వెనుకా ముందుగా తెలంగాణా ప్రక్రియ ఖాయం

 

సీమాంధ్ర ప్రాంతం అంతా సమైక్య ఉద్యమాలతో హోరెత్తిపోతున్నతరుణంలో, నిన్నపార్లమెంటులో ఆర్ధిక మంత్రి చిదంబరం రాష్ట్ర విభజనపై జరిగిన చర్చకు సమాధానం చెపుతూ, తాము రాష్ట్ర విభజనపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తరువాత, అన్నిపార్టీలను సంప్రదించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకొన్నామని చెప్పారు. ఈవిషయంలో కాంగ్రెస్ పార్టీ సరయిన హోంవర్క్ చేయలేదని, ఎవరినీ సంప్రదించలేదనే ప్రతిపక్షాల వాదనలు అర్ధరహితమని ఆయన కొట్టిపడేసారు. తెలంగాణ ఏర్పాటులో కొంత జాప్యం జరుగవచ్చునేమో తప్ప, విభజన ప్రక్రియ ఇక ఎంత మాత్రం ఆగదని ఆయన స్పష్టం చేసారు. వీలయినంత త్వరగా రాజ్యంగా బద్దంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణాపై ఇక ఎట్టి పరిస్థితుల్లో వెనుతిరిగే ప్రసక్తి లేదని నిర్ద్వందంగా ఆయన ప్రకటించారు. తాను కేంద్ర మంత్రిగా ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నానని కూడా స్పష్టం చేసారు. దీనితో కాంగ్రెస్ పార్టీ ఇక ఆరు నూరయినా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా తెలంగాణాపై ఏర్పాటు విషయంలో వెనకడుగు వేయబోదని స్పష్టమయింది.

 

అదే సమయంలో సోనియా గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలెవరూ కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని ప్రశించడం కానీ, దానిపై తమ అభిప్రాయాలను ప్రజలు, మీడియా ముందు ప్రకటించరాదని స్పష్టమయిన ఆదేశాలు జారీ చేసారు. దీనితో రాష్ట్ర విభజనపై ప్రతిపక్షాలు చేస్తున్నతీవ్ర విమర్శలకు ఎట్టకేలకు మేల్కొన్న కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అనిశ్చిత స్థితికి తెరదించి, రాష్ట్ర విభజనకు సానుకూల వాతావరణం సృష్టించేందుకు నడుం బిగించినట్లు అర్ధం అవుతోంది. కాంగ్రెస్ అధిష్టానం గనుక తన రాష్ట్ర నేతలకు ముందు ముక్కు తాడు వేయగలిగితే, పరిస్థితులు చాలా వరకు చక్కబడవచ్చును.

 

అసలు రాష్ట్ర విభజన ప్రకటనకు ముందుగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాధికారులతో, అన్ని రాజకీయ పార్టీలతో కూడిన ఒక కమిటీని వేసి అందరికీ అమోదయోగ్యమయిన విధంగా శాస్త్రీయంగా విభజన ప్రక్రియ మొదలుపెట్టి ఉండి ఉంటే, నేడు రాష్ట్రంలో ఈ దుస్థితి ఉండేది కాదు. అదేవిధంగా విభజన ప్రక్రియ మొదలుపెట్టక మునుపే కాంగ్రెస్ అధిష్టానం రెండు ప్రాంతాలకు చెందిన తన రాష్ట్ర నేతలను అదుపుచేసి ఉండి ఉంటే నేడు రాష్ట్రంలో ఇంత అరాచక పరిస్థితులు తలెత్తేవి కావు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకే, ముందు చేయవలసిన పనులను తరువాత చేస్తూ రాష్ట్రంలో అశాంతికి కారణమయింది.

 

అయినప్పటికీ తన వల్ల ఎటువంటి తప్పు జరుగలేదని, ప్రతిపక్షాలదే తప్పని బుకాయించడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్యేనని చాటి చెపుతోంది. ఏమయినప్పటికీ, తెలంగాణా విషయంలో నేటికీ కాంగ్రెస్ తన మాటకి కట్టుబడి ఉండటమే చాలా గొప్ప విషయం అని చెప్పుకోక తప్పదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu