ఆంధ్రాలో 'మర్యాదలు' అడుక్కుంటున్న పోలీసు బాసులు

ఆంధ్రా ఐపీఎస్ ఆఫీసర్లకు ఇప్పుడో పెద్ద సమస్య వచ్చి పడింది. సమస్య తమదే అయినా దానికి పరిష్కారం మాత్రం వారి చేతుల్లో లేకపోవడమే విశేషం. తాము ఎదుర్కొంటున్న సమస్యకు ప్రతిపక్షం నుంచి పరిష్కారాన్ని ఆశిస్తున్నారు. ఇది మరీ విచిత్రమైన సమస్య. ఒక వస్తువు ఎక్కడ పోయిందో అక్కడ వెదికితేనే దొరుకుతుందని ఎంత చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. పోయిన చోటే వెదుక్కో పోరా.. అని మన పెద్దలు కూడా చిన్నప్పట్నుంచే చెవినిల్లు కట్టుకొని చెబుతారు. కానీ ఏపీలో ఐపీఎస్ ఆఫీసర్లు మాత్రం ఇంత చిన్న లాజిక్ ను మిస్సవుతుండడమే అసలు పాయింటు. 

ఇక విషయానికొద్దాం. మొన్న గుడివాడ ఘటన తరువాత ఐపీఎస్ అధికారుల సంఘానికి ఓ పేద్ద డౌటొచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణంతా తామే దగ్గరుండి చూసుకునే ఖాకీ బాసులు అయినప్పటికీ ప్రజలంతా తమను ఎందుకనో లైట్ తీసుకుంటున్నారన్న అనుమానం మొదలైంది. అనుమానం వచ్చిందే తడవు ఓ అనౌన్స్ మెంటు ప్రిపేర్ చేశారు. ప్రజల మీదికి వదిలారు. ఐపీఎస్ అధికారులను ప్రతిపక్షాలు లైట్ తీసుకుంటున్నాయని, ముఖ్యంగా రాష్ట్ర పోలీస్ బాసును ఏకవచనంతో సంబోధించడంతో తామంతా హర్ట్ అవుతున్నామని, శాంతి భద్రతల నిర్వహణలో నిద్రాహారాలు మాని పనిచేస్తుంటే తమనే ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయని, ఇది తమకెంతో అవమానకరమని, ఖాకీ బట్టలేసుకున్న తమకు ఈ అవమానమే ఎంతో అమర్యాదాకరమని, ప్రతిపక్షాలు కాసింత మర్యాదలు నేర్చుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఓ ప్రకటన జారీ చేశారు.. ఐపీఎస్ అధికార్ల సంఘం జాయింట్ సెక్రటరీ ఆర్పీ మీనా. 

