ఎమ్మెల్యే కాపు పై ఎదురుతిరిగిన కాంట్రాక్ట‌ర్లు

రాష్ట్రంలో ఎక్క‌డ‌న్నా అభివృద్ధి ప‌నులు స‌క్ర‌మంగా జ‌రుగుతున్న‌దీ లేనిదీ ఎమ్మెల్యే ప‌రిశీలించ‌వ‌చ్చు. అందులో ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌రు. త‌న ప్రాంతంలో జ‌రిగే ప‌నుల గురించి ఆ మాత్రం శ్ర‌ద్ధ అవ‌స‌రం కూడా. కానీ సంబంధంలేని ప్రాంతానికి వెళ్లి అక్క‌డి వారితో వాదులాట‌కు దిగితే ఎవ‌రు మాత్రం మ‌ర్యాద‌గా వింటారు? వ‌చ్చిన కార‌ణం తెలిసిన‌పుడు అక్క‌డివారికి విసిగెత్తి తిర‌గ‌బ‌డ‌తారు. ఇదే అనుభ‌వం ప్ర‌భుత్వ విప్‌, వైసీపీ అనంత‌పురం జిల్లా అధ్య‌క్షుడు, రాయ‌దుర్గం ఎమ్మెల్యే కాపు రామ‌ చంద్రారెడ్డికి ఎదురయింది. 

క‌ర్ణాట‌క రాష్ట్రంలోనూ, క‌ర్నూలు జిల్లా ప‌రిధిలోనూ జ‌రుగుతోన్న తుంగ‌భ‌ద్ర‌ద ఎగువ‌, దిగువ కాలువ‌ల  (హెచ్ ఎల్సీ, ఎల్ ఎల్సీ) ఆధునీక‌ర‌ణ ప‌నులు జ‌రుగుతున్నాయి. బుధ‌వారం క‌ర్ణాట‌క, క‌ర్నూలు జిల్లా ప‌రిధిలో జ‌రుగుతున్న‌ ప‌నుల‌పై పెత్త‌నం చేయ‌డానికి వెళ్ల‌డ‌మే కాకుండా ప‌ర్సంటేజీల కోసం కాంట్రా క్ట‌ర్ల‌పై ఒత్తిడి తేవ‌డంతో వారు ఆగ్ర‌హించి ఎమ్మెల్యేపై ఎదురుతిరిగారు. అస‌లు ఇక్క‌డి ప‌నుల‌తో మీకు సంబంధ‌మేమిట‌ని నిల‌దీయ‌డం కంటే అవమానం వేరొక‌టి వుండ‌దు. తుంగ‌భ‌ద్ర బోర్డు ప‌రిధిలో జ‌రిగే ప‌నుల్లో చాలారోజులుగా ఎమ్మెల్యే కాపు జోక్యం చేసుకుంటున్నార‌న్న ఆరోప‌ణ‌లు వున్నాయి.  కాగా అధికార వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే ఆయ‌న‌ను హెచ్చ‌రించార‌ని తెలిసింది. 

కాపు రామచంద్రారెడ్డి తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల ఆధునికీకరణ పనులను పరిశీలించేందుకు బుధవారం వెళ్లారు. తుంగభద్ర ఎగువ కాలువలో(13 ప్యాకేజీలు) రూ.430 కోట్లు, ఎగువ కాలువలో రూ.500 కోట్లతో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ఎగువ కాలువ పనుల పరిశీలన అనంతరం దిగువ కాలువ పనులను చూసేందుకు కాపు వెళ్లారు. దిగువ కాలు వ పనులన్నీ కర్ణాటక, కర్నూలు జిల్లా పరిధిలో జరుగుతున్నాయి. అక్కడికి వెళ్లి, పర్సెంటేజీలు అడగటంతో కాంట్రాక్టర్లు ఎదురు తిరిగినట్లు తెలిసింది. 

ఒక ప్రజాప్రతినిధిగా పనులు పరిశీలించవచ్చు. కానీ ఆయన వేరే ఉద్దేశంతో వస్తున్నారు. తనకు పనుల్లో పర్సెంటేజీ ఇవ్వాలని ఆది నుంచి డిమాండ్‌ చేస్తున్నారని కొందరు కాంట్రాక్టర్లు మండిపడ్డారు. ఆధునికీ కరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లలో ఎక్కువ మంది వైసీపీవారే. దీంతో తాము చేసే పనులపై పెత్తనం ఏమిటని రామచంద్రారెడ్డికి ఎదురు తిరుగుతున్నారు. ఈ వివాదం బుధవారం పతాక స్థాయికి చేరింది. కొందరు కాంట్రాక్టర్లు కాపుపై తిరుగుబాటు చేసి నిలదీశారు.

నీ ఇష్టం వచ్చింది చేసుకో. మాదీ వైసీపీనే. నీకు దిక్కున్న చోట చెప్పుకో.. అని తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. మరికొందరు అక్కడి నుంచే నేరుగా ప్రభుత్వ సలహాదారుకు(సజ్జల రామకృష్ణారెడ్డి) ఫోన్‌ చేసి విషయం చెప్పినట్లు సమాచారం. ఒక ఎమ్మెల్యే కూడా కాపు రామచంద్రారెడ్డికి బుధవారం గట్టిగా వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇక చేసేది లేక బుధవారం మధ్యాహ్నం కాపు తిరుగుముఖం పట్టినట్లు తెలిసింది.