చిన్న పిల్లలకు కొవాగ్జిన్ వ్యాక్సిన్! క్లీనికల్ ట్రయల్స్ కు పర్మిషన్ 

కరోనా కల్లోలంతో అల్లాడుతున్న దేశానికి ఇదో గుడ్ న్యూస్. చిన్న పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే దిశగా కీలక ముందడుగు పడింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన `కోవాగ్జిన్` టీకా 2-18 ఏళ్ల మధ్య వయసు గల వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకునేందుకు క్లినికల్ ప్రయోగాలు జరిపేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది. 2-18 ఏళ్ల మధ్య వయసు గల వారిపై కోవాగ్జిన్ రెండు, మూడు దశల పరీక్షలు ప్రయోగాలు నిర్వహించాలని నిపుణులు కమిటీ చేసిన సిఫారసు మేరకు డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 

2-18 ఏళ్ల మధ్య వయసు గల 525 మంది వాలంటీర్లపై భారత్ బయోటెక్ ఈ ప్రయోగాలు జరపనుంది. అయితే మూడో దశ ప్రయోగాలు ప్రారంభించడానికి ముందే రెండో దశ క్లినికల్ ట్రయల్స్ భద్రత డేటా, డీఎస్‌ఎంబీ సిఫారసులను సీడీఎస్‌సీవోకు సమర్పించాలని భారత్ బయోటిక్‌కు డీసీజీఐ సూచించింది. ఢిల్లీ ఎయిమ్స్, పట్నా ఎయిమ్స్ సహా దేశవ్యాప్తంగా పలు చోట్ల ఈ ప్రయోగాలు జరగనున్నాయి. వాలంటీర్లకు 28 రోజుల వ్యవధిలో రెండు డోసులను ఇచ్చి ఫలితాలను విశ్లేషించనున్నారు. 

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. ఫస్ట్ వేవ్ లో వృద్ధులపై వైరస్ ఎక్కువ ప్రభావం చూపగా... సెకండ్ వేవ్ లో యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత రెండు నెలలుగా యువకులే ఎక్కువగా కరోనా భారీన పడుతున్నారు. సెప్టెంబర్ లో భారత్ లో థర్డ్ వేవ్ రావొచ్చని వైద్య నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. థర్డ్ వేవ్ లో చిన్నారులపై కరోనా పంజా విసిరే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేలా కొవాగ్జిన్ క్లీనికల్ ట్రయల్స్ జరుగుతుండటం ఊరట కల్గిస్తోందియ చిన్న పిల్లల వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేలోపు.. 18 ఏండ్ల పైబడిన వారందరికి టీకాలు వేసేలా భారత సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది.