తల్లిదండ్రులను చూసుకోకపోతే జీతం కట్ ...గ్రూప్-2 ఉద్యోగాలకు సీఎం హెచ్చరిక
posted on Oct 18, 2025 7:59PM

హైదరాబాద్ శిల్ప కళావేదికలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు కొత్తగా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేవారు, ఉద్యోగులు తమ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని అదే జరగకపోతే వారి జీతంలో కోత విధించి తల్లిదండ్రులకు అందజేస్తామని తెలిపారు. ఇందుకోసం త్వరలోనే చట్టం తెస్తామని పేర్కొన్నారు. విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందని సీఎం పేర్కొన్నారు.
అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్కక్షణం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదని ముఖ్యమంత్రి విమర్శించారు. అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే మీకు ఎనిమిదేళ్ల క్రితమే ఉద్యోగాలు వచ్చేవి ఆయన పేర్కొన్నారు. వాళ్ల కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారు తప్ప గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి స్ఫష్టం చేశారు. పదిహేనేళ్లుగా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ జరగలేదు అంటే… ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందని సీఎం ప్రశ్నించారు. మిమ్మల్ని తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత టీజీపీఎస్సీ తీసుకుందన్నారు.
ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్ అని ముఖ్యమంత్రి తెలిపారు. మీ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలి. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దని నిస్సహాయులకు సహాయం చేయండి.. పేదలకు అండగా నిలవలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గోన్నారు.