అన్ని వర్గాలు ఆమె పక్షమే రాష్ట్రపతి అభ్యర్ధికి మోడీ ప్రసంసలు నామినేషన్ కు రంగం సిద్దం

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము జూన్ 24న (శుక్రవారం) నామినేషన్ దాఖలు  చేస్తున్నారు. ఇందు కోసం ఆమె గురువారం ఉదయమే రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘవాల్ సహా ఇతర నేతలు స్వాగతం పలికారు. ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేసే వరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఆమెకు సహాయకారిగా ఉంటారు . 

కాగా,ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమంలో  ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఎ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొంటారు. నామినేషన్ ప్రత్రాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రులు సంతకాలు చేస్తారు. అదలా ఉంటే ద్రౌపది ముర్ము నామినేషన్ పత్రాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి నివాసంలో సిద్ధం చేస్తున్నారు. 

కాగా,  ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ  హోంమంత్రి అమిత్‌ షాతో  భేటీ అయ్యారు. ఆమెకు ప్రధాని పుష్పగుచ్ఛం అందజేశారు. ముర్ముతో భేటీపై ట్విట్టర్‌లో స్పందించిన మోదీ.. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె ఎంపికను సమాజంలోని అన్ని వర్గాలు ప్రశంసిస్తున్నాయని తెలిపారు. క్షేత్ర స్థాయిలోని సమస్యలపై ముర్ముకు ఉన్న అవగాహన, దేశ అభివృద్ధి పట్ల ఆమె దూరదృష్టి అద్భుతం అని మోదీ కొనియాడారు.అలాగే, కేంద్ర మంత్రి అమిత్ షాను ముర్ము కలిశారు. ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినందుకు గర్వపడుతున్నానని షా పేర్కొన్నారు.

తన అభ్యర్థిత్వానికి మద్దతు కోరుతూ ద్రౌపది ముర్ము.. దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. ముర్మును ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ బీజేపే ఈ నెల 21న నిర్ణయం తీసుకుంది. ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము ఝార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేశారు. 64 ఏళ్ల ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైతే ఆ పదవి చేపట్టనున్న తొలి గిరిజన వ్యక్తిగా, రెండవ మహిళగా ఖ్యాతినార్జిస్తారు. అంతే కాక స్వతంత్ర భారత దేశంలో జన్మించిన తొలి రాష్ట్రపతిగా  ప్రత్యేక స్థానం పొందుతారు.   

ఇలా ఉండగా, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం లాంఛనమే  అని స్పష్టం అవుతున్నది.  ఎన్‌డిఎ  ఓట్ల శాతం 50శాతం దాటడమే ఆమె విజయానికి బాటలు వేస్తోంది. తద్వారా భారతదేశానికి గిరిజన మహిళ మొదటి సారి రాష్ట్రపతి కానున్నారు. 

 ఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపదికి సొంతరాష్ట్రం ఒడిశాకు చెందిన అధికార బిజూ జనతాదళ్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో మొత్తం ఓట్లలో(10,86,431) 52 శాతం ఆమెకే (5,67,000) లభించనున్నాయి. బిజెపితో పాటు మిత్రపక్షాలకు చెందిన ఎంపిలు, ఎంఎల్‌ఎల ఓట్ల శాతం (3,08,000) కూడా ఇందులో కలిసివస్తుంది.  

నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజెడి ఓట్లు 32,000. అంటే మొత్తం ఎలక్టోరల్ ఓట్ల శాతంలో ఆ పార్టీవి 2.9శాతం. ఒడిశాలో అధికార బిజెడికి 114 మంది శాసనసభ్యులున్నారు. బిజెపికి 22 మంది ఉన్నారు. అదే విధంగా ఇరు పార్టీలకు చెరో 12మంది లోక్‌సభ సభ్యులు, 9మంది రాజ్యసభ సభ్యులున్నారు. 

 మరో రెండు ప్రాంతీయ పార్టీలు వైఎస్‌ఆర్‌సిపి, ఎఐఎడిఎంకె కూడా ఎన్‌డిఎ అభ్యర్థివైపే మొగ్గు చూపుతున్నాయి. ఝార్ఖండ్ లో కాంగ్రెస్ తో కలసి ప్రభుత్వం నిర్వహిస్తున్న జేఎంఎం కూడా ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించడం గమనార్హం.  ఇటీవలి రాజ్యసభ ఎన్నికల తర్వాత ఎగువ సభ అయిన రాజ్యసభలో బిజెపి సభ్యుల సంఖ్య 92కు చేరింది. ఇక లోక్‌సభలో బీజేపీకి 
సొంతంగా 301 మంది సభ్యుల బలం ఉంది.సో.. ద్రౌపది ముర్ము ఎన్నిక ఇక లాంచనమనే భావిస్తున్నారు.