ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
posted on Sep 20, 2025 9:31PM

తెలంగాణ ఆడబిడ్డలందరికీ సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతిని, పూలను ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే ఈ పండుగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, మహిళల ఔన్నత్యానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల ఐక్యతకు, కష్టసుఖాలను కలిసి పంచుకునే వారి సామూహిక జీవన విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ఆడపడుచులందరూ ఈ పూల పండుగను సంతోషంగా, కలిసికట్టుగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలను రాష్ట్ర ప్రజలందరూ ఆటపాటలతో ఘనంగా నిర్వహించుకోవాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.
మరోవైపు ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మాజీ సీఎం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి బతుకమ్మ తరతరాల ప్రతీకగా నిలిచిందని, పూలను దేవతగా కొలిచేదే బతుకమ్మ పండుగ అని ఉద్ఘాటించారు. ప్రపంచ సంస్కృతీ, సంప్రదాయాల్లో తెలంగాణ ప్రత్యేకతను చాటుతోందని తెలిపారు. ఆదివారం నుంచి ప్రారంభమవుతున్న ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.