వైసీపీ దాడుల‌పై ఎదురుదాడి.. ర‌గులుతున్న ర‌చ్చ‌..

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికార నివాసంపై శుక్రవారం అధికార వైసీపీ నాయకులు, కార్యకర్తలు జరిపిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. విజయవాడలో పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. నల్లజెండాలతో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. దాడికి నాయకత్వం వహించిన జోగి రమేష్ డౌన్ డౌన్ అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. జోగి రమేష్, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చిత్రపటాలను ద‌హనం చేశారు. సుధీర్గ రాజకీయ అనుభవం ఉన్న, చంద్రబాబుపై దాడిని ఖండిస్తూ మహిళల కూడా ఆందోళనలకు దిగారు. మంత్రి పదవి కోసం ఎంతకైనా దిగజారుతారా? అంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై రాళ్లదాడికి పాల్పడిన వైసీపీ నేతలు.. శనివారం మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడును టార్గెట్ చేశారు. నర్సీపట్నంలో వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు అయ్యన్న పాత్రుడి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 

మరోవంక చంద్రబాబు నివాసం వద్ద నిన్న చోటుచేసుకున్న ఘటనలపై గుంటూరు పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. తెదేపా నేత జంగాల సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేయగా.. ఎమ్మెల్యే జోగి రమేశ్‌ డ్రైవర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసును నమోదు చేసినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు.

ఇదలా ఉండగా, చంద్రబాబు నివాసంపై అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేయడాన్ని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, రామకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ చిత మోహన్ తీవ్రంగా  ఖండించారు. రాజకీయాల్లో ఇలాంటి ధోరణి సరైంది కాదని రామకృష అన్నారు. ప్రతిపక్ష నేత ఇంటిపై దాడికి పూనుకోవడం ముమ్మాటికీ తప్పని.. సీఎం దీనిని ఖండించాలని, వైసీపీ శ్రేణుల్ని అడుపుచేయాలని అన్నారు. మాజీ సీఎం ఇంటిపై దాడి చేస్తుంటే పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అలాగే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారన్నారు. ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, విమర్శలు సైద్ధాంతికం ఉండాలని హితవుపలికారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా హోం మంత్రి ఏమి చేయలేని పరిస్థితిలో ఉండడం శోచనీయమన్నారు. సిపిఐ నేత రామకృష్ణ విచారం వ్యక్త పరిచారు.  అలాగే, చంద్రబాబు ఇంటిపై అధికార పార్టీ దాడిని ఖండిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి,  చింతా మోహన్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలను గౌరవించినప్పుడే అధికార పార్టీ గౌరవం నిలబడుతుందన్నారు.