ఇండియాపై ట్రంప్ ప్రశంసలు.. యాధృచ్ఛిక దౌత్య మర్యాద కాదు.!
Published on: Sat Aug 22, 2026 3:41PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎన్నికల వ్యవస్థను, ఓటర్ల గుర్తింపు విధానాలను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారాయి. ఓటరు గుర్తింపు, పౌరసత్వ నిర్ధారణ, మెయిల్-బ్యాలట్ విధానంపై పరిమితులు విధించాలని భావిస్తున్న ట్రంప్.. తన రాజకీయ ఆచరణకు అనుగుణంగా ఇండియా ఎన్నికల నమూనాను ఉదాహరణగా చూపిస్తున్నారు. ప్రతిపాదిత సేవ్ అమెరికా చట్టం ఆమోదానికి మద్దతు కూడగట్టేందుకే ఆయన భారత్‌ను ఒక శక్తిమంతమైన అంతర్జాతీయ ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ట్రంప్ మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారత ఎన్నికల సంఘం 64.6 కోట్ల మంది ఓటర్లతో అత్యంత పటిష్టంగా ఎన్నికలు నిర్వహించిందని పేర్కొన్నారు. చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు లేకుండా భారత పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసే అవకాశం ఉండదని, మెయిల్ ద్వారా ఓటు వేసినవారి శాతం ఒక శాతం కంటే తక్కువగా ఉందనే అంశాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమెరికాలో ఓటు వేయడానికి ఎలాంటి ఫోటో గుర్తింపు కార్డు అవసరం లేకపోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఫెడరల్ ఎన్నికల్లో పౌరసత్వ ధ్రువీకరణను తప్పనిసరి చేసేలా చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు.
అయితే.. భారత్, అమెరికా దేశాల మధ్య ఉన్న రాజ్యాంగ పరిపాలనా వ్యత్యాసాలను గమనించడం ఆవసరం. ఇండియాలో రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఏకీకృత పద్ధతిలో ఎన్నికలను నిర్వహిస్తుంది. మరోవైపు అమెరికాలో ఓటరు నమోదు, గుర్తింపు నిబంధనలు, మెయిల్ ఓటింగ్, ముందస్తు పోలింగ్ వంటి అంశాలు పూర్తిగా ఆయా రాష్ట్రాల అధికార పరిధిలో ఉంటాయి. భారత ఎన్నికల చట్టాల ప్రకారం పోస్టల్ బ్యాలట్ సౌకర్యం కేవలం మిలిటరీ సిబ్బంది, ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది, కొందరు ప్రత్యేక వర్గాలకు మాత్రమే పరిమితం. కానీ అమెరికాలో విస్తారమైన భౌగోళిక పరిస్థితులు, వికలాంగులు, వృద్ధులు, సైనిక ఉద్యోగుల ప్రయోజనార్థం మెయిల్ ఓటింగ్ అత్యంత విస్తృతంగా అందుబాటులో ఉంది. భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్ ప్రధానంగా ఓటరు జాబితాలను శుద్ధి చేయడానికే ఉద్దేశించబడింది. నకిలీ నమోదులు, మరణించిన వారి పేర్లు, నివాసం మారిన వారి సమాచారాన్ని తొలగించి జాబితాలను ఎప్పటికప్పుడు నవీకరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా అవసరం.
