పచ్చిమిరపకాయ ప్రాణాలు తీసింది
posted on Mar 14, 2016 3:21PM

పచ్చిమిరపకాయని కొరకడం వల్ల ఓ రెండేళ్ల పాప తన ప్రాణాలనే కోల్పోయింది. దిల్లీలో జరిగిన ఈ సంఘటన ద్వారా పిల్లల ఉసురు తీసేందుకు ఎన్నిరకాలైన ప్రమాదాలు వేచిఉంటాయో మరోసారి తెలుస్తోంది. డా॥ చిత్తరజంన్ బెహరా అనే వైద్యుడు అందిస్తున్న సమాచారం ప్రకారం... మిరపకాయను తిన్న తరువాత విపరీతంగా వాంతులు చేసుకున్న ఆ పాప తన ప్రాణాల మీదకే తెచ్చుకుంది. జీర్ణాశయంలో ఉండే ద్రవాలు ఊపిరితిత్తులలోకి చేరుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. సాధారణంగా ఊపిరితిత్తులలోకి ఇలాంటి ద్రవాలు చేరుకున్నప్పుడు, అవి శ్వాసకు అడ్డుపడకుండా మన శరీరం ప్రయత్నిస్తుందనీ.... వాంతులు చేసుకోవడం, దగ్గడం ద్వారా మనిషి శ్వాసనాళంలో ఉన్న ద్రవాలు వెలుపలికి వెళ్లిపోతాయనీ చెబుతున్నారు. అయితే రోగి స్పృహ కోల్పోయినప్పుడు, రోగికి తెలియకుండానే ఊపిరితిత్తులు ద్రవాలతో నిండిపోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు శ్వాస ఆడక రోగి చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.