డీయంకే తో దోస్తీ కత్తి మీద సామువంటిదే

 

తమిళ తంబిలతో వ్యవహారం కత్తి మీద సాము వంటిదని, వారికి కోపమొచ్చినా సంతోషం కలిగినా పట్టలేమని కాంగ్రెస్ పార్టీ నిశ్చితాభిప్రాయం సరైనదేనని, డీయంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి చాలా సార్లు నిరూపించారు.

 

తనకు మద్దతు ఇస్తున్న పార్టీ అధ్యక్షుడు కరుణానిధి ముద్దుల కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు అని కూడా చూడకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం కనిమోలిని 2జి స్కాం లో అరెస్ట్ చేయడమే కాక, పది నెలలు తీహార్ జైల్లో పెట్టి ఆమె చేత క్రోవ్వొత్తులు కూడా చేయించుకొన్నప్పుడు, ఆ కన్న తండ్రి హృదయం ఎంతగా రగిలిపోయుంటుందో కాంగ్రెస్ కి కూడా బాగా తెలుసు. అయితే రాష్ట్రంలో, పగబట్టిన పాములాంటి జయలలిత చేతిలో చిక్కి విలవిలలాడుతున్నందున, విధిలేని పరిస్థితుల్లో యుపీయేకు తన మద్దతు కొనసాగించవలసి వచ్చింది. తరువాత 2జీ స్పెషలిస్టులు కనిమోలి, రాజా ఇద్దరూ జైలు నుండి బెయిలుపై విడుదల కాగానే, శ్రీ లంక తమిళుల సమస్యను సాకుగా చూపించి, యుపీయేకు తన మద్దతు ఉపసంహరించి, మూడు చెరువుల నీళ్ళు తాగించాడా పెద్దాయన. అయితే, తండ్రిగా ఆయనపడిన ఆవేదనను అర్ధం చేసుకొన్న సోనియమ్మ మాత్రం డీయంకేతో దోస్తీ కొనసాగించాలని విశ్వప్రయత్నం చేసింది. అయితే ఆయన పేరుకి కరుణానిధి అయినప్పటికీ, ఆయన కాంగ్రెస్ పై ఇసుమంత కరుణ చూపలేదు.

 

అంత మాత్రాన్న కాంగ్రెస్ కూడా నిరాశాపడిపోలేదు. ఆయన మనసులో చోటు సంపాదించడానికి తగిన అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంది. మొన్న జరిగిన రాజ్యసభ అభ్యర్ధుల ఎన్నికలలో కనిమోలికి ఐదు సీట్లు తక్కువబడటంతో, అదే అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఆమెకు తన ఐదు ఓట్లు వేసి, ఆమెకు రాజ్యసభ సీటు మళ్ళీ దక్కేలా చేసింది. దానితో కటినాత్ముడనుకొన్న కరుణానిధి మనసు వెన్నపూసలా కరిగిపోయింది. అందుకు నిదర్శనంగా, ఆయన తన కుమార్తెను స్వయంగా డిల్లీ వెళ్లి సోనియమ్మకు కృతజ్ఞతలు చెప్పి, పనిలోపనిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలిసి స్నేహగీతాలు పాడుకోవడానికి తమకు అభ్యంతరం లేదని సోనియమ్మ చెవిలో ఊది రమ్మని పంపారు. డిల్లీ వెళ్లి సోనియమ్మను కలిసి వచ్చిన కనిమోలి, తానూ కేవలం ‘థాంక్స్’ చెప్పడానికే ఇంత దూరం ఎగురుకొంటూ వచ్చానని మీడియాకు నమ్మబలుకుతున్నారు.

 

అయితే, కాంగ్రెస్ పార్టీ మొన్న బీహార్ లో నితీష్ కుమార్ కి కూడా ఇలాగే సహాయపడితే ఆయన జస్ట్ ఒక రెండు రూపాయలు పెట్టి ఒక ఫోన్ కాల్ చేసి థాంక్స్ చెప్పాడే తప్ప ఇలా ఇంత దూరం ఎగురుకు రాలేదు కదా? మరి కనిమోలి ఎందుకు అంత శ్రమపడింది? అంటూ మీడియావాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కారు