిన   ప్రధానమైన కథాన శైలికి బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరసన వ్యక్తమవుతోందని చలనచిత్ర వాణిజ్య పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉన్న సెంటిమెంట్, మానవతా దృక్పథం, ఇరు దేశాల రక్షణ, గూఢచార సంస్థల మధ్య నైతిక సమానత్వాన్ని చూపే పాత ఫార్ములా ఇకపై చెల్లదని ఇటీవలి బాక్సాఫీస్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.   120 కోట్ల రూపాయల  అంచనా వ్యయంతో తెరకెక్కిన  బత్వారా 1947  చిత్రం తొలి రెండు వారాల్లో   35 కోట్లు రూపాయలు మాత్రమే వసూలు చేయగా, యష్ రాజ్ సంస్థ సంస్థ  100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన  ఆల్ఫా చిత్రం వసూళ్లు కూడా  59 కోట్లరూపాయలకే పరిమితమయ్యాయి.  దాదాపు  220 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన చోట సగనికంటే తక్కువ వసూళ్లపై  చలనచిత్రపరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది.  

ఈ భారీ పతనానికి ప్రధాన కారణం  ధురందర్ సినిమా  సృష్టించిన సునామీ అని సినీ పండితులు చెబుతున్నారు.   గత డిసెంబర్‌లో దాదాపు  250 కోట్ల బడ్జెట్‌ నిర్మితమై  విడుదలైన  ధురందర్..  వరల్డ్ వైడ్‌గా   వెయ్యీ 350 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి..  దేశ సరిహద్దు కథనాల పట్ల ప్రేక్షకుల దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్..  పాకిస్తాన్ అంశం ఆధారంగా తీసే సినిమాలపై ప్రేక్షకుల అంచనాలు ఈ చిత్రంతో పూర్తిగా మారిపోయాయన్నారు. పాత తరహా నైతిక సమతుల్యతను లేదా  సరిహద్దులే అసలైన విలన్ అనే మెత్తటి నినాదాలను చూపే చిత్రాలను వీక్షకులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నారని బాక్సాఫీస్ నివేదికలు సైతం స్పష్టం చేస్తున్నాయి.  చారిత్రకంగా పరిశీలిస్తే బాలీవుడ్ ప్రధానంగా మూడు రకాల సూత్రాలపై ఈ ఇతివృత్తాలను నడిపింది. మొదటిది  హీనా ,  వీర్-జారా,   బజరంగీ భాయ్‌జాన్' వంటి చిత్రాల్లో సరిహద్దు రక్షణ రేఖలను మాత్రమే నిందితులుగా చూపుతూ మానవీయతనే ప్రధానాంశంగా చూపించడం. రెండవది మిషన్ కాశ్మీర్, ఫనా లాంటి సినిమాల్లో ఉగ్రవాద పాత్రల వెనుక ఉన్న వ్యక్తిగత కష్టాలు లేదా ప్రేమ కథల ఆధారంగా సానుభూతిని కలిగించే ప్రయత్నం చేయడం. ఇక మూడవది.. ఏక్ థా టైగర్,  పఠాన్,  టైగర్ 3  వంటి చిత్రాల్లో భారత నిఘా సంస్థ రా,  పాకిస్తాన్ నిఘా విభాగం ఐఎస్ఐ రెండు సమానమైన లక్ష్యాలు కలిగినవిగా చిత్రీకరించడం. ఈ పద్ధతి ద్వారా చారిత్రక వాస్తవాలు..  1940 నాటి లాహోర్ తీర్మానం,  1946 డైరెక్ట్ యాక్షన్ డే నాటి దారుణ హింసాకాండ వంటి నికార్సైన చారిత్రక సంఘటనల ప్రభావం తగ్గించబడిందనే విమర్శ ఉంది.  భారత్,  పాకిస్తాన్ సినీ రంగాలు పరస్పరం వ్యవహరించే తీరులో చాలా కాలంగా స్పష్టమైన వ్యత్యాసం ఉంది. 

