వాసాలమర్రిపై సీఎం వరాలెందుకు! అసలు కథ ఇదా కేసీఆర్.. !

ప్రగతి భవన్ ను, ఫామ్ హౌజ్ ను వీడి ప్రజల్లోకి వెళుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. జిల్లాలు చుట్టేస్తున్నారు. రెండు రోజుల్లో నాలుగు జిల్లాలు పర్యటించిన గులాబీ బాస్.. మంగళవారం తన దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిని సందర్శించారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తర్వాత గ్రామ సభలో పాల్గొన్నారు కేసీఆర్. ఈ సందర్భంగా వాసాలమర్రిపై వరాల జల్లు కురిపించారు. ఏడాదిలోనే వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిగా మారుస్తానని చెప్పారు. గ్రామస్తులకు కూడా బోలేడు వరాలు ప్రకటించారు కేసీఆర్. 

సీఎం కేసీఆర్ వాసాలమర్రి పర్యటనపై రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసీఆర్ ను ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తన ఫౌమ్ హౌజ్ దారి కోసమే వాసాలమర్రిని డెవలప్ చేయాలని కేసీఆర్ చూస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రోడ్లు వేసేది కూడా తన కాన్వాయ్ పోవడానికి వీలుదా ఉండేందుకేనని విమర్శించారు.

కేసీఆర్ వాసాలమర్రి వరాలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరో ఆసక్తికర విషయం చెప్పారు. యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామిని జగదేవ్‌పూర్ మీదుగా వెళ్లి దర్శనం చేసుకున్న చాలామంది సీఎంలు పదవులు కోల్పోయారని ఓ స్వామి సీఎం కేసీఆర్ కు చెప్పడంతోనే, వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిగా చేస్తానని హామీ ఇస్తున్నారని అర్వింద్ ఆరోపించారు.  2000 జనాభా ఉన్న వాసాలమర్రి మీదుగా యాదాద్రికి వెళ్లడానికే 60 ఫీట్ల రోడ్లు, వరాలు జల్లులు అని విమర్శలు చేశారు.

 వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిగా చేయడానికి మార్బలం అవసరం ఏమిటని, ప్రతి ఇంటికి పోలీస్ బందోబస్తు పెట్టిమరీ సీఎం పర్యటన చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్ ఇచ్చిన షాక్ తోనే, హుజురాబాద్ ఉపఎన్నికల కోసం జిల్లాల పర్యటన చేస్తున్నారన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పేరుచెప్పి కేసీఆర్ చేసిన 4 లక్షల కోట్ల అప్పులు, ప్రభుత్వ భూముల అమ్మకాల విషయంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయిస్తామని, ఈ విషయంలో బీజేపీ పెద్దలతో ఒత్తిడి తెస్తానని అన్నారు. సీఎం చెప్పినట్లు చేస్తూ సర్కారు భూములు కొన్న, అమ్మిన వారికి సహకరించే అధికారులకు భవిష్యత్తులో కష్టాలు తప్పవన్నారు. ఎంపీ అర్వింద్. 

కేసీఆర్ వాసాలమర్రి పర్యటనపై విపక్షాలు చేస్తున్న కామెంట్లపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. వాస్తు కోసం కేసీఆర్ ఏమైనా చేస్తారని కొందరు చెబుతున్నారు. వాస్తు బాగాలేదనే సచివాలయానికి వెళ్లలేదనే సంగతిని గుర్తు చేస్తున్నారు. ప్రగతి భవన్ ను కూడా వాస్తు సరిగా లేదని రిన్నోవేషన్ చేయించారని మరికొందరు అంటున్నారు. ఈ లెక్కన కేసీఆర్ వాసాలమర్రి పర్యటనపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై జనాల్లోనూ ఆసక్తికర చర్చే జరుగుతోందని తెలుస్తోంది.