ఆ పెళ్లికీ ప్రగతిభవన్ కూ లింకేంటి? కేసీఆర్ మీద కత్తులు నూరుతున్న విపక్షాలు

దాదాపు నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ లో ఓ భారీ విందు జరిగింది. బహుశా దాన్ని ఇప్పటికీ ఎవరూ మరచిపోయి ఉండరు. హైలెవల్ ఇంటర్నేషనల్ ప్రొఫైల్ కలిగిన టాప్ అమెరికన్ బ్యూరోక్రాట్స్ కు ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ఓ భారీ ట్రీట్ ఇచ్చారు. ఇప్పుడా హోటల్ పేరు గుర్తొచ్చి ఉంటుంది కదా. అంతర్జాతీయంగా ప్రఖ్యాతికెక్కిన తాజ్ ఫలక్ నుమాలో ఆనాటి భారీ విందు జరిగింది. అప్పటి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ గారాలపట్టి ఇవాంకా ట్రంప్ ముఖ్యఅతిథిగా వచ్చినందుకు భారత ప్రభుత్వం ఆమె తన జీవితంలో మరచిపోలేని విధంగా రాచమర్యాదలు చేసింది. అమెరికా-భారత్ లాంటి రెండు పెద్ద దేశాల మధ్య జరగాల్సిన ఎన్నో కార్యక్రమాలు, అవగాహనలు, ఒప్పందాలు ఉంటాయి కాబట్టి.. ఆ లెవెల్లో అలాంటి ట్రీట్స్ ఇవ్వడం కామన్. అయితే దాదాపుగా అలాంటి భారీ ట్రీటే మన తెలంగాణ సర్కారులో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి కూడా అదే హోటల్లో ఇవ్వడమే విశేషం. అయితే ఇది దేశాల మధ్యనో, ప్రభుత్వాల మధ్యనో రాచకార్యాలు చక్కదిద్దేందుకు ఉద్దేశించిన విందు కాదు. ఆ సీనియర్ బ్యూరోక్రాట్ కూతురు వివాహం కోసం పలు తాజ్ హోటల్స్ ను బుక్ చేసుకున్నారు. ఆ బుకింగ్ లో అత్యంత ఖరీదైన తాజ్ ఫలక్ నుమా కూడా ఉండడమే ఇప్పుడు చర్చనీయాంశం పరిధిని దాటి సంచలనంగా మారి వివాదాలకూ తావిస్తోంది. ఎటొచ్చీ బంతి అటు తిరిగీ ఇటు తిరిగీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరే ఆగుతుండడంతో విపక్షాలకు మరో అతి ముఖ్యమైన అస్త్రాన్ని అందించినట్లయింది. 

రాష్ట్ర ప్రభుత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న రజత్ కుమార్ కూతురు అంజలి వివాహం మొన్న డిసెంబర్ 17 నుంచి 21 వరకు అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంత ఖరీదైన తాజ్ హోటల్స్ లో ఐదు రోజుల పాటు రాజదర్పం ఒలకబోస్తూ జరిగిన ఈ ఈవెంట్ కి  పెద్దమొత్తంలోనే  ఖర్చయింది. అయితే ఆ మొత్తాన్ని ఎవరు చెల్లించారు, ఎలా చెల్లించారు అన్న అనుమానం దగ్గరే  అసలు కథ పురుడు పోసుకుంది. ఎక్కడా కనిపించని, ఏ ప్రాజెక్టులూ పూర్తి చేయని షెల్ కంపెనీ బిగ్ వేవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద బిల్లుల చెల్లింపు జరగడమే అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు.. మరో మిస్టరీ కంపెనీ అయిన ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్స్ పేరు మీద కూడా బిల్లులు జారీ అయ్యాయి. వాటిలో బిగ్ వేవ్ అనే కంపెనీని ఈ వెడ్డింగ్ కి కొద్ది నెలల ముందే క్రియేట్ చేయడం విశేషం. ఇక ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్స్ 2010లోనే రిజిస్టర్ అవగా... ఆ రెండు కంపెనీల్లోనూ డైరెక్టర్లుగా ఉన్నవారు  ఎంఈఐఎల్ లోనూ కీలక హోదాల్లో ఉండడం చెప్పుకోవాల్సిన అంశం. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని బహదూర్ పురాలో చాలా రష్ గా ఉండే నివాస గృహాల మధ్య బిగ్ వేవ్ కంపెనీ అడ్రస్ ఉండగా అక్కడ ఆఫీసు గానీ, ఓ కంపెనీ గానీ లేకపోవడం గమనించాల్సిన మరో అంశం. 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కాళేశ్వరం  ప్రాజెక్టు కాంట్రాక్టులు దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) పేరు మీద రజత్ కుమార్ కూతురి  పెళ్లిఖర్చుల బిల్లులు జెనరేట్ అయ్యాయి. ఎంఈఐఎల్ కి చెందిన మురళితో పాటు టి.ప్రమీలన్ అనే మరో ఉద్యోగి తాజ్ కృష్ణా, తాజ్ దక్కన్, తాజ్ ఫలక్ నుమా వంటి హోటల్స్ లో డిసెంబర్ 17 నుంచి 21 వరకు వివిధ సందర్భాల్లో ఈవెంట్లు బుక్ చేసినట్లు ఆధారాలు లభించాయి. 

