ఇక క‌రెన్సీ నోట్ల బాగోగులూ చూసుకోవాలి!

ప్ర‌జ‌ల్ని ఎలాంటి క‌ష్ట‌న‌ష్టాల‌కు గురిచేయ‌కుండా వుండేది మంచి పాల‌న‌. మాటి మాటికి ఏదో ఒక కొత్త నిబంధ‌న‌ల‌తో వేధించేది అస‌లు ప్ర‌భుత్వ‌మ‌నిపించుకోదు. న‌రేంద్ర‌మోదీ నాయ‌క‌త్వంలోని బిజెపి ప్ర‌భుత్వం నోట్ల మార్పిడి నిర్ణ‌యంతో గ‌తంలో సామాన్య జ‌నాన్ని గ‌తంలో ఎంతో ఇబ్బంది పెట్టింది. ఇపుడు కొత్త‌గా మ‌రో ఇబ్బంది పెట్టే మార్గాన్ని ఎంచుకుంది. మ‌నిషి ఆరోగ్యంగా వున్న‌దీ లేనిదీ ఫిట్నెస్ టెస్ట్ పెట్ట‌డం పోలీసు, ఆర్మీ వుద్యోగాల్లో మామూలే. క‌రెన్సీ నోట్లు ఫిట్నెస్ త‌నిఖీ చేసే యంత్రాల‌ను రంగంలోకి దింపాల‌ని యోచిస్తున్నారు ప్ర‌ధాని. బ్యాంకుల్లో, పెద్ద పెద్ద మాల్స్‌లో నోట్ల‌ను లెక్కించే మిష‌న్లే ఇప్ప‌టివ‌ర‌కూ చూశాం. ఇక నుంచి మ‌నం జేబులోంచి ఇచ్చే ప‌ది, ఇర‌వై, యాభై, వంద నోట్లు కాస్త‌ కూడా న‌ల‌క్కుండా, మ‌ట్టి ప‌ట్ట‌కుండా వుండాలిట‌! చిన్న‌పాటి చిరుగు వున్నా ప‌నికిరాద‌ట‌. అలాంటి నోట్ల‌ను ప‌నికిరాని నోట్లుగా ప‌రిగ‌ణిస్తార‌ట‌. దేనిక‌యినా ఒక అంతూ పొంతూ వుండాలి. 

అదేమాలోచ‌న‌? క‌రెన్సీ నోట్లు త‌యార‌యి వ‌చ్చిన కొత్త‌ల్లోనే త‌ళ‌త‌ళ‌లాడేది, గ‌ట్టిగా క‌నిపించేది. జ‌నాల వాడ‌కంలో వాటి రూపు రేఖ‌ల్లో కాస్తంత మార్పువ‌స్తుంది. స‌హ‌జం. కానీ అలా జ‌ర‌గడానికి వీల్లేద‌ని  ఏకంగా కేంద్ర‌మే చెబితే ఇక మామూలు చిన్న‌పాటి వుద్యోగి, ప‌నివాళ్లు ఎలా వాటిని కాపాడుకుంటారు? నోటు రంగు పోయినట్లయితే అది పనికిరాని నోటు. చిరిగిన నోటుపై ఏదైనా రకమైన టేప్ అతికించి ఉంటే ఆ నోట్లు పనికిరావు. నోట్ల రంగు పోయి లేదా తేలికగా మారినట్లయితే అవి అన్ ఫిట్ కేటగిరీలో చేర్చుతారు. ఫిట్ నోట్ అనేది వాస్తవమైన తగినంత శుభ్రంగా ఉండే నోటు. రీసైక్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.

