ఎలక్ట్రిక్ వాహనాలకు మహర్దశ
posted on Feb 1, 2025 12:43PM

నిర్మలమ్మ బడ్జెట్ కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు దిగిరానున్నాయి. లిథీయం బ్యాటరీలపై పన్ను తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో ప్రకటించారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గే అవకాశలు ఉన్నాయి. విద్యుత్ సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వాల కీలక భాగస్వామ్యం అవసరమని విత్త మంత్రి తన బడ్జెట్ లో పేర్కొన్నారు.
ఎంఎస్ఎంఈలపై వరాల వర్షం
కేంద్ర ఆర్థిక మంత్రి లోక్ సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఎంఎస్ఎంఈలకు వరాల వర్షం కురిపించారు. వీటికి ఇచ్చే రుణాల పరిమితిని రెట్టింపు చేశారు. అంటే ఇప్పటి వరకూ ఇస్తున్న ఐదు కోట్ల రుణాలను పది కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఇక నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో నగరాల అభివృద్ధి కోసం అర్బన్ చాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో కనెక్టివిటీ పెంచేందుకు కొత్తగా 117 విమానాశ్రయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇవి వచ్చే పదేళ్లలో అందుబాటులోకి వస్తాయన్నారు.
ఇక పర్యాటక ప్రదేశాలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పిస్తామన్నారు. అలాగే అంతర్రాష్ట్ర విద్యుత్తు పంపిణీ కోసం కొత్త ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. మధ్య తరగతి ప్రజల కోసం 40 వేల ఇళ్లు నిర్మిస్తామన్నారు. అలాగే మెడికల్ టూరిజం అభివృద్ధికి తోడ్పాటునందిస్తామన్నారు. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు ఇస్తామని చెప్పారు. ఇక బీహార్ రాష్ట్రానికి వరాల వర్షం కురిపించారు. బీహార్ లోని నికలాంచల్ ప్రాంతంలో కొత్తగా రేవు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే బీహార్ రాష్ట్రానికి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.