వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాదు కాంగ్రెస్సే!

ఈ సారి ఎన్నికలలో నిజమైన ముప్పు కాంగ్రెస్ పార్టీ నుంచే ఉందని టీఆర్ఎస్ భయపడుతోంది. ఈ విషయాన్ని పీకే సర్వే పేర టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా  సెలక్టివ్ గా మీడియాకు వెల్లడించారు.  అలా వెల్లడించే క్రమంలో  తమ పార్టీకి విజయావకాశాలు భేషుగ్గా ఉన్నాయని సర్వే చెప్పిందంటూ లెక్కలు చెప్పారు.

 అది వేరే సంగతి. ఇక్కడ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వెల్లడించిన సర్వే ఫలితం ద్వారా   తేలిందేమిటంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చేది కాంగ్రెస్సేనని. బీజేపీ తెలంగాణలో మూడో స్థానానికి పరిమితం అవుతుందని. తెలుగువన్ ఇదే విషయాన్ని చాలా ముందుగానే చెప్పింది. ఇప్పుడు సర్వే ఫలితమంటూ కేసీఆర్ అదే చెబుతున్నారు. కాంగ్రెస్ దూకుడును ఆపేందుకే బీజేపీకి తెరాస లేని ప్రాముఖ్యత ఇస్తోందనీ..తెలుగువన్ ముందుగానే విశ్లేషించింది.  ఇప్పుడు టీఆర్ఎస్ పీకే సర్వే ఫలితమని చెబుతూ అనధికారికంగా, వ్యూహాత్మకంగా, ఉద్దేశపూర్వకంగా చేసిన లీకు ద్వారా చెప్పిన విషయం కూడా అదే.  

అయితే సర్వే ఫలితమంటూ,  వచ్చే ఎన్నికల్లో   సొంతంగానే అధికారానికి అవసరమైన మెజారిటీ సాధిస్తుందని చెప్పింది. నిజంగా పీకే సర్వే ఫలితమే అలా వచ్చిందా.. లేక టీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసం అలా చెప్పుకుంటోందా అన్నది పక్కన పెడితే.. మరో అభిప్రాయానికి తావు లేకుండా టీఆర్ఎస్ రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్నది బీజేపీ కాదు కాంగ్రెస్సేనని బయట పెట్టేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ ఎటువంటి ఇబ్బందీ లేకుండా అధికారానికి అవసరమైన స్థానాలను చులాగ్గా సాధించేస్తుంది.

రెండో స్థానంలో కాంగ్రెస్ నిలుస్తుంది. ఇక బీజేపీ ఎంత హడావుడి చేస్తున్నా, చేసినా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు చాలా దూరంగా మూడో స్థానానికి పరిమితమైపోతుంది. ఇదీ టీఆర్ఎస్ ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిథులకు ఇచ్చిన సమాచారం.  ఇక పీకే నివేదికలో కొత్తగా ఏమీ లేదని తేలిపోయింది. పలు నియోజకవర్గాలలో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి తీవ్రంగా ఉందని, వారిని మారిస్తే ఆ నియోజకవర్గాలలో టీఆర్ఎస్ విజయం నల్లేరు మీద బండినడకేననీ పీకే సర్వే ఫలితం తేల్చిందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదంతా పార్టీ కేడర్ లో నెలకొన్న అసంతృప్తినీ, ప్రజలలో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి టీఆర్ఎస్ అగ్రనేతే  పీకే సర్వే పేరిట ఇచ్చిన ముందస్తు సమాచారంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  ఇప్పుడు కొత్త పించన్లు, రేషన్ కార్డులు అంటూ ప్రభుత్వం హామీలు గుప్పించడం కూడా ప్రభుత్వ వ్యతిరేకతను ఏదో మేరకు తగ్గించే వ్యూహంలో భాగమేనంటున్నారు. ఇక్కడ పీకే సర్వే పేరిట వెల్లడైన అంశాలను గమనిస్తే ప్రస్ఫుటంగా అవగతమయ్యే విషయమేమిటంటే.. తెలంగాణలో కాంగ్రెస్ గణనీయంగా బలం పెంచుకుంది. ఒక విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ ను బలంగా డీకొనేందుకు సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ ప్రాధాన్యత తగ్గించి, బీజేపీని ఎక్కవ చేసి చూపడానికి టీఆర్ఎస్ అధినేత ఎంతగా ప్రయత్నిస్తే అంతగా నేలకు కొట్టిన బంతిలా బలోపేతం అవుతూ వచ్చింది. విభేదాలు, గ్రూపు తగాదాలు ఉన్నా అన్నిటినీ అధిగమించి ప్రజా విశ్వాసాన్ని చూరగొంది. ఇదే విషయాన్ని కొంచం మార్చి కేసీఆర్ సర్వే పేరుతో క్యాడర్ కు సందేశం పంపారు. ఇక  బీజేపీని వదిలేసి కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలకు పదును పెట్టాలన్న సంకేతం ఇచ్చారు.