రివ్యూ: ‘దృశ్యం’ సినిమాకి అంత దృశ్యం వుందా?

 

తారాగణం: వెంకటేష్, మీనా, నదియా, నరేశ్, రవి కాలే, కృతిక, బేబి ఎస్తేర్, పరుచూరి వెంకటేశ్వరరావు. నిర్మాతలు: డి.సురేష్‌బాబు, రాజ్ కుమార్ సేతుపతి, సంగీతం: శరత్, సినిమాటోగ్రఫి: ఎస్.గోపాల్ రెడ్డి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, దర్శకత్వం: శ్రీ ప్రియ. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీప్రియ దర్శకురాలిగా మారి రూపొందించిన ‘దృశ్యం’ సినిమా. ఈ సినిమాలో నటించడానికి వెంకటేష్ లాంటి టాప్‌స్టార్ అంగీకరించినప్పుడే ‘దృశ్యం’ మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాకి అంత ‘ద‌ృశ్యం’ (సీన్) ఉందా, లేదా అనే విషయాన్ని చూద్దాం.


ఈ సినిమా మలయాళ మాతృక ఘన విజయం సాధించింది. తెలుగులో రేపు (శుక్రవారం) విడుదల అవుతున్న ఈ సినిమాని గత రెండు రోజులుగా మీడియాకి ప్రదర్శించారు. సినిమా విడుదలయ్యే వరకూ మీడియాకి ప్రదర్శించే సాహసం ఈమధ్యకాలంలో ఎవరూ చేయలేదు. ఈ సినిమా మీద సంపూర్ణ నమ్మకంతో నిర్మాతలు ముందుగానే మీడియాకు ప్రదర్శించారు. ః ‘దృశ్యం’ సినిమా సస్పెన్స్, థ్రిలర్, ఫ్యామిలీ డ్రామాల మేళవింపుగా రూపొందిన సినిమా. కథ విషయానికి వస్తే, పోలీస్ ఆఫీసర్లయిన నదియా, నరేష్‌ల కుమారుడు వరుణ్. ఒకసారి వరుణ్ కనిపించకుండా పోతాడు. దాంతో పోలీసులు అతని కోసం వెతకడం ప్రారంభిస్తారు. ఈ దర్యాప్తులో పోలీసులకు ఒక చిన్న పల్లెటూరిలో కేబుల్ ఆపరేటర్‌గా వున్న రాంబాబు (వెంకటేష్) అనే కుటుంబం మీద అనుమానం కలుగుతుంది. భార్యా, భర్త, ఇద్దరు ఆడపిల్లలతో సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబంలోకి పోలీసులు ప్రవేశిస్తారు. ఆ కుటుంబానికి వరుణ్ కనిపించకుండా పోవడానికి సంబంధమేంటి? ఆ కుటుంబాన్నే ఎందుకు అనుమానించారు? పోలీసుల విచారణ నుంచి రాంబాబు కుటుంబం తప్పించుకుందా? ఈ కుటుంబమే వరుణ్‌ని కిడ్నాప్ చేసిందా? అసలేం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ‘దృశ్యం’ సినిమా చూడాల్సిందే!


కేబుల్ ఆపరేటర్ రాంబాబుగా వెంకటేష్ తన వయసుకు తగిన విభిన్నమైన పాత్రలో ఆకట్టుకున్నారు. ఆయన కొన్ని సన్నివేశాలలో చక్కటి ఎమోషన్స్ పలికించారు. చాలాకాలం తర్వాత మీనాకి మరో మంచి పాత్ర దొరికింది. వెంకటేష్ కుమార్తెలుగా నటించిన కృతిక, బేబీ ఎస్తేర్ ప్రశంసనీయమైన నటన ప్రదర్శించారు. నదియా, నరేష్ జంట కూడా బాగుంది. కానిస్టేబుల్ గా నటించిన రవి కాలే ఆకట్టుకున్నారు. రాంబాబును, ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురిచేసే పాత్రలో రవి కాలే గొప్పగా నటించాడు.


ప్రేక్షకులకు చక్కని అనుభూతి కలిగేవిధంగా శ్రీప్రియ ‘దృశ్యం’ చిత్రాన్ని మలిచారు. దర్శకురాలిగా మంచి మార్కులు పొందారు. సినిమా ఎక్కడా గ్రిప్ సడలకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తమ్మీద ‘‌దృశ్యం’ సినిమాకి అంత ‘దృశ్యం’ (సీన్) వుందని చెప్పొచ్చు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu