ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఆంధ్రప్రభ కార్యాలయంలో ఈడీ సోదాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ ఆంధ్రప్రభ కార్యాలయంపై శుక్రవారం (అక్టోబర్ 7) దాడులు నిర్వహించింది. ఈ దాడులతో లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ మీడియా మేనేజ్ మెంట్ బహిర్గతమైంది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం రూ.20 కోట్లను ఆంధ్రప్రభకు బదలీ చేసినట్లు ఈడీ పేర్కొంది.

ఈ మొత్తాన్ని  తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు సన్నిహితుడైన అభిషేక్ రెడ్డి ఆంధ్రప్రభలో ఇన్వెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. కాగా ఆంధ్రప్రభ ఎండీ గౌతమ్ ను ఈడీ అధికారులు ఆయన నివాసంలో విచారిస్తున్నారు.

ఇలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ  ఢిల్లీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుల నివాసాలలో కూడా సోదాలు నిర్వహిస్తోంది. మనీష్ సిసోడియా సన్నిహితులు దినేష్ అరోరా నివాసం, కార్యాలయాలతో పాటు ఆయన స్నేహితుల ఇళ్లలో కూడా శుక్రవారం దాడులు చేసింది.

ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. దినేష్ అరోరా ఖాతాలలో అనుమానాస్పద లావాదేవీలను ఈడీ గుర్తించినట్లు చెబుతున్నారు.  రాధాకృష్ణా ఇండస్ట్రీ ద్వారా రూ. కోటి నగదు దినేష్ అరోరా ఖాతాకు బదిలి అయినట్లు, ఆ సోమ్మును దినేష్ అరోరా మనీష్ సిసోడియాకు అందించినట్లు ఈడీ గుర్తించింది. ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న సమీర్ మహేంద్రు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగానే హైదరాబాద్ లో మాదాపూర్ లోని అభినవ్ రావ్ నివాసాలు, కార్యాలయాలపైనా, అలాగే కూకట్ పల్లికి చెందిన శరత్ చంద్ర నివాసంలోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అలాగే ఆంధ్రప్రభ కార్యాలయంలో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తున్నది.