తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
posted on Oct 13, 2025 7:11AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తిరుమలేశుని దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతుంటారు. సోమవారం (అక్టోబర్ 13) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 29 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడుతోంది. కాగా ఆదివారం (అక్టోబర్ 12) శ్రీవారిని మొత్తం 84,424 మంది దర్శించుకున్నారు. వారిలో 27,872 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 06 లక్షల రూపాయలు వచ్చింది.