ప్రపంచ స్థాయి భారీ ప్రాజెక్టుగా, త్వరితగతిన పూర్తయిన ప్రాజెక్టుగా, అత్యంత పెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు పేరుంది. ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరానికి కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపైనే కేసీఆర్ అత్యంత అవినీతికి పాల్పడ్డారని విపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు విమర్శల  మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ప్రాజెక్టును మొదలుపెట్టినప్పుడు 40 వేల కోట్లుగా  అంచనా వ్యయం ఉండగా... అదిప్పుడు లక్షా 15 వేల కోట్లు దాటింది. దాదాపు మూడింతల అంచనా వ్యయాన్ని ఎందుకు పెంచాల్సి వచ్చిందన్న ప్రశ్నలకు ఇప్పటికీ కేసీఆర్ దగ్గర సరైన జవాబు లేకపోవడం గమనించాలి. అలాంటి ప్రాజెక్టుకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రజత్ కుమార్ ఇర్రిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్ మెంట్ శాఖను పర్యవేక్షిస్తున్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కింద జరిగే అన్ని వ్యవసాయ, విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల లావాదేవీలకు ఇంచార్జీ ఆయనే అన్నమాట. అలాంటి ప్రాజెక్టును మేఘా కృష్ణారెడ్డి దక్కించుకున్నారు. ఆ మేఘా కృష్ణారెడ్డి నిర్వహిస్తున్నదే  ఎంఈఐఎల్ కంపెనీ. ఈ ప్రాజెక్టు కింద వ్యవసాయం, వ్యవసాయ భూములకు పరిహారాలు, విద్యుదుత్పత్తి, విద్యుత్ ట్రాన్స్ మిషన్ వంటి అనేక లాభదాయకమైన పనుల బాధ్యతలు నిర్వహిస్తున్న రజత్ కుమార్ కూతురు వివాహానికి అదే కంపెనీ (ఎంఈఐఎల్) బిల్లులు చెల్లించినట్లు సాక్ష్యాధారాలు సహా బయటపడడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. 

హోటల్ ఖర్చులకయ్యే కాంట్రాక్టు మొత్తాన్ని ఎంఈఐఎల్ దాదాపుగా రూ. 50 లక్షలకు కుదుర్చుకున్నట్టు  సమాచారం. అయితే ఆ బిల్లులు మాత్రం ఎంఈఐఎల్ పేరు మీద కాకుండా బిగ్ వేవ్, ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్స్ అనే కంపెనీల మీద రెయిజ్ చేయాలని సూచించారు. రూ. 23 లక్షలు మాత్రం బిగ్ వేవ్ పేరు మీద చెల్లించినట్లుగా ట్రాన్సాక్షన్ జరిగింది. మరికొంత బిల్లు పెండింగ్ లో కనిపిస్తోంది. ఇక పెళ్లి తరువాత తాజ్ ఫలక్ నుమాలో 101 మంది కూర్చుండే పేద్ద భోజనశాలలో అంజలి అత్తంటి అతిథులు, రజత్ కుమార్ తరఫు బంధువులకు కలిపి మొత్తం 70 మందికి అత్యంత భారీ విందు ఏర్పాటు చేసినట్లు, వారికి ఒక్కో ప్లేటు భోజనానికి 16,520 రూపాయలు ఖర్చు చేసినట్టు బిల్లుల ద్వారా తెలుస్తోంది. అత్యంత ఖరీదైన ఈ వెడ్డింగ్ వార్త బయటికి రావడంతో ఎంఈఐఎల్  లోనే కాక ప్రగతిభవన్ లో సైతం టెన్షన్ వాతావరణం ఏర్పడినట్లు సమాచారం. ఎందుకంటే రజత్ కుమార్ గతంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా కూడా పనిచేశారు. ఆ సమయంలో ఆయన టీఆర్ఎస్ కు లబ్ధి చేకూరేలా వ్యవహరించారని, అందుకు ప్రతిఫలంగా కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టు నిర్వహించే అవకాశాన్ని కేసీఆర్ కట్టబెట్టారని ప్రతిపక్షాలు విమర్శించాయి. సోషల్ మీడియాలోనూ  అప్పట్లో కథనాలు వెల్లువెత్తాయి. అయితే వాటిపై రజత్ కుమార్ అప్పట్లో సైబర్ పోలీసుల దగ్గర కంప్లయింట్ చేశారు. అవన్నీ ఫేక్ వార్తలని కొట్టి పడేశారు. తాజాగా ఆయన కూతురు పెళ్లి కోసం ఇంత భారీ ఎత్తున ఖర్చు చేయడం, అందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్న ఎంఈఐఎల్ కంపెనీ బిల్లులు చెల్లించడం, పెళ్లికి కొద్ది నెలలు ముందే ఓ షెల్ కంపెనీ ఓపెన్ చేయడం.. ఇలాంటివన్నీ అనుమానాలకు తావిస్తున్నాయి. 

తన కూతురు పెళ్లి ఖర్చుకు ఎంఈఐఎల్ కు ఎలాంటి సంబంధం లేదని రజత్ కుమార్ బుకాయిస్తున్నా... ఎవరైనా అధికారి వ్యక్తిగత హోదాలో చేసుకునే కార్యక్రమాలకు ఎంఈఐఎల్ కు ఎలాంటి సంబంధం లేదని మేఘా ప్రతినిధులు సాకులు వెదుక్కుంటున్నా... వ్యక్తుల ప్రైవేటు కార్యక్రమాల వివరాలను తాము వెల్లడించేది లేదని తాజ్ హోటల్స్ వారు రిప్లయి ఇస్తున్నా... రజత్ కుమార్ కూతురి పెళ్లికి కొద్దిరోజుల ముందు నుంచి చోటు చేసుకున్న పరిణామాలు, లావాదేవీలు అన్నీ కూడా అనుమానాలు పెంచుతున్నాయే తప్ప క్లారిటీ ఇవ్వడం లేదన్న వ్యాఖ్యానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. మరి దీనిపై విపక్షాలు అడిగే ప్రశ్నలకు కేసీఆర్ అండ్ టీమ్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.