ఆ బ్యాగ్ ల నిండా డ్రోన్లే. ఎక్కడంటే?
posted on Nov 6, 2025 2:08PM

ప్రతి విమానాశ్రయంలోనూ భద్రతా ఏర్పాట్లు అత్యంత పటిష్ఠంగా ఉంటాయి. కస్టమ్స్, డి ఆర్ ఐ,సిఐఎస్ఎఫ్ ఇలా భద్రతాధికారులు అధికారులు విమానాశ్రయానికి వచ్చే, వెళ్లే వారి కదలికలపై డేగకళ్లతో నిఘా పెడతారు. ఎయిర్ పోర్టులో దిగే ప్రతి ప్రయాణీకుడి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. స్కాన్ చేస్తారు.
అయినా స్మగ్లర్లు అంతకు మించి జాగ్రత్తలు తీసుకున్నామని భావిస్తూ, పట్టుబడబోమన్న నమ్మకంతో దర్జాగా అక్రమరవాణాకు పాల్పడుతూ ఉంటారు.అయినా వారి జాగ్రత్త లకు మించి నిఘా నేత్రాలు ఉండటంతో దొరికిపోయి కటకటాల పాలౌతుంటారు. బంగారం, డ్రగ్స్, నగలు, ఇలా రకరకాల వస్తువుల అక్రమరవాణాకు ప్రయత్నించి దొరికిపోతుండటం మనం చూస్తూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా ఓ ప్రయాణికుడు బ్యాగులో డ్రోన్లతో అధికారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన శంషాబాద్ ఎవిమానాశ్రయంలో జ రిగింది. ఈ సంఘటనలో అధికారులు 22 డ్రోన్లు, వాటికి సంబంధించిన 22 రిమోట్ లను స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ ఎయిర్ లైన్స్ లో వచ్చిన ముత్తు కనపన్ సతీష్ కుమార్ అనే వ్యక్తి కదలికలపై సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులకు అనుమానం కలిగింది. దీంతో అతడిని ఫాలో అయ్యారు. ముత్తు కనపన్ సతీష్ కుమార్ తన బ్యాగులను షేక్ హైమద్ అష్‌రఫ్ అలి అనే వ్యక్తికి అందజేస్తుండగా సెక్యూరిటీ అధికారులు పట్టుకున్నారు.
బ్యాగ్ లు తెరిచి చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ బ్యాగులలో 22డ్రొన్ లతో పాటు 22 రిమోట్‌లు ఉన్నట్లుగా గుర్తించారు.వెంటనే ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న డ్రోన్లు, రిమోట్ ల విలువ 26 లక్షల 70 వేల రూపాయల వరకూ ఉండొచ్చన్నది అంచనా.