ఇండియన్ మీడియా తరచుగా శాంతి సామరస్యాల పేరుతో వేదికలను ఏర్పాటు చేసినప్పటికీ, అవతలి వైపు నుండి సానుకూల స్పందన కరువైందనే అభిప్రాయం ఉంది. ఉదాహరణకు, పాకిస్తానీ చలనచిత్రాలైన  వార్,  యల్ఘార్,  ధైచల్,  ఎహ్దే వఫా  వంటి వినోద కార్యక్రమాల్లో ఇండియా  ప్రతినిధులను రా సంస్థను విలన్లుగా, చొరబాటుదారులుగా క్రమపద్ధతిలో చిత్రీకరించారు. అంతే కాకుండా..  2019 నుండి పాకిస్తాన్ ప్రభుత్వం ఇండియన్  చిత్రాల ప్రదర్శనపై పూర్తి  నిషేధాన్ని అమలు చేస్తోంది.  

ధురందర్  సినిమా ఈ మూస ధోరణికి భిన్నంగా వాస్తవ ఘటనలు, ఐఎస్ఐ పాత్ర, 26/11 దాడులు, కాందహార్ విమాన అపహరణ, పార్లమెంట్ పై  దాడుల రికార్డులను ప్రత్యక్షంగా చూపించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ చిత్రం విడుదలకు ముందు, తర్వాత కూడా పలు విమర్శలు, ప్రచారాలు, ఆన్‌లైన్ వివాదాలు ఎదురైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించింది. రెండు భాగాలూ అంటే దురంధర్ 1, దురంధర్ 2 కలిపి  ఈ సినిమా  రెండు వేల499 కోట్ల మార్కును దాటి కొత్త రికార్డులను నెలకొల్పింది.  మరోవైపు..  రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న  బత్వారా 1947' (మునుపటి పేరు 'లాహోర్ 1947') వంటి చిత్రాలు మాత్రం పాత పద్ధతిలోనే సాగాయి. దేశ విభజన సమయంలో ఒక వైపు వర్గానికి చెందిన అనుభవాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, భారీ సంఖ్యలో స్థానభ్రంశం చెందిన హిందూ, సిక్కు కుటుంబాల తీవ్ర బాధను తగినంతగా చూపలేకపోయాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వాణిజ్య కారణాలు మరియు వివాదాల భయం కారణంగానే శీర్షికల్లో మార్పులు చేశారన్న వాదనలు ఉన్నాయి.  సినిమా థియేటర్లలో నష్టాలు వస్తున్నప్పటికీ, బాలీవుడ్ పెద్దలు డిజిటల్ లేదా ఓటీటీ హక్కులు, శాటిలైట్ డీల్స్, అంతర్జాతీయ మార్కెట్ బిజినెస్ సమీకరణాలను దృష్టిలో ఉంచుకునే ఈ పాత కథనాలకే ఇంకా ప్రాధాన్యత ఇస్తున్నారని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

ఉదాహరణకు  లాల్ సింగ్ చడ్డా లేదా  థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ వంటి చిత్రాలు దేశీయంగా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా అంతర్జాతీయ డీల్స్ పొందగలిగాయి. అయితే  ది కేరళ స్టోరీ వంటి చిత్రాలకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎదురైన సవాళ్లు ఈ బిజినెస్ మోడల్‌ను సూచిస్తున్నాయి.  ఏది ఏమైనప్పటికీ, చలనచిత్ర పరిశ్రమ భవిష్యత్తును నిర్ణయించేది బహిష్కరణ నినాదాలు లేదా విమర్శకుల వ్యాఖ్యలు మాత్రమే కాదని, థియేటర్లకు వచ్చి టికెట్ కొనే సగటు ప్రేక్షకుడి నిర్ణయమేనని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. 'ధురందర్' సాధించిన మహత్తర విజయం, రాబోయే రోజుల్లో హిందీ సినీ పరిశ్రమ తన కథా శైలిని, సరిహద్దు ఇతివృత్తాల చిత్రీకరణను మార్చుకోవాల్సిన అవసరాన్ని స్పష్టంగా నొక్కిచెబుతోంది.

 -సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.   

 

 

End Card to   Bollywood Pakisthan Formula,  Dhurandhar Box Office Collections Batwara 1947 MovieBollywood Spy Universe Indian Cinema Industry Business