నోటు భౌతిక స్థితిని బట్టి రీసైక్లింగ్‌కు పనికొస్తాయా? లేదంటే ఆ కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దశలవారీగా తొలగించి వాటి స్థానంలో కొత్త నోట్లను తయారు చేస్తుంది. ఇలాంటి నోట్లని గుర్తించడానికి కొత్తగా మెషీన్లని తయారుచేస్తోంది. రీసైక్లింగ్‌కు అనువుగా ఉన్న నోట్లను మాత్రమే వినియోగించాలని బ్యాంకులకు తెలిపింది. లేదంటే రీ సైక్లింగ్‌ చేయించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది.

అస‌లే ఆటోవాళ్లు, బ‌స్సులో కండెక్ట‌ర్లూ కాస్తంత బాగా న‌లిగినా, చిన్న‌పాటి చిరుగు క‌నిపించినా ఏదో పెద్ద నేరం చేసిన‌ట్టు చూసి వాటిని తిర‌స్క‌రిస్తున్నారు. స‌రిప‌డా చిల్ల‌రా లేక‌, అటువంటి నోట్ల‌తో బ‌స్సో, ఆటో ఎక్కిన‌వారంతా స‌ద‌రు డ్రైవ‌ర్‌చేతిలో వినిపంచి వినిపించ‌ని స్వ‌రంలో తిట్ల‌నీ తింటున్నారు. మొత్తానికి రోజులు ఇలా గ‌డుస్తున్నాయి. ఇపుడు హ‌ఠాత్తుగా న‌లిగిన నోట్ల సంగ‌తి సీరియ‌స్‌గా తీసుకోమ‌ని ఆర్బీఐకి కేంద్రం సూచించ‌డం దారుణం. ఫిట్నెస్ లేని నోట్లు రీసైక్లింగ్‌కీ ప‌నికిరావ‌ట‌! దేశంలో మొత్తం న‌లిగిపోయిన నోట్ల‌ను తిరిగి బ్యాంకుల‌కు అప్ప‌గించ‌మ‌ని ఆదేశిస్తే మ‌ళ్లీ అంద‌రూ బ్యాంకుల ముందు వ‌రుస‌గా నిల‌బ‌డి మ‌ళ్లీ రోజుల త‌ర‌బ‌డి అవ‌స్థ‌లు ప‌డాల్సిందే. ప్ర‌భుత్వం పాల‌నాప‌ర‌మైన నిర్ణ‌యాల అమ‌లు కంటే ఇలా ప్ర‌జ‌ల్ని ఇబ్బంది పెట్టే అంశాలు, మార్గాన్వేష‌ణ‌లోనే బాగా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తోంది. దీని వ‌ల్ల ప్ర‌యోజ‌న‌మేమిటి?  ప్ర‌తీ నోటు కొంత‌కాలం త‌ర్వాత న‌లిగిపోతుంది, ఇస్త్రీ చొక్కాలా స్టిఫ్‌గా, కొత్త సిగెరెట్ ప్యాక్లా త‌ళ‌త‌ళ‌లాడ‌దు. 

ఇంత‌కంటే పేద బ‌డుగు వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు వారి సేవ‌ల‌కు త‌గిన ప‌లితం ద‌క్కుతోందా, వారిని నిజంగా ఆదుకునేంద‌కు ఎలాంటి ప‌థ కాలు స‌క్ర‌మంగా అమ‌లు చేయాల‌న్న ఆలోచ‌న‌చేస్తే మంచిది. నోట్లు బాగుండాలి, రోడ్లు బాగుండాలి వంటి నినాదాలు, ప్ర‌చారాల కంటే వెనుక‌బ‌డిన ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు స‌క్ర‌మంగా అమ‌లు అయ్యేట్టు త‌గు చ‌ర్య‌లు తీసుకోవ‌డంపై కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు దృష్టి పెట్ట‌డం ఎంతో మంచిది, అవ‌స‌రం. ప్ర‌జ‌ల్ని కేవ‌లం ఓట‌ర్లుగానే భావించ‌డం త‌గ్గించుకోవాలి. నోట్ల మీద వున్న శ్ర‌ద్ధ మ‌నుషుల బాగోగుల మీదా వుండాలి.