అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్.. ఆస్తుల అటాచ్
posted on Nov 20, 2025 1:43PM

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి వరుస షాకులిస్తోంది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. తాజాగా అంబానీ గ్రూపునకు చెందిన 1400 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆయనకు చెందిన రిలయెన్స్ గ్రూప్ పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ చర్య తీసుకుంది.
ఇదే నెలలో ఈడీ ఇప్పటికే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కు చెందిన నవీ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీలో ఉన్న 132 ఎకరాల భూమిని జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఆ భూముల విలువ దాదాపు 4 వేల 462 కోట్లకు పైనే ఉంటుంది. అంతకు ముందు ఈ ఏడాది అక్టోబర్ లో కూడా అనిల్ అంబానీ గ్రూపుకు చెందిన సంస్థలకు సంబంధించి 3 వేల 84 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ ఆస్తులు ఢిల్లీ, నోయిడా, ఘాజియాబాద్, ముంబై, పుణె, థానే, హైదరాబాద్, చెన్నై, కాంచీపురం, తూర్పు గోదావరిలలో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో 14వందల కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. దీంతో ఇప్పటి వరకూ అనిల్ అంబానీకి చెందిన దాదాపు 9వేల కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసినట్లైంది. ఈడీ తాజాగా జప్తు చేసిన ఆస్తులు నవీ ముంబై, చెన్నై, పూణె, భువనేశ్వర్ లలో ఉన్నాయి.