భారత్ లో ఆగస్టులోనే కొవిడ్ థర్డ్ వేవ్? రోజుకు ఎన్ని కేసులు వస్తాయంటే..?

20 నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తోంది కొవిడ్ మహమ్మారి. కొత్త కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతూ మరణ మృదంగం మోగిస్తోంది. ప్రస్తుతం కొవిడ్ డెల్టా వేరియంట్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. భారత్ లో లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న డెల్టా వేరియంట్ కు ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా సహా వంద దేశాలకు పైగా అల్లాడిపోతున్నాయి. డెల్టా వేరియంట్ తో రానున్న రోజుల్లో పెను ముప్పు రాబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

కొవిడ్ సెకండ్ వేవ్ తగ్గిందని సంతోష పడే లోపే భారత్ లోనూ మళ్లీ ప్రమాద ఘంటికలు కనిపిస్తున్నాయి. వారం రోజులుగా దేశంలో మళ్లీ యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటం థర్డ్ వేవ్ రాకకు సంకేతమనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్ లో థర్డ్ వేవ్ త్వరలోనే రాబోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా భారత్ లో థర్డ్ వేవ్ కు సంబంధించి ఐఐటీ నిపుణులు సంచలన విషయాలు వెల్లడించారు. వీరి అధ్యయనంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్  ఆగస్టు నెలలో ఇండియా లో విజృంభించే అవకాశం ఉందని తేలింది.  రోజువారీ ఇన్ఫెక్షన్లు ఒక లక్ష నుండి 1.5 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.

దేశంలో థర్డ్ వేవ్  లో కోవిడ్ -19 కేసుల పెరుగుదలను అంచనా వేయడానికి గణిత నమూనాను అభివృద్ధి చేసిన ఐఐటి హైదరాబాద్ మరియు ఐఐటి కాన్పూర్ లో మతుకుమల్లి విద్యాసాగర్ మరియు మనీంద్ర అగర్వాల్ ఈ పరిశోధన నిర్వహించారు. గత ఏప్రిల్-మేలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన తీవ్రమైన సెకండ్ వేవ్ ను  వీళ్లు ఖచ్చితంగా అంచనా వేశారు.కేరళ మరియు మహారాష్ట్ర వంటి అధిక కరోనా కేసులు నమోదు అవుతాయని ఐఐటీ నిపుణుల పరిశోధనలో తేలింది.

అయితే థర్డ్ వేవ్.. రెండవ వేవ్ కంటే బలహీనంగా ఉంటుందని భావిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. సెకండ్ వేవ్ లో రోజువారి కేసులు నాలుగు లక్షలకి పైగా నమోదు అయ్యాయి.  ప్రభుత్వం టీకాల డ్రైవ్ను వేగవంతం చేయాలని కొత్త వేరియంట్ లు వెలువడే అవకాశం ఉన్నందున అభివృద్ధి చెందుతున్న హాట్ స్పాట్ లను పట్టుకోవడానికి మరియు జన్యు శ్రేణిని విస్తరించడానికి నిఘా పద్ధతులను అమలు చేయాలని సూచించింది. జూలైలో SBI రీసెర్చ్ ప్రచురించిన ఒక నివేదిక ఆగస్టు నాటికి భారతదేశంలో మూడవ తరంగాన్ని అంచనా వేసింది. ఇది సెప్టెంబర్ లో పిక్స్ కి  చేరుకుంటుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్  సైంటిస్ట్ ప్రొఫెసర్ సమీరన్ పాండా చెప్పారు.