మండలిలో జీఎస్టీపై తీర్మానం.. వైసీపీ మద్దతిచ్చిందా? లేదా?

జీఎస్టీపై వైసీపీ వైఖరి ఏమిటన్నది అంతుపట్టకుండా ఉంది. ఒక వైపు ఆ పార్టీ అధినేత జీఎస్టీని పొగుడుతూ, ప్రధాని మోడీని ఆకాశానికెత్తేశారు. అయితే మండలిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ మాత్రం జీఎస్టీ విషయంలో తన వైఖరి ఏమిటో స్పష్టం చేయకుండా పలాయన మంత్రి పఠించింది. ఇంతకీ విషయమేంటంటే.. అసెంబ్లీలో జీఎస్టీ సంస్కరణలను ఆమోదిస్తూ ప్రభుత్వం తీర్మానించింది. 
ఇక శాసన మండలిలో బుధవారం జీఎస్టీ సంస్కరణలపై బుధవారం (సెప్టెంబర్ 24) తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానానికి అధికార పార్టీ సభ్యులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కానీ వైసీపీ మాత్రం తన వైఖరిని స్పష్టం చేయలేదు. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా వైసీపీ తన వైఖరి  చెప్పాలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దీనిపై సభలో ప్రతిపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ నేరుగా సమాధానం ఇవ్వలేదు. పైగా జీఎస్టీ సంస్కరణలు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు.. దేశమంతటా అమలు అవుతున్నాయి కదా..అటువంటప్పుడు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తీర్మానం ఎందుకు అంటూ దాటవేశారు.

అయితే పయ్యావుల మాత్రం జీఎస్టీ సంస్కరణలను వైసీపీ స్వాగతించి మద్దతు ఇస్తోందా లేదా చెప్పాలంటూ పట్టుబట్టారు. అప్పటికి కూడా బొత్స  స‌మాధానం దాట వేసి మరేదో మాట్లాడారు. ఈ దశలో పయ్యావుల మీరు ఆమెదం తెలపకపోతే ఢిల్లీ నుంచి మీ నాయకుడికి ఫోన్ వస్తుందేమో అని చమత్కరించారు. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ జీఎస్టీ సంస్కరణలను అద్భుతం అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన సంగతిని కూడా గుర్తు చేశారు. అయినా బొత్స నోట మాత్రం జీఎస్టీకి ఆమోదం అన్న మాట రాలేదు. ఆ దశలో మండలి చైర్మన్ జఎస్టీపై తీర్మానాన్ని సభ ఆమోదించినట్లుగా ప్రకటించారు. దీనికి కూడా  కూడా మంత్రి పయ్యావుల కేశవ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ..  వైసీపీ స‌భ్యులు త‌మ అభిప్రాయం చెప్పకుండా తీర్మానం ఆమోదం పొందింద‌ని ఎలా ప్ర‌క‌టిస్తార‌ని చైర్మ‌న్‌ను నిల‌దీశారు. అయితే చైర్మన్ పయ్యావుల అభ్యంతరాన్ని పట్టించుకోకుండా భోజన విరామానికి సభను వాయిదా వేశారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu