పుట్ట గొడుగు పార్టీలపై ఈసీ కోరడా ?

మన దేశంలో రాజకీయ పార్టీలు, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటాయి. అందులో చాలా వరకు పార్టీలు మఘలో పుట్టి పుబ్బలో మాయమై పోవడం జరుగుతంది. ముఖ్యంగా ఎన్నికల సమయలో కొత్త కొత్త పార్టీలు పుట్టుకు రావడం ఎన్నికల క్రతువు ముగియకముందే అంతర్ధానమై పోవడం కూడా జరుగుతుంది. అయితే, ఇలా పుట్టి అలా పోయే  చాలా వరకు పార్టీలతో పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ,సమాజంలో అంతో ఇంతో పలుకుబడి ఉండి, వ్యాపార ధోరణిలో రాజకీయ దుకాణాలు తెరిచే, పెద్దలతో ప్రజాస్వామ్యం పరిహాసం పాలవుతుందనే విమర్శలు చాలా కాలంగా చాలా చాలా వేదికల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. చివరకు కేంద్ర ఎన్నికల సంఘం, న్యాయస్థానాలు కూడా ‘పుట్టగొడుగు’ పార్టీల ముప్పును కట్టడి చెయవలసిన అవసరాన్ని గుర్తించాయి.

ఈ నేపధ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం (సిఈసి) గుర్తింపు పొందని పార్టీలపై చర్యలు తీసుకునేందుకు సిద్దమైందని విశ్వసనీయ సమాచారం. దేశ వ్యాప్తంగా సుమారు 2100 వరకు ఉన్న గుర్తింపు పొందని పార్టీలో, ఎన్నికల సంఘం నిబంధనలను పాటించని పార్టీలపై చర్యలు ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. 

ఇందులో ప్రధానంగా సమాజంలో అంతో ఇంతో పలుకుబడి ఉన్న వ్యక్తులు, రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి, ఆ పేరున  పెద్ద ఎత్తున దేశ విదేశాల నుంచి విరాళాలు సేకరించడం, సేకరించిన విరాళాలను సొంత ఖాతాలో జమచేసుకోవడం జరుగుతోందనే ఆరోపణ తరచూ  వినిపిస్తూనే ఉంటుంది. ఎవరి దాకానో ఎందుకు, అంత పెద్ద పేరున్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించి మూసేసిన ప్రజారాజ్యం పార్టీ పై ఆ పార్టీలో కీలక బాధ్యతలు పోషించిన నాయకులే అలాంటి ఆరోపణలు చేశారు. సాధారణంగా రాజకీయ పార్టీలు సేకరించిన విరాళాలకు సంబందించిన సంబదించిన వివరాలను ఎన్నికల సంఘానికి తెలియ చేయవలసి ఉంటుంది. ఆలాగే, పార్టీ సభ్యత్వం, పార్టీ కార్యవర్గం, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి తెలియ చేయవలసి ఉంటుంది.

అయితే, చాలా వరకు ‘పుట్టగొడుగు’ పార్టీలు ఈ నిబంధనలను ఉల్లంఘించిన నేపధ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం  ముందుగా గుర్తింపు పొందని పార్టీలపై చర్యలకు సిద్దమైంది. ఇందులో, తెలుగు రాష్టాలకు చెందిన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన, కేఏ పాల్ పార్టీ ప్రజాశాంతి  పార్టీ, తెలంగాణలో ప్రొఫెసర్ కోదండ రామ్ సారధ్యం వహిస్తున్న తెలంగాణ జన సమితి పార్టీలు ఉన్నాయి. ఇందులో కేఏ పాల్ సారధ్యంలోని ప్రజాశాంతి పార్టీపై ఎప్పటినుంచో ఎన్నో ఆరోపణలున్నాయి. నిజా నిజాలు ఎలా ఉన్నప్పటికీ, పాల్ నోరు తెరిస్తే వందలు వేలు కాదు, లక్షలు కోట్లు, లక్షల వేల కోట్ల గురించే మాట్లాడతారు. ప్రపంచః దేశాలలో తనకు ఎంతో పలుకుబడి ఉందని అంటారు. సో.. ఆయన దేశ విదేశాల నుంఛి, పెద్ద ఎత్తున విరాళాలు సేకరించే అవకాశం ఉందనే అనుమానాలున్నాయి. అలాగే, పవన్ కళ్యాణ్ (బ్రదర్ ఆఫ్ చిరంజీవి) విషయంలోనూ కొన్ని ఆరోపణలు అయితే లేక పోలేదు. సో .. కేంద్ర ఎన్నికలసంఘం పుట్టగొడుగు పార్టీలపై చర్యలు తీసుకుంటే అందులో తెలుగు పార్టీల పేర్లు ఉన్నా ఆశ్చర్య పోనవసరం లేదు. 

అయితే, కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లఘించిన పార్టీలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయంలో ఇంకా స్పష్టత లేక పోయినా, ఈ నిర్ణయం వెనక విదేశీ  నిధులతో దేశంలో అరాచకాన్ని సృష్టించేందుకు కొన్ని శక్తులు, కొన్ని సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను కట్టిడిచేసే వ్యూహం ఉందని తెలుస్తోంది. నిజానికి, ఎన్జీవోలకు విదేశీ విరాళాలు అందకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కఠిన చర్యలు తీసుకుంది. అయితే శతకోటి అనర్ధాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లుగా, ఇంత కాలం ఎన్జీవోలుగా చెలామణి అయిన సంస్థలు రాజకీయ దుకాణాలు తెరిచి విరాలు సేకరిస్తున్నాయనే అనుమానంతో  కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందని రాజకీయ పార్టీల పై కన్నేసిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

అయితే గతంలోనూ కేంద్ర ఎన్నికల సంఘం 2005 నుంచి 2015 వరకు ఒక్కసారి కూడా పోటీ చేయని పార్టీలను గుర్తించి వాటిని రద్దు చేసింది, అప్పుడు రద్దయిన పార్టీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్నా టీడీపీ, ఎన్టీఆర్ టీడీపీ, జై తెలంగాణ వంటి 15 పార్టీలు ఉన్నాయి.ఈ పార్టీలు కాగితాల్లోనే తప్ప బయట ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలేదని, పైగా కొందరు వ్యక్తులు ఈ పార్టీల పేరుతో మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నారని ఈసీ భావించి రద్దు చేసింది.  అలా రద్దయిన పార్టీల ఆర్ధిక లావాదేవీలును ఐటీ శాఖ పరిశీలించి చర్యలు తీసుకుంది. ఎన్నికల సంఘం ఇప్పడు కూడా అదే పద్దతిని పాటిస్తుందా లేక ఇంకా కఠిన చర్యలు తీసుకుంటుందా అనేది తేలవలసి వుంది. నిజానికి, విదేశీ విరాళాలు  సేకరిస్తున్న పార్టీలో చిన్నా చితక పార్టీలే కాదు, దేశంలో క్రైస్తవ మత ప్రచారానికి ఊత మిస్తున్న వైసీపీ, వైఎస్సార్ టీపీ వంటి పార్టీలు కూడా ఉన్నాయని, వాటి మీద కూడా చర్యలు ఉండవచ్చని అంటున్నారు.