మోడీ ఆ నిర్ణయం తీసుకుంటే వాళ్లకు జజ్జనకరి జనారే?

వ్యాపారి అనేవాడు దారిన పోయినా.. గోదారిన పోయినా ఊరకే పోడని ఓ పాతకాలం నాటి సామెత. అలాగే రాజకీయ నాయకుడైనా అంతే. ఏ ప్రకటన వెనుక ఏ మర్మం దాగి ఉందో అంత ఈజీగా బయటపడదు. కొంత లోతైన దృష్టి, మరికొంత లో-దృష్టి, ఇంకొంత రాజకీయ స్వార్థ చింతన ఉంటే తప్ప రాజకీయ నాయకుల మాటల్లోని మర్మాన్ని అర్థం చేసుకోలేరు సామాన్య జనం. నేషనల్ వోటర్స్ డే సందర్భంగా ప్రధాని మోడీ ఆయన మనసులోని మాటను మరోసారి బయటపెట్టారు. 

వన్ నేషన్-వన్ ఎలక్షన్ తో పాటు వన్ నేషన్-వన్ వోటర్ లిస్ట్ అంటూ రెండు నినాదాలను బీజేపీ కార్యకర్తలకు అందించారు.  స్థానిక ఓటర్ల గుర్తింపు, వారితో సంపర్కం, బీజేపీకి ఓటు వేసేలా మోటివేట్ చేయడం... ఇలా గ్రౌండ్ లెవెల్లో కీలకమైన పాత్ర పోషించే పన్నా ప్రముఖ్ లతో మోడీ ఇంటరాక్ట్ అయ్యారు. లోకల్ వోటర్ లిస్టులో ఒక్కో పేజీకి ఒక్కో ఇంచార్జీని బీజేపీవారు ఈపాటికే నియమించుకున్నారు. ఆ పేజీలో ఉండే ఓటర్లను కలవడం, వారితో స్నేహం పెంచుకోవడం, బీజేపీకి ఓటు వేసేలా వారిని మోటివేట్ చేయడం... వారిద్వారా మరింత మంది ఓటర్లను ప్రభావితం చేసేందుకు వారిని సోషల్ మీడియాలో కూడా యాక్టివేట్ చేయడం... ఇదీ పన్నా ప్రముఖ్ ల పని. మరి లోకల్ లెవెల్లో పనిచేసే పన్నా ప్రముఖ్ లకు జాతీయ సబ్జెక్టయిన వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనే అంశాన్ని ఎందుకు వినిపించారు? ఇక్కడే ఉంది అసలైన కిటుకు. 

బీజేపీని ప్రజలంతా జాతీయపార్టీగా ఆదరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే జాతీయ పార్టీగా మాత్రమే చూస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో మోడీకి మరో ప్రత్యామ్నాయం లేదని సామాన్య ఓటర్లు సైతం చెబుతున్న మాట. అక్కడివరకు బానే ఉంది. ఎటొచ్చీ రాష్ట్రాల అసెంబ్లీల్లోనే బీజేపీ నెంబర్ పెద్దగా వర్కవుట్ అవడం లేదు. రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఉంటేనే ఎమ్మెల్సీల సంఖ్య పెరుగుతుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోనే రాజ్యసభ సభ్యుల కేటాయింపు జరుగుతుంది. రాజ్యసభలో తగినంత బలం ఉంటేనే ఏ బిల్లయినా పాస్ అవుతుంది. లేకపోతే బీజేపీ నాయకులు అనుకున్న బిల్లులేవీ ఆమోదం పొందవు. ఇప్పుడు కూడా బీజేపీకి రాజ్యసభలో తగినంత బలం లేదు. అందుకే రాష్ట్రాల అసెంబ్లీల మీద బీజేపీ హైకమాండ్ కన్నేసింది. ప్రజల్ని బీజేపీ వైపు మొగ్గు చూపేలా చేయాలంటే స్థానిక పన్నా ప్రముఖ్ లే ఎంతో కీలకం. వారి ద్వారానే వన్ నేషన్-వన్ ఓటర్ లిస్ట్  కోసం ఓటర్లను సమాయత్తం చేసి వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా మోటివేట్ చేయడమే అసలైన ఉద్దేశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. 

