410మంది గ‌ల్లంతు!.. కొట్టుకుపోయిన నౌకలు.. తుఫాను బీభ‌త్సం..

తౌక్తే. ఇంకా తీర‌మైనా దాట‌లేదు అప్పుడే స‌ముద్రంలో క‌ల్లోలం సృష్టిస్తోంది. భారీ గాలులు, వ‌ర్షాల‌తో దేశ ప‌శ్చిమ తీరంలో తుఫాను బీభ‌త్సం రేపుతోంది. అతిభీకర తుఫానుగా మారిన త‌క్తే తీవ్ర‌త‌తో ముంబైలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అప్రమత్తమైన బృహన్ ముంబై కార్పొరేషన్.. బాంద్రా-వోర్లి సీ లింక్ మీదుగా ప్రయాణించే వారిని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించింది.

మ‌రోవైపు.. తుపాను తాకిడికి.. బాంబే హై తీరంలో నిలిపి ఉన్న రెండు బార్జ్‌ల (నౌక‌లు) యాంకర్‌లు తొలగిపోయాయి. దీంతో అవి అలల ధాటికి కొట్టుకుపోతున్నాయి. వీటిల్లో 410 మంది సిబ్బంది ఉన్నారు. అప్రమత్తమైన నేవీ సిబ్బంది వారిని రక్షించడం కోసం తక్షణ స‌హాయకచర్యలు చేపట్టారు. 

‘‘బాంబే హై ప్రాంతంలో 273 మంది సిబ్బందితో ఉన్న పీ305 బార్జ్‌ హీరా ఆయిల్‌ ఫీల్డ్స్‌ను వదిలి నీటిపై కొట్టుకుపోతోందని సమాచారం వచ్చింది. దీంతో రెస్క్యూ సేవల కోసం ఐఎన్‌ఎస్‌ కోచి బయల్దేరింది’’ అని నేవీ అధికార ప్రతినిధి ట్విటర్‌లో వెల్లడించారు. ఈ బార్జ్‌ ఓఎన్జీసీ సంస్థకు చెందినది. అయితే తమ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, బార్జ్‌ కూడా స్థిరంగా ఉందని కంపెనీ ప్ర‌క‌టించ‌డం క‌న్ఫ్యూజ‌న్ క్రియేట్ చేస్తోంది. 

ఇక, GAL కన్స్‌ట్రక్టర్‌కు చెందిన మరో బార్జ్ సైతం ముంబయి తీరం నుంచి 8 నాటికైల్‌ మైళ్లు కొట్టుకుపోయినట్లు నేవీకి మరో అత్యవసర సందేశం అందింది. అందులో 137 మంది సిబ్బంది ఉన్నారు. దీంతో సహాయక చర్యల నిమిత్తం ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా నౌక వెళ్లింది. తుపానుకు ముందు బార్జ్‌లన్నింటికీ యాంకర్‌ వేసే ఉందని.. అయితే తౌక్తే ధాటికి యాంకర్లు ఊడిపోయి అవి కొట్టుకుపోయాయని నేవీ తెలిపింది. ఈ బార్జ్‌ల్లోని సిబ్బందిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు నౌకాదళ సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

మహారాష్ట్రపై తీవ్ర ప్ర‌భావం.. 
తౌక్తే తుపాను కారణంగా గత రాత్రి నుంచి ముంబైలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముంబై ఎయిర్‌పోర్టులో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. లోకల్‌ రైళ్లను కూడా అధికారులు నిలిపివేశారు. తుపాను కారణంగా కొంకణ్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఆనంద్‌వాడీ హార్బర్‌లో రెండు బోట్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఒక నావికుడు మృతి చెందగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఇక రాయ్‌గఢ్‌ ప్రాంతంలో భవనం గోడ కూలి ఓ వ్యక్తి చనిపోయారు. 

వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. వీలైనంత వరకు ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది. తుపాను మరింత బలపడి.. అతి తీవ్ర తుపానుగా మారినట్టు వాతావరణ విభాగం ప్రకటించింది. ప్రస్తుతం ముంబైకి 150 కి.మీల దూరంలో కేంద్రీకృతమైన తుపాను పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 20 కి.మీ.ల వేగంతో ప్ర‌యాణిస్తోంది. తుఫాను సహాయక సన్నద్ధతపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రేతో ప్రధాని మోదీ మాట్లాడారు. పునరావాస చర్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. గుజ‌రాత్‌, గోవా ముఖ్యమంత్రుల‌తోనూ ప్ర‌ధాని ఫోన్లో మాట్లాడి తుఫాను ప‌రిస్థితులపై ఆరా తీశారు.

కేరళలో అధిక తీవ్రత..   
కేరళలోనూ తౌక్తే తీవ్రత అధికంగా ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారి కెరటాలు భారీ ఎత్తున ఎగసిపడుతుండటంతో తీర ప్రాంతాల్లోని అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 9 జిల్లాల్లో తుఫాను ప్రభావం కనిపించింది. భారీ వర్షాలకు అనేక డ్యాంలలో నీటి మట్టం పెరగడంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఎర్నాకుళం, ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ మూడు జిల్లాల్లో ఆరంజ్‌ హెచ్చరిక జారీచేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇళ్లల్లో చిక్కుకుపోయిన వారిని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.  

కర్ణాటకలో భారీ వర్షాలు..
కర్ణాటకలోని ఏడు జిల్లాల పరిధిలో తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. ఉత్తర కన్నడ, ఉడిపి, చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. దాదాపు 200 వరకు ఇళ్లు ధ్వంసం కాగా.. 491 విద్యుత్‌ స్తంభాలు నేలకూలినట్టు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. 

గోవా గోస..
శనివారం రాత్రి నుంచే గోవాలో భారీ గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు మృతిచెందారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్‌  సరఫరాకు తీవ్ర అంతరాయం.. విద్యుత్‌ పునరుద్ధరణకు అధికారులు నిరంతరాయంగా పనిచేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.   

సోమ‌వారం సాయంత్రం 5.30గంటల నుంచి రాత్రి 8.30గంటల మధ్య గుజరాత్‌ తీరాన్ని తాకనున్న తుపాను.. రాత్రి  8నుంచి 12గంటల మధ్య పోరుబందర్‌, మహువా వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. గుజరాత్‌లోని 17 జిల్లాల్లో లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల కోసం 54 ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి.