ఆంధ్రా కాశ్మీర్ ఎక్కడుందో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ కూ ఒక కాశ్మీర్ ఉంది తెలుసా? ఏటా పెద్ద సంఖ్యలో పర్యటకులు ఇక్కడకు తరలివస్తుంటారు. ఆంధ్రాకాశ్మీర్ కు పర్యాటకులు వెల్లువెత్తేందుకు ఒక సీజన్ ఉంది. ఔను శీతాకాలంలో ఆంధ్రాకాశ్మీర్ ను వెతుక్కుంటూ పర్యాటకులు తరలివస్తారు.  చల్లటి వాతావరణం లో మరింత చలి ప్రదేశాలను సందర్శించాలని పర్యాటకులు భావిస్తుంటారు. ఇంతకీ ఆ ఆంధ్రాకాశ్మీర్ ఏదంటే.. దక్షిణ భారతదేశంలోనే అత్యంత చలి ప్రాంతంగా ప్రాచుర్యం పొందిన లంబసింగి. ఔను ఉమ్మడి విశాఖ జిల్లాలోని లంబసింగిని ఆంధ్రా కాశ్మీర్ అంటారు. శీతాకాలంలో ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు. చలితిరగడంతో ఇప్పుడు ఈ ప్రాంతం పర్యాటకుల సందడితో కళకళలాడుతోంది.   
ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న లంబసింగిలో   250 కుటుంబాలు నివసిస్తున్నాయి. అటువంటి చిన్న గ్రామమైన లంబసింగికి ఏటా   పది పదిహేను లక్షల మంది పర్యాటకులు  వస్తుంటారు.  శీతాకాలంలో సగటున రోజుకు పది నుంచి 20వేల మంది ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడమే కాక చలి తీవ్రత అధికంగా ఉంటుంది. అక్టోబర్ నుంచి జనవరి మధ్య శీతాకాలంలో ఇక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని తిలకించడానికే పర్యాటకులు పోటెత్తుతుంటారు. 
అసలు ఇక్కడ ఎందుకు ఇంత చలి ఉంటుందీ అంటే.. పలు కారణాలు చెబుతుంటారు.  ఈ గ్రామం రెండు కొండల మధ్య ఉండటం,  సహజంగా ఏటవాలుగా ఈ గ్రామంలోకి చలిగాలి రావడం మేఘాలు లోపలకు చొచ్చుకు వచ్చే  అవకాశం లేకపోవడంతో వాతావరణం చల్లగా ఉంటుంది.  దీంతో సహజంగా శీతాకాలంలో కనిపించే కనిష్ట ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదు అవుతుంటాయి అయితే ఈ గ్రామానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర ప్రాంతాల్లో సాధారణ వాతావరణ పరిస్థితులు ఉంటాయి.  లంబసింగి గ్రామంలో  శీతాకాలం నాలుగు నెలల పాటు చలి తీవ్రత  అధికంగా ఉంటుంది.  ఇక్కడ  మైనస్  డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం కద్దు. సీతాకాంలో సాధారణంగా  ఉదయం 10 గంటల వరకు సూర్యుడు ఈ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడడు.  దీంతో చలి తీవ్రతతో పాటు చెట్ల మధ్య నుంచి సూర్యకిరణాలు సుతిమెత్తగా తాకే  దృశ్యం ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 3280 అడుగుల ఎత్తులో ఉంటుంది. 
 ఈ ప్రాంతంలో పర్యాటన శాఖతో పాటు   ప్రైవేట్ రంగంలో కూడా రిసార్ట్లు హోటల్స్ రావడంతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగింది.   నవదంపతులు లంబసింగిని హనీమూన్ స్పాట్ గా భావిస్తున్నారు.  ఇటీవలీ కాలంలో ఒడిస్సా ఛతిస్గడ్ తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర నుంచి నూతన జంటలు పెద్ద సంఖ్యలో లంబసింగికి వస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. 
లంబసింగి విశాఖ నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది విశాఖ నుంచి నర్సీపట్నం వరకు 100 కిలోమీటర్లు మైదాన ప్రాంతంలో ప్రయాణం చేస్తే మిగిలిన 30 కిలోమీటర్లు ఘాట్ రోడ్లో ప్రయాణించి ఇక్కడకు చేరుకోవాల్సి ఉంటుంది.   

