పేర్లని ఎందుకు మర్చిపోతాం!

 

ఇంట్లో మనతో కలిసి ఉండేవారి పేరుని మర్చిపోలేకపోవచ్చు. మనతో పాటు ఆఫీసులో పనిచేసేవారి పేరూ మర్చిపోకపోవచ్చు. అదే పేరు పదేపదే తల్చుకోవడం వల్ల ఇలా మనకి దగ్గరగా ఉండేవారి పేరు నాలుక మీదే ఆడుతూ ఉంటుంది. కానీ అకస్మాత్తుగా రోడ్డు మీద పాత పరిచయస్తుడు కనిపిస్తే! ఫలానా కథలో ప్రధాన పాత్ర ఎవరు అన్న ప్రశ్న వినిపిస్తే! చాలా సందర్భాలలో మనం పేర్లని మర్చిపోవడానికి బోలెడు కారణాలున్నాయట...

పొంతన ఉండదు
చాలా సందర్భాలలో పేరుకీ మనిషికీ అసలు పొంతనే ఉండదు. పండు అన్న మనిషి కాయలాగా ఉండవచ్చు. రామారావు అన్న పేరు కల్గినవాడు పరమ దుర్మార్గుడై ఉండవచ్చు. ఫలితంగా మనకి అతని పట్ల ఉండే అభిప్రాయానికీ, అతని పేరుకీ పొంతన లేకపోవడం వల్ల చటుక్కున పేరు గుర్తుకువచ్చే అవకాశం ఉండదు.

 

అయోమయం
రాముడు, సుగ్రీవుని ఎలా చంపాడు అంటే ‘చెట్టు చాటు నుంచి’ అంటూ చటుక్కున జవాబు చెబుతాము. కానీ రాముడు చంపింది సుగ్రీవుని కాదనీ, అతని సోదరుడు వాలిని అని చెప్పడానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే వాలి, సుగ్రీవులు ఇద్దరూ వానరులే. ఇద్దరూ రామునితో సంబంధం ఉన్నవారే! కాబట్టి ఇద్దరి పేర్లూ మెదడులో కలిసిపోయే ప్రమాదం ఎక్కువ.

 

ఒకటే పాత్ర – రెండు పేర్లు
ఆఫీసులో వెంకట్రాయుడు, వెంకట్రావు అన్న పేర్లు ఉన్న ఇద్దరు ఉద్యోగులు ఉంటే ఇద్దరిలో ఎవరి పేరు ఏమిటో పోల్చుకోవడం కష్టమే! ఆ ఇద్దరూ చేసే పని ఒకటే అయినప్పుడు వారి పేర్లు మరింత అయోమయానికి గురిచేస్తాయి. సినిమానటులు, రాజకీయవేత్తల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం తరచూ ఇలాంటి అయోమయానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు.

 

ఆసక్తి లేకపోవడం
ఒకో మనిషికీ ఒకో రంగం మీద ఆసక్తి ఉంటుంది. అందులో ప్రతి మనిషి గురించీ టకటకా పొల్లు పోకుండా చెప్పేస్తారు. కొందరికి అసలు దేనిమీదా ఆసక్తి ఉండదు. అసలు చుట్టుపక్కల మనుషులనే పట్టించుకోరు. ఇలాంటివారు తాము వార్తల్లో వినే పేర్లనీ, రోజూ కలిసే వ్యక్తుల పేర్లనీ ఆ నిముషంలోనే మర్చిపోయే అవకాశం ఉంది.

 

ఒకే రూపు
స్నేహా ఉల్లాల్‌, ఐశ్వర్యా రాయ్‌ ఒకేలా ఉంటారు. ఇద్దరూ మనకి తెర మీద పరిచయమే కాబట్టి ఏ ఫొటో ఎవరిదో పోల్చుకోగలం. కానీ మన పాత స్నేహితులలో ఇద్దరు ఒకే రూపుతో ఉంటే! దశాబ్దాల తరువాత వారి ఫొటోలు మన కంటపడిదే? ఎవరెవరో పోల్చుకోవడం కష్టం కదా! మనుషుల రూపురేఖలకీ, వారి పేర్లకీ మధ్య మెదడు లంకె వేసుకుంటుంది. కానీ ఆ రూపురేఖలు ఒకేలా ఉంటే మనసు కూడా అయోమయానికి గురవుతుంది.

పేరుని గుర్తుచేసుకోవడం అనేది ఓ సంక్లిష్టమైన ప్రక్రియ.  లిప్తమాత్ర కాలంలో మెదడు లోలోపలి పొరల్లో నిక్షిప్తమై ఉన్న వింత శబ్దాలని గుర్తుచేసుకోవడం నిజంగా కష్టమే కదా! అవి అర్థవంతంగా లేకపోతేనో, మరో పాత్రతో కలిసిపోయి అయోమయం కలిగిస్తుంటేనో... పాపం మెదడు ఎంత కష్టపడుతుందో కదా. కాబట్టి అకస్మాత్తుగా ఏదన్నా పేరు గుర్తుకురాకపోతే కంగారుపడకుండా, అది సహజమే అని సరిపెట్టుకోవాలి. కానీ గుర్తుండాల్సిన సందర్భంలోనూ కూడా పేర్లని మర్చిపోతుంటే మాత్రం... అందుకోసం కొన్ని చిట్కాలను ప్రయోగించమంటున్నారు. ఆ చిట్కాలు మరోసారి చెప్పుకొందాం.

 

- నిర్జర.