దేశమంతా గర్వించే 370 ఆర్టికల్ రద్దు నిర్ణయంతో బీజేపీ కీర్తి విపరీతంగా పెరిగిపోయింది. సామాన్య జనానికి బాగా కనెక్ట్ అయింది. అటు రాంమందిర్ ఇష్యూను కూడా ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా కోర్టు ద్వారా పరిష్కారం దొరకడానికి ఎంతో సక్సెస్ ఫుల్ గా కృషి చేశారు. ఇన్ని పాజిటివ్ అంశాలున్నప్పుడు ప్రజల్ని ఆయా రాష్ట్రాల్లో కూడా తమకే ఓటు వేసేలా ఎందుకు చేయరాదన్నదే మోడీ  జమిలి కామెంట్లలోని పరమార్థంగా చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలతో  పాటే రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగితే ఎంపీ అభ్యర్థులతో పాటు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా తమవారినే చట్టసభల్లోకి ప్రజలు పంపిస్తారని మోడీ-షా ద్వయం ఆలోచిస్తున్నారు. అందుకే గత కొంతకాలంగా జమిలి అంశాన్ని ముందుకు తెస్తున్నారు. అదే జరిగితే బీజేపీ ప్రాభవం విపరీతంగా పెరుగుతుందని, ఆ హవాను తట్టుకోవడం ప్రాంతీయ పార్టీలకు అయ్యే పని కాదన్న అభిప్రాయాలున్నాయి. క్రితంసారి ఎన్నికల్లో కేసీఆర్ దాదాపు ఏడాది కాలాన్ని కోల్పోయి తెలంగాణను ముందస్తు ఎన్నికల్లోకి దించడానికి ఇదే భయం కారణమన్న వ్యాఖ్యానాలున్నాయి. అప్పుడు జమిలి కాకపోయినా.. కేసీఆర్ ముందస్తుకు వెళ్లారంటే ఇక జమిలి గనక ఖాయమైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. బీజేపీయేతర పార్టీలకు పట్టుకున్న భయం కూడా ఇదేనంటున్నారు విశ్లేషకులు. 

మరి జమిలి అనగానే సరిపోతుందా.. అది అంత సులభమా? అంటే కానే కాదు. దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో జమిలిగానే ఎన్నికలు జరిగాయి. ఖర్చులు తగ్గడానికి, అభివృద్ధి పనులు ఆగకుండా ఉండడానికి ఇప్పుడు కూడా అదే మంచిదన్న అభిప్రాయాలున్నా.. ఆచరణలో అందుకు ఇబ్బందికరంగా మారిన అంశాలెన్నో ఉన్నాయి. వివిధ రాష్ట్రాలకుండే పాలనాకాలం వేర్వేరుగా ఉండడం దగ్గర నుంచి ఒకవేళ దేశమంతా జమిలికి వెళ్లి రాష్ట్రాల అసెంబ్లీలు, కేంద్ర ప్రభుత్వం ఒకేసారి కొలువుదీరినా ఏదైనా రాష్ట్రంలో ఏదైనా కారణం చేత ప్రభుత్వం బర్తరఫ్ అయితేనో, రాష్ట్రపతి పాలన వస్తేనో మళ్లీ ఎలక్షన్ కు వెళ్లాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు జమిలి ఏ విధంగా సక్సెస్ అవుతుందన్నది ఓ ముఖ్యాంశం. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంది. రాజ్యాంగంలోని 352,  356,  360 ఆర్టికల్స్ ద్వారా విచక్షణాధికారాలు కేంద్రానికి సంక్రమించాయి. అలాంటివాటిని ముందుగా సవరించాల్సి ఉంటుంది. అదే జరిగితే రాష్ట్రాలకుండే ఫెడరల్ పవర్స్ కూడా ఎంతో కొంత దెబ్బ తింటాయన్న అభిప్రాయాలు కూడా లేకపోలేదు. 

మరి ఈ పరిస్థితుల్లో తేనెతుట్టె లాంటి అంశాన్ని మోడీ కదిలిస్తే ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి.. అవి ఏ మేరకు మంచి ఫలితాలిస్తాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అందుకే మోడీ తెలివిగా జమిలి మీద విస్తృతంగా చర్చించాలంటూ జనాన్నినెమ్మదిగా ఆ వైపు ఆలోచింపజేస్తున్నారని, అలా సమయం చూసుకొని జమిలిని ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలున్నాయి. మరి మోడీ ఏం చేస్తారో ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయ్యాక ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.