సర్జరీ చేశారు.. బిల్లు కట్టలేదని కుట్లు వేయకుండా వదిలేశారు..  

వైద్యో  నారాయణ హరీ అంటారు.. డాక్టర్ ను దేవుడితో కొలుస్తుంటారు.. కాని ప్రస్తుతం అంతా కార్పోరేట్ మయం అయింది. వైద్యులు కూడా కాసుల కక్కుర్తిలో పడి .. ఆ వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన జరిగింది. వైద్యుల క్రూరత్వానికి ఓ చిన్నారి పాప బలైంది. హాస్పిటల్‌ బిల్లులు పూర్తిగా చెల్లించలేదన్న కారణంతో సర్జరీ తర్వాత కుట్లు వేయకుండా పాపను కుటుంబసభ్యులకు అ‍‍ప్పగించటంతో ప్రాణాలు కోల్పోయింది. 

ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కౌశాంభి జిల్లాలో  వెలుగు చూసింది. బాధిత చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... కౌశాంభి జిల్లా మన్‌ఝాన్‌పూర్‌ టౌన్‌కు చెందిన మూడు సంవత్సరాల ఓ చిన్నారికి కొద్దిరోజుల క్రితం కడుపులో నొప్పి రావటంతో ప్రయాగ్‌ రాజ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాపను పరీక్షించిన వైద్యులు సర్జరీ చేయాలని నిర్ణయించారు. అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో ఆపరేషన్‌ చేశారు. అయితే హాస్పిటల్‌ బిల్లులు మొత్తం కట్టలేదన్న కారణంతో సర్జరీ చేసిన చోట కుట్లు వేయకుండానే పాపును కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో పాప మరణించింది. 

ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వివరాలను ఓ వ్యక్తి తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయటంతో సంఘటన వైరల్‌ అయింది. దీనిపై స్పందించిన వైద్యాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. హాస్పిటల్ బిల్లు కట్టలేదని.. సర్జరీ చేసి కుట్లు వేయకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ హాస్పిటల్ ను సీజ్ చేయడంతో పాటు కుట్ల వేయకుండా వెళ్లిన డాక్టర్లను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ స్థానికుల నుంచి వస్తోంది.