కొవాగ్జిన్‌ భేష్‌.. వ్యాక్సిన్‌పై వ‌ర్రీ వ‌ద్దు..

భారత్‌ బయోటెక్ త‌యారీ కొవాగ్జిన్‌ సమర్థంగా పనిచేస్తోందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి-ఐసీఎంఆర్‌ ప్రకటించింది. సార్స్‌కోవ్‌-2, దానిలో కొత్తగా వచ్చిన మ్యూటెంట్‌  రకాన్ని కూడా అడ్డుకుంటోందని తెలిపింది. యూకే, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా రకం వైరస్‌లను కొవాగ్జిన్‌ బలంగా నిలువరించినట్టు వెల్ల‌డించింది. ఇటీవలే భారత్‌లో కనిపిస్తున్న డబుల్‌ మ్యూటెంట్‌  రకంపై కూడా కొవాగ్జిన్‌ బలంగా పనిచేస్తోందని ఐసీఎంఆర్ ట్వీట్ చేసింది. 

కొవిడ్‌ టీకా  తీసుకొన్నా ఇన్ఫెక్షన్లు వస్తే భయపడాల్సిన పనిలేదని భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా తెలిపారు. ఇంజెక్షన్‌ రూపంలో తీసుకొనే కొవిడ్‌ టీకా ఊపిరితిత్తుల కింద భాగాన్నే వైరస్‌ నుంచి రక్షిస్తుందని పై భాగాన్ని కాదని వివరించారు. వ్యాక్సిన్‌ తీసుకొన్న తర్వత కూడా వైరస్‌ శరీరంలోకి  ప్రవేశించినా..  ప్రాణాంతకంగా మారకుండా ఉంటుందని ఆయన వివరించారు. అయితే, టీకా తీసుకొన్నా మాస్క్‌ ధరించడం తప్పనిసరి. 

కొవిడ్‌-19 కేసుల తీవ్రత పెరగడం, టీకాకు తీవ్రమైన కొరత ఏర్పడటంతో భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ‘కొవాగ్జిన్‌’ టీకా తయారీని గణనీయంగా పెంచాలని ప్రతిపాదించింది. ఏడాదికి 70 కోట్ల డోసుల కొవాగ్జిన్‌ టీకా తయారీ సామర్థ్యం జులై-ఆగస్టుకు సమకూరుతుందని  భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లోని భారత్‌ బయోటెక్‌ యూనిట్లలో దశల వారీగా టీకా ఉత్పత్తి పెంచుతారు.

మ‌రోవైపు.. ప్రైవేట్ మార్కెట్లో అమ్మే కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధ‌ర‌ల‌ను సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్ర‌క‌టించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసుకు రూ. 400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 600 చొప్పున టీకాను విక్రయిస్తామని తెలిపింది. 

‘‘కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మా ఉత్పత్తిలో 50శాతం కేంద్రానికి, 50శాతం రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులకు అందజేయనున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసుకు రూ. 400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 600 చొప్పున విక్రయిస్తాం. విదేశీ టీకాలతో పోలిస్తే మా వ్యాక్సిన్‌ ధరలు అందుబాటులోనే ఉన్నాయి’’ అని సీరమ్‌ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే రెండు నెలల్లో టీకా ఉత్పత్తిని మరింత పెంచి కొరతను అధిగమిస్తామంది. 4, 5 నెలల తర్వాత రిటైల్‌ మార్కెట్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీర‌మ్ వెల్ల‌డించింది.