ఇదంతా ఎందుకొచ్చిందంటే గుడివాడలో కొడాలి నానికి సంబంధించిన కె.కన్వెన్షన్ లో విచ్చలవిడిగా జూదం ఆడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. దానిపై నిజనిర్ధారణ కోసం టీడీపీ ఆధ్వర్యంలో కొంతమంది నాయకుల బృందం అక్కడికి బయల్దేరింది. అయితే టీడీపీ నాయకులు అక్కడకు వెళ్లకుండా విజయవంతంగా అడ్డుకున్న పోలీసులు.. వైసీపీ నేతల ప్రవాహాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. అసలు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదంటే సబబుగా ఉంటుంది. వైసీపీ నేతల వాహన ప్రవాహాన్ని శక్తివంచన లేకుండా యథేచ్ఛగా ముందుకు పోనిచ్చారనేది ఇంకా కరెక్టు. దీంతో ఏమైంది? మందబలం చూసుకున్న వైసీపీ నేతలంతా రెచ్చిపోయి టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు. పిడిగుద్దులు కురిపించారు. కనీసం అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా వారి వాహనాల్ని కూడా వ్యూహాత్మకంగా ధ్వంసం చేశారు. పనిలో పనిగా నోటిక్కూడా పని చెప్పి బూతు పురాణాలు అందుకున్నారు. అసలక్కడ క్యాసినో లాంటి అంతర్జాతీయ జూదక్రీడ జరగనప్పుడు టీడీపీ నిజనిర్ధారణ టీమ్ ను ఆపడం దేనికి? అక్కడ క్యాసినో ఒకవేళ జరిగితే జరుగుతున్నట్టు ప్రజలు తెలుసుకుంటారు. జరక్కపోతే అలాంటిదేం లేదని, ప్రతిపక్ష టీడీపీనే అనవసరంగా డ్రామా క్రియేట్ చేసిందని ప్రజలే నిర్ధారించుకుంటారు కదా. జరగాల్సిన కార్యక్రమాన్ని శాంతిభద్రతల సమస్య రాకుండా జరగనిస్తే అయిపోయేదానికి ఈ ప్రకటన దాకా తీసుకురావడంలో ఆంతర్యమేంటి? అసలు  తాము చేయాల్సిన పని చేయకపోవడం వల్లే ప్రతిపక్షాలు రంగంలోకి దిగాయన్న సింపుల్ లాజిక్ ను పోలీసులు ఎందుకు మిస్సవుతున్నారని అడుగుతున్నారు సామాన్య జనం. పోనీ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా టీడీపీ పరివారాన్ని ఆపారే అనుకుందాం. మరి వైసీపీ నేతలను కూడా అదే తరహాలో ఆపి ఉండాల్సింది కదా. అలా జరిగినప్పుడే పోలీసు బాసులు విధి నిర్వహణను సక్రమంగా నిర్వర్తించినట్లు అవుతుంది కదా. ఆ పని చేయలేని, చేత కాని నిర్వాకం చేత.. కడుపు రగిలిన ప్రతిపక్షాలు పోలీస్ అధికారుల వైఫల్యాల మీద విరుచుకుపడితే, ఓ నాలుగు ఘాటైన వ్యాఖ్యలతో చురకలంటిస్తే అది వారి తప్పెలా అవుతుంది? ఈ మాత్రం విమర్శలు కూడా తట్టుకోలేనివారు... మరి అధికార పార్టీకి అంతలా ఏజెంట్లలాగా వ్యవహరించడం ఎందుకున్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తే ఆ తప్పెవరిది?

అయినా ఖాకీ బాసులు విఫలమైనప్పుడు ఇక ప్రతిపక్షాలకు మిగిలిందేమిటి? ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలకు తమ గోడేంటో వెళ్లబోసుకోవడమే కదా. దానిక్కూడా ఐపీఎస్ అధికారుల సంఘం ఉడుక్కుంటే ఎలా? అసలు మీనా అంటున్నదేంటి? డీజీపీ గౌతం సవాంగ్ ను ఏకవచనంతో సంబోధిస్తారా.. అని. ఏం? ఏకవచన ప్రయోగం ఏమైనా నేరామా? ఘోరమా? అప్రజాస్వామికమా? అవమానకరమైన పద ప్రయోగమా? పోనీ... నువ్వు అనే పదాన్ని ఐపీఎస్ సంఘం సంస్కార రహితంగా భావిస్తున్నదా? ఖాకీ బట్టల అంకిత భావాన్ని తమరు చేజేతులా అధికార పార్టీ ముందు ఒగ్గేస్తే... మాటలు పడి, దెబ్బలు తిని, వాహనాలు కోల్పోయి చెల్లాచెదురైన టీడీపీ నేతలు.. ఏకవచన ప్రయోగం చేసినందుకే మీకు మర్యాద లోపించినట్లు అనిపించిందా? ఇంతకన్నా విడ్డూరం ఉంటుందా? ఈ మాత్రం కూడా ఆత్మపరిశీలన చేసుకోలేదు కాబట్టే... ఆంధ్రా పోలీసు బాసులు మర్యాదలను అడుక్కోవాల్సిన దుస్థితిలో పడిపోయారని సామాన్య జనం చెవులు కొరుక్కుంటున్నారు. కనీసం ఇకనుంచైనా ఇలా మర్యాదలు అడుక్కోవడం కాకుండా మీ మర్యాదల్లో మీరుంటే ఎదుటివారు కూడా మర్యాదలు పాటిస్తారని, లేనిపక్షంలో వారిచేతుల్లో మళ్లీ మర్యాదలు చేయించుకోవాల్సిన పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదన్న సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.