వెండి మబ్బుల పాల సంద్రం..  చెరువుల వెనం

ఇక లంబసింగి పరిసరాల్లో కూడా బోలెడన్ని సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో  ఇండియా స్విట్జర్లాండ్ గా చెప్పుకునే చెరువుల వెనం గ్రామం ఒకటి.  లంబసింగికి  కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో కొండ ఎగువనున్న ఈ గ్రామంలో ఉదయం 10 గంటల వరకు మంచు మేఘాలు, పాలసముద్రంలా కనిపిస్తాయి.  దీంతో చాలామంది పర్యాటకులు తెల్లవారుజామున లంబసింగి నుంచి నడుచుకుంటూ వెళ్లి ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించి ఆనందపరవశులౌైతారు.  ఇటీవలే ఏపీ టూరిజం అక్కడకు స్థానిక గిరిజనుల ద్వారా నేరుగా వాహనాలను నడుపుతోంది దీంతో వయసు పైబడిన వారు కూడా ఈ ప్రకృతి అందాలను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు.  

అలాగే లంబసింగికి సమీపంలో  ఉన్న తాసంగి రిజర్వాయర్ కూడా తప్పనిసరిగా వీక్షించాల్సిన దర్శనీయ స్థలం. ఇక్కడ రిజర్వాయర్ దాటుతూ జిప్ లైన్ ఏర్పాటు చేశారు.  రిజర్వాయర్ పైనుంచి జిప్ లైన్ లో  వెళ్లడం ఒక ప్రత్యేక అనుభూతిగా పర్యాటకులు చెబుతారు. 

ఇక ఈ ప్రాంతంలోని చారిత్రాత్మక అవశేషాలు కూడా పర్యాటకులకు ఆసక్తికలిగిస్తాయి.  స్వతంత్ర పోరాట సమయంలో అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంతంలో నివాసం ఉన్నట్టు ఆనవాళ్లు ఉన్నాయి ఇక్కడకు సమీపంలో రూథర్ఫర్డ్ అనే బ్రిటిష్ మేజర్ నివాసం ఉందనీ, అక్కడే  అల్లూరి సీతారామరాజును మట్టుపెట్టినట్టు చరిత్ర చెబుతోంది దీనికి తగ్గట్టు ఇప్పటికీ రూథర్ఫర్డ్ నివాసం ఉన్న గెస్ట్ హౌస్, శిబిరాలు కనిపిస్తాయి. ఇక మహాభారత కాలంలో పాండవులు కూడా ఇక్కడ సంచరించినట్టు స్థానికులు చెప్తుంటారు ఇక్కడ గిరిజన ప్రజల సంప్రదాయాలు నివాస వ్యవహారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి స్థానికుల థింసా  డాన్స్ మరొక ప్రత్యేక ఆకర్షణ.  స్థానిక గిరిజనులతో పాటు పర్యాటకులు థిసా డాన్స్ చేస్తూ ఆనందపరవశులు కావడం కద్దు.

పర్యాటకాన్ని ప్రోత్సహించే క్రమంలో ఏపీ టూరిజం ఇక్కడ రిసార్ట్స్ ఏర్పాటు చేసింది.  ఇతర హోటల్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి.  ఒకప్పుడు పరిమితంగా వచ్చే పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. దీంతో స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి.  చల్లని వాతావరణంలో వేడి వేడి టీ... టిఫిన్ లాంటి వంటకాలతో పాటు బెంబు చికెన్ ఇక్కడ పర్యాటకులు అత్యంత ఇష్టపడే వంటకం.  గిరిజనుల ఇళ్లల్లో కూడా నివాసం ఉండే రీతిన హోం స్టే లను   పర్యాటకశాఖ ఏర్పాటు చేసింది. ఇవి అదనపు ఆకర్షణగా మారాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu