మంత్రుల అరెస్ట్‌.. మ‌మ‌త ఫైర్‌.. సీబీఐ వ‌ర్సెస్ తృణ‌మూల్‌

బెంగాల్ రాజ‌కీయం భ‌గ్గుమంటోంది. ఓడినా క‌మ‌ల‌నాథుల జోరు త‌గ్గ‌లేదు. క‌క్ష సాధింపు చ‌ర్య‌లు ఆప‌లేదు. పాత కేసుల్లో కొత్త‌గా అరెస్టుల‌తో బెంగాల్‌లో మ‌రోసారి దంగ‌ల్ మొద‌లైంది. నార‌ద కుంభ‌కోణం కేసులో టీఎంసీకి చెందిన ఇద్ద‌రు మంత్రుల‌ను సీబీఐ అరెస్ట్ చేయ‌డంతో మ‌రోసారి ర‌చ్చ రాజుకుంది. అరెస్టుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. సీబీఐ ఆఫీసు ముందు ఆందోళ‌నకు దిగ‌డం ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. 

నార‌ద కుంభ‌కోణం కేసులో ప‌శ్చిమ బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హ‌కీంతో పాటు మరో మంత్రి సుబ్రతా ముఖర్జీని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఎమ్మెల్యే మదన్ మిత్ర, కోల్‌క‌తా మాజీ మేయ‌ర్‌ సోవన్ ఛటర్జీని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇదే కేసులో అప్పటి తృణమూల్ కాంగ్రెస్ నేత, నేటి బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారిపై విచారణకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతినిచ్చారు.

నార‌దా కుంభ‌కోణం. ఒక‌ప్పుడు బెంగాల్‌ను షేక్ చేసిన బ‌డా స్కాం. 2014లో ఓ వ్య‌క్తి తాను బ‌డా వ్యాపారవేత్తనంటూ.. ప‌శ్చిమ బెంగాల్‌లో పెట్టుబ‌డులు పెడ‌తానంటూ, ఏడుగురు తృణమూల్ ఎంపీలు, నలుగురు మంత్రులు, ఓ ఎమ్మెల్యేను క‌లిశారు. వారికి కొంత డ‌బ్బు ఇచ్చినట్టు స్టింగ్ ఆప‌రేష‌న్ వెలుగు చూడ‌టం సంచ‌ల‌నంగా మారింది. 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ టేపుల వ్యవహారం క‌ల‌క‌లం రేపాయి. అయితే నాటి ఎన్నిక‌ల్లో టీఎంసీ విజ‌యం సాధించ‌డంతో ఈ కుంభ‌కోణం మ‌రుగున ప‌డింది. తాజాగా ఈ టేపుల వ్య‌వ‌హారం తెర‌పైకి వ‌చ్చింది. ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్క‌ర్ ఈ కేసు విచారణను సీబీఐకి అప్ప‌గించారు. తాజాగా, ఆ కేసులో ఇద్ద‌రు మంత్రులను సీబీఐ అరెస్ట్ చేయ‌డంతో రాజ‌కీయం వేడెక్కింది. 

మంత్రుల అరెస్టుల‌పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భగ్గుమన్నారు. కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయానికి చేరుకుని నిర‌స‌న తెలిపారు. తృణమూల్ నాయకులు, మద్దతుదారులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లిరావ‌డంతో సీబీఐ కార్యాల‌యం ద‌గ్గ‌ర ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. ‘‘ఇద్దరు మంత్రులను అరెస్ట్ చేశారు. నిబంధనలకు అనుగుణంగా వారి అరెస్టులు జరగలేదు. సీబీఐ నన్ను కూడా అరెస్ట్ చేయాలి’’ అంటూ మమత డిమాండ్ చేశారు. బీజేపీ ఓటమిని జీర్ణించుకోలేకపోతోందని, అందుకే తమ నేతలను అరెస్టు చేసి పగ తీర్చుకుంటోందని టీఎంసీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. 

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మంత్రుల‌ను, తృణ‌మూల్ నాయ‌కుల‌ను అరెస్ట్ చేశారంటూ టీఎంసీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. విచారణ నిమిత్తమే వారిని తీసుకెళ్లినట్లు సీబీఐ చెబుతోంది. గవర్నర్ జగదీప్‌ ధనకర్ అనుమతి మేరకే వీరిపై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని సీబీఐ తెలిపింది.