కేసీఆర్ కోరుకున్నదే సీఈసీ చేసిందా?దళిత బంధుపై రాజకీయ రగడా? 

మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కారెక్కారు. హుజూరాబాద్ లో దళిత బందుకు బ్రేక్ పడింది. ఉపఎన్నిక అయ్యేంత వరకు హుజురాబాద్ లో దళిత బంధు పథకం అమలు చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఇది యాదృచ్చికమే కావచ్చును.. కానీ ఆయనంటే గిట్టని వాళ్ళు, అది ఆయన పాద మహిమ అంటే అనవచ్చును. అయితే కేసీఆర్ కోరుకున్నదే కేంద్ర ఎన్నికలసంఘం కరుణించింది అనే మాట కూడా వినిపిస్తోంది. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది చేసినా పక్కా ప్రణాలికతో చేస్తారు. ముందస్తు వ్యూహం ఎంత పటిష్టంగా ఉంటుందో ... వెంక నుంచి పొడిచే వెన్ను పోటు కుట్ర కూడా అంతే పదునుగా ఉంటుందంటారు. అదీ, ఇదీ  ఒకేసారి అమలు చేయడంలో కేసీఆర్ కి కేసీఆరే సారి కాదంటే కేటీఆర్ అని కూడా పార్టీ క్యారిడార్లలో వినిపిస్తూ ఉంటుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైఫల్యం వల్లనే కేంద్ర ఎన్నికల సంఘం  దళిత బంధు పథకం నిలిపివేసిందని ఆరోపించారు. ఏదో విధంగా దళిత బంధు పథకాన్ని నిలిపివేయించి, ఇతరులపై నెపాన్ని నెట్టాలని కేసీఆర్‌ కుట్ర చేశారని ఆరోపించారు. దళితులను మరోసారి మోసం చేసినందుకు ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దళిత బంధు డబ్బులను లబ్ధిదారుల అకౌంట్‌లో వేస్తూనే.. వాటిని డ్రా చేసుకోకుండా ఫ్రీజ్‌ చేయించారని అన్నారు. 

దళిత బంధుకు బ్రేకేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం  తీసుకున్న నిర్ణయం పై కారు, కమలం మధ్య జగడం నడుస్తోంది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య గొడవ మొదలైంది.  దళిత బంధు అమలును బీజేపీయే నిలిపివేయించిందని ఆరోపిస్తూ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు సోమవారం రాత్రి హుజూరాబాద్‌ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఈటల రాజేందర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహం చేస్తుండగా టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడం వల్లే ఎన్నికల కమిషన్‌ దళిత బంధు  పథకాన్ని నిలిపివేసిందని ఆరోపించారు. ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకొని పథకాన్ని యథావిధిగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే దళితవాడల్లోకి బీజేపీ నేతలను రానివ్వబోమని హెచ్చరించారు. 

బీజేపీ లేఖ వల్లనే దళితబంధు పథకం నిలిచిపోయిందని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి మండిపడ్డారు. దళిత బంధు పథకం అమలుపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈనెల 7న కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖను విడుదల చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, హుజురాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని బదిలీ చేయాలని లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. దళితబంధు లబ్ధిదారులను గుర్తించినప్పటికీ వాళ్ళ ఖాతాలో కావాలనే నగదు జమ చేయటంలేదని ఆరోపించారు. ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు దళితబంధు నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని అధికార పార్టీ  ప్రయత్నాలు చేస్తోందన్నారు. 

అయితే, దళిత బందు విషయంలో మొదటినుంచి దళితులలో ఉన్ననుమానాలను ఎన్నికల సంఘం నిజం చేసింది.ఇక ఈ పరిస్థితులలో హుజురాబాద్ లో దళితులు ఎటు మొగ్గుతారు, ఎవరికి ఓటేస్తారు.. చూడవలసి వుంది...