కానీ ఈ ప్రక్రియలో అర్హులైన పౌరులు, పేదలు, వలస కార్మికులు, పత్రాలు సరిగ్గా లేని అట్టడుగు వర్గాలు ఓటు హక్కును కోల్పోకుండా చూడటం అంతకంటే ముఖ్యమైన బాధ్యత. ప్రజాస్వామ్యంలో అనర్హులను తొలగించడం ఎంత ప్రధానమో, చట్టబద్ధమైన ప్రతీ ఓటరు హక్కును పరిరక్షించడం కూడా అంతే ముఖ్యం. ఇక ట్రంప్ మద్దతు ఇస్తున్న సేవ్ అమెరికా చట్టం ఫెడరల్ ఎన్నికల నమోదు సమయంలో పౌరసత్వాన్ని ధ్రువీకరించే అధికారిక పత్రాలను తప్పనిసరి చేయాలని ప్రతిపాదిస్తోంది. పౌరులు కానివారు ఎన్నికల్లో ఓటు వేయకూడదనే సూత్రంపై సాధారణ అంగీకారం ఉన్నప్పటికీ, ఆధునిక పత్రాలు లేని నిరుపేదలు, వయోవృద్ధులు, పెళ్లిళ్ల తర్వాత పేర్లు మారే మహిళలకు ఈ నిర్ణయం ఆటంకంగా మారే ప్రమాదం ఉందనే ఆందోళనలు ఉన్నాయి. పైగా.. భారత నమూనాను ఉదాహరణగా చూపేటప్పుడు ఆధార్ కార్డు కేవలం గుర్తింపు, నివాస ధ్రువీకరణకు మాత్రమేనని, అది పౌరసత్వ రుజువు కాదని గ్రహించాలి. ఓటరు ఐడీతో పాటు ఇతర గుర్తింపు పత్రాలను కూడా భారతదేశంలో పోలింగ్ సమయాల్లో ఆమోదిస్తుంటారు. భారత ప్రజాస్వామ్య చరిత్రను పరిశీలిస్తే.. 1975 నాటి చారిత్రక పరిణామాలు, అలహాబాద్ హైకోర్టు తీర్పు వంటి ఘట్టాలు ఎన్నికల వ్యవస్థల స్వతంత్రతను, న్యాయ సమీక్ష ప్రాముఖ్యతను నిరూపించాయి.
అత్యవసర పరిస్థితి వంటి కాలాల్లో పత్రికా స్వేచ్ఛ, పౌర హక్కులు దెబ్బతిన్న తీరును సమాజం గమనించింది. ఆ చరిత్ర నేర్పిన ముఖ్యమైన పాఠం ఏంటంటే, ఎన్నికల భద్రత లేదా సమగ్రత పేరుతో తీసుకునే నిర్ణయాలు సామాన్య పౌరుల ప్రాథమిక ఓటు హక్కును, రాజ్యాంగబద్ధ సంస్థల నిష్పక్షపాత వైఖరిని ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతీయకూడదు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సైతం భారత ఎన్నికల నిర్వహణ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని పేర్కొంది. అయినప్పటికీ.. విదేశీ రాజకీయాల కోసం భారత ఎన్నికల వ్యవస్థలోని కొన్ని ప్రత్యేక గణాంకాలను మాత్రమే ఎంచుకుని ప్రచారం చేయడం సంపూర్ణ వాస్తవాన్ని ప్రతిబింబించదని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ అనుసరిస్తున్న బహుళ పత్రాల గుర్తింపు విధానం, సామాజిక వాస్తవాలు, విస్తృత ప్రజాస్వామ్య పరిధిని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం అమెరికా చట్టాల కఠినత్వానికి మద్దతుగా ఈ పోలికను వాడటం సరైంది కాదు.
ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయత అనేది యంత్రాలు, సంఖ్యలు లేదా పత్రాల నిబంధనల మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ప్రతీ అర్హత కలిగిన పౌరునికి ఓటు హక్కు లభించేలా చూడటం, స్వతంత్రంగా పనిచేసే రాజ్యాంగ వ్యవస్థలు, నిష్పాక్షికమైన మీడియా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం మరింత పటిష్టమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు అమెరికాలో రాజకీయ వేడిని పెంచినప్పటికీ, భారత ఎన్నికల నమూనా యొక్క ప్రాథమిక సూత్రం అర్హులైన ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడమేనన్న వాస్తవాన్ని మరువకూడదు.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
Donald Trump, SAVE America Act, India Electoral Process, Voter ID Rules, Special Intensive Revision SIR


