తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా.. వణికించేస్తున్న కోల్డ్ వేవ్
posted on Jan 8, 2025 12:07PM

తెలుగు రాష్ట్రాలను చలి పులి చంపేస్తోంది. రెండు రాష్ట్రాలలోనూ కూడా తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఉదయం పది గంటల వరకూ కూడా బయటకు రావడానికి జంకుతున్న పరిస్థితి. ప్రతి ఏడూ సంక్రాంతి వస్తున్నదంటే చలి తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అయితే ఈ ఏడు మాత్రం వాతావరణం అందుకు భిన్నంగా ఉంది. జనవరి రెండో వారం వరకూ చలి తీవ్రత పెరుగుతూ వస్తుందని వాతావరణ శాఖ చెబుతోంది.
మరో వారం రోజుల పాటు తెలుగురాష్ట్రాలు కోల్డ్ వేవ్ ను భరించాల్సిందేనని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదౌతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని ఏజెన్సీ ప్రాంతాలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు అత్యల్పానికి పడిపోయాయి. ముఖ్యంగా గత పది రోజులుగా అర్బన్, మైదాన ప్రాంతాలలో కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయిపలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల దిగువకు పడిపోయాయి.
హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి ఆందోళన నేపథ్యంలో ప్రజలు జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకూ చలికి ఎక్స్ పోజ్ కాకుండా ఉండటమే మేలని అంటున్నారు.