మూడు రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

శ్రీలంక తీరానికి సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వాహ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజులూ ఏపీకి భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని పేర్కొంది. వాతావరణ హెచ్చరిక నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.    

ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమలికి 170 కి.మీ., పుదుచ్చేరికి 570 కి.మీ., చెన్నైకి 670 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై  ఉన్న దిత్వాహ్ తుపాను  గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఆదివారం తెల్లవారు జామున తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను ప్రభావంతో శుక్రవారం (నవంబర్ 28) సాయంత్రం నుంచే కోస్తా తీరం వెంబడి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది.

 ఇక శనివారం (నవంబర్ 29) అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో, ఆదివారం (నవంబర్ 30) ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.  బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో నూ